అంకెల్లో 2017
సంఖ్యాశాస్త్రం
మరి కొద్దిగంటల్లో మనం అడుగుపెడుతున్న సంవత్సరం... 2017. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2+0+1+7=10=1+0=1 అంటాం. 2017 సంఖ్య ‘1’ అన్నమాట. ప్రపంచం మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఒకటి అనే అంకె... సూర్యుణ్ణి సూచిస్తుంది. సూర్యోదయంలో ఎలా జగతి జాగృతమై, కొత్త రోజుకు ఆహ్వానానికి సిద్ధమవుతుందో... అలాగే ఈ 2017వ సంవత్సరం సూర్యుని చిహ్నం కాబట్టి కొత్తదనానికి నాంది పలుకుతుంది. 2017లో అందరి మనసుల్లో కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు వస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త సంబంధాలు, కొత్త వ్యాపారాలు, కొత్త కరెన్సీ, కొత్త స్ఫూర్తి, కొత్త స్నేహాలు వెల్లివిరుస్తాయి. ముగిసిపోతున్న 2016వ సంవత్సరంలో ఉన్న నిరుత్సాహాన్ని వదిలి నూతనోత్సాహాన్ని నింపుకొని, వినూత్న శకానికి 2017 నాంది పలుకుతోంది. అయితే ఈ మార్పులన్నీ ‘మంచికే’ అన్నది నిస్సందేహం.
స్థూలంగా 2017 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, బయో టెక్నాలజీ, ఫార్మసీ రంగాలలో నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. సాంప్రదాయ విధానాలను ప్రశ్నించడం జరుగుతుంది. పెద్ద సంస్థలు, వ్యాపారసంస్థలు అన్ని విధాలుగా సంస్కరణకు లోనవుతాయి. స్టాక్ మార్కెట్, ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, సాధారణ ప్రజలు అధిక విశ్వాసం, స్ఫూర్తి కలిగి ఒకరికొకరు సహకరించుకుంటారు. ప్రముఖ వ్యక్తుల రహస్యాలు తెలిసి చర్చించుకుంటారు. నూతన ఆలోచనలు, రాజ్యాంగ సవరణలు తెర పైకి వస్తాయి. ముఖ్యంగా యువతకు మంచి జీవనోపాధి కలుగుతుంది. ఈ సంవత్సరం జననాల రేటు పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా పడతాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ముఖ్యంగా, కూరగాయల ఉత్పత్తి పెరుగుతుంది. నాయకులలో ధార్మికత పెరుగుతుంది. ప్రభుత్వం తరఫున యజ్ఞాలు, హోమాలు చేయిస్తారు. ఈ సంవత్సరంలో తాత్కాలికమైన అలజడులు, ‘శాంతి కోసం హింస’ జరిగే అవకాశం ఉంది. దేశాల మధ్య కొత్త సమీకరణాలు ఏర్పడతాయి. ఇది స్థూలంగా 2017 మొత్తం కలిపితే వచ్చే అంకె అయిన 1 గురించి!
అలాగే 2017లో ఉన్న ప్రతి అంకె కూడా విశ్వం మీద తన ప్రభావం చూపుతుంది. ఈ సంవత్సరాన్ని మరో కోణంలో చూస్తే – ‘17’వ సంవత్సరం అని కూడా అంటారు. ‘17’ అనే సంఖ్య కూడితే ‘8’ వస్తుంది. ఇది శనిదేవునికి ప్రతీక. శనీశ్వరుడు ప్రొఫెషన్‌కీ, వ్యాపారానికీ, జీవన విధానానికీ, పురోగతికీ, శాస్త్ర సాంకేతికాలకీ కారకుడు. అందువల్ల ‘2017’లో వ్యక్తిగత వికాసానికీ, నూతన ఆలోచనలకీ, అభివృద్ధికీ బాసటగా ఉండడం వల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఇంతకు ముందే ఉన్న వ్యాపారాలు కొత్త సాంకేతికతతో విస్తరిస్తాయి. అంతేకాకుండా, ప్రతిభకు గుర్తింపు వస్తుంది. అందువల్ల – కష్టపడేవారికి ప్రమోషన్స్ వస్తాయి. శనీశ్వరుడు న్యాయానికీ, కష్టపడడానికీ ప్రతీక. కాబట్టి, ప్రజలు చాలావరకు ధర్మమార్గాన కష్టపడతారు. 2017లోని ‘17’ సంఖ్య దానంతట అదే ప్రజలలో ఈ మార్పునకు దోహదం చేస్తుంది.
ఇక, ‘2017’లో ఉన్న అంకెలలో ప్రతిదానికీ ఓ ప్రత్యేకత ఉంది. 2017లో ఉన్న మొదటి అంకె ‘2’. ఇది చంద్రుణ్ణి సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. కొత్త ఆలోచనలు, క్రియేటివిటీకి కారణం. అందువల్ల ఈ శతాబ్దం అంతా ‘నేను’ అనే కాన్సెప్ట్ పోయి, ‘మనము’ అనే కాన్సెప్ట్ ఉంటుంది. గ్రూపులుగా పనిచేయడం, ప్రజలలో అహం తగ్గడం, పరస్పరం శత్రుత్వాలు వదిలి స్నేహంతో, చెలిమితో సంయుక్త ఆవిష్కరణలకు ఇది నాందీప్రస్తావన అని సూచిస్తుంది. దీనివల్ల ఇతరుల పట్ల శ్రద్ధ, ఆదరణ కలిగించి, సార్వత్రిక సహజీవనంతో అభివృద్ధిలోకి పోయేలా చేస్తుంది.
2017లో మరో అంకె ‘0’. జీరో అనేది ప్లూటో గ్రహానికి సూచన. ఈ గ్రహం అదృశ్య, అగోచర అనంత శక్తికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలకూ సూచన. ప్లూటో సృజనకు ఎంత నిదర్శనం అయినా, ఎంతగా సృజిస్తుందో, అంతగా నాశనం కూడా చేస్తుంది. ఆకస్మిక మరణాలు, కిడ్నాపింగ్‌లు, బలవంతాలు, వైరస్‌లను కూడా ప్రోత్సహిస్తుంది. రహస్యానికీ, గూఢచర్యానికీ... అంటే కంటికి కనపడని చర్యలకు ప్లూటో కేంద్రం. అంటే ప్లూటో ప్రభావం వల్ల నిత్యం మంచి చెడులకు నడుమ ఘర్షణ జరుగుతుంటుంది. అయితే ఈ 2017లో ఉన్న అంకెల ఆధారంగా విశ్లేషిస్తే, ప్లూటో నూతన లక్ష్యాలు, ఆశయాలు, పనులను తెలియజేస్తుంది. చాలా సంఘటనలు అనూహ్యంగా జరిగి, ప్రజలు తమ జీవితంలో కొత్త పుంతలు తొక్కేలా ప్రేరేపిస్తుంది. కొత్త మందులను కనుక్కుంటారు.
2017లోని ‘1’ అంకె మళ్ళీ సూర్యుణ్ణి సూచిస్తుంది. ఈ అంకె ప్రభావం వల్ల ప్రజలలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలు అధికమవుతాయి. ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయిని చేరుకోవాలన్న ఆలోచనలతో సత్ ప్రవర్తనను ప్రదర్శిస్తారు. ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిని సాధించడం కోసం ఉత్తమమైన మార్గాలను అనుసరిస్తారు. యువత సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నత ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతుంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. కంటి, గుండె జబ్బులు వస్తాయి. ‘ఆదిత్య హృదయం’ స్తోత్రం చదవడం, లేదంటే వినడం మంచిది.
2017లో ఉన్న ఇంకొక అంకె – ‘7’. ఇది కేతువును సూచిస్తుంది. కేతువు ఆధ్యాత్మిక వికాసం, ఆత్మ పరిశీలన, మోక్షసాధన కోసం దానాలు, వ్రతాలు, పూజలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేయడానికి ప్రతీక. దేవాలయాలకు ఆదరణ పెరుగుతుంది. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తారు. తాత్కాలిక సుఖాల ప్రభావం నుండి శాశ్వత సత్యసాధన కోసం తపన పడతారు. యోగా, మెడిటేషన్ కేంద్రాలకు ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మికత ప్రజలలో పెరుగుతుంది. నూతన జీవన విధానాన్నీ, సాత్వికతనూ అలవాటు చేసుకుంటారు. దైవశక్తిని నమ్ముతారు. అలా ఈ కొత్త ఏడాది 2017 ఎన్నో శుభాలనిస్తుంది.
డాక్టర్ మహమ్మద్ దావూద్, ఎం.ఏ, జ్యోతిషం