నేడు మనం దుర్ముఖి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దుర్ముఖి అన్నపేరు వినగానే మనలో కొద్దిగా జంకు చోటు చేసుకోవడం సహజం. కానీ మనలోని దుర్భావనలకు దుర్ముఖిగానూ, పెంపొందించు కోవలసిన సద్గుణాలకు, సద్భావనలకు సుముఖిగానూ భావించగలిగితే సంవత్సరం పేరు మీద మనకు ఏర్పడిన భయాలూ అపోహలూ తొలగిపోతాయి. ఉగాదిపచ్చడితో షడ్రుచులనూ ఆస్వాదించినట్లే, పాత సంవత్సరంలో మనలో చోటు చేసుకున్న నిరాశానిస్పృహలనూ, భయాందోళనలనూ, జడత్వాన్నీ, నకారాత్మక ఆలోచనలనూ వదిలించుకుందాం, ఉగాది పచ్చడిలో ఆరు రుచులూ తీపీ, చేదూ, కారం, వగరూ, పులుపూ, ఉప్పూ ఉన్నాయి కదా. ఈ ఆరు అనే అంకెను సంకేతంగా స్వీకరించి కనీసం ఆరు ఉత్తమ అంశాలను పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం.
మానవీయ సంబంధాల పునరుద్ధరణకు పెద్దపీట వేద్దాం: సాటి మనుషులను చిరునవ్వుతో పలకరిద్దాం. మానవీయ సంబంధాలలో అడ్డుగా నిలిచే ప్రధాన అవరోధం అహంకారం. మన అహాన్ని తగ్గించుకుని, అవతలి వారి దృక్కోణం నుంచి కూడా చూడగలిగితే మన సంబంధాలు చాలా వరకు మెరుగు పడతాయి. అలాగే కష్టసుఖాలలో ఒకరికొకరు తోడూనీడగా నిలబడటం ద్వారా కూడా చక్కటి ప్రేమాస్పద జీవితాన్ని సాధించుకోగలుగుతాం.
ఆర్జనతోబాటూ ఆదరభావాన్నీ పెంపొందించుకుందాం: ధన సంపాదన ముఖ్యమే కానీ, ధనసంపాదన అనే బలిపీఠంపై అన్ని విలువలనూ, జీవిత మాధుర్యాన్నీ బలివ్వడం మానుకుందాం. మన జీవిత సహచరులకంటే మన వాళ్లకంటే, వారి ప్రేమాదరాలకంటే సంపాదనే ముఖ్యం అన్న ఆలోచనకు చరమగీతం పాడుదాం. రోజులో కొంత సమయాన్నయినా కుటుంబానికి కేటాయిద్దాం. పిల్లలు లేదా ఇంటిలోని పెద్దవాళ్లతో కొంచెంసేపైనా గడపటం అలవరచుకుందాం.
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పురుగుమందుల అవశేషాలతో, పారిశ్రామిక వ్యర్థాలూ, ఈ- వేస్టేజీ అని మనం ముద్దుగా పిలుచుకునే ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో విషతుల్యంగా మారిన భూమి, కాలుష్య హాలాహలంతో నిండిన నదీనదాలూ, సముద్రాలూ, విషవాయువులతో నిండిన వాయుమండలమూ... ఇవేనా మనం మన రేపటితరానికి అందించే వారసత్వ సంపద? సిగ్గుచేటు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ హితమైన వ్యవసాయ పారిశ్రామిక విధానాలూ, వ్యర్థాలను ప్రమాదరహితంగా తొలగించుకునే పద్ధతుల రూపకల్పన చేసుకుందాం. ఈ సత్కార్యాన్ని ఈ కొత్త సంవత్సరంలోనైనా ప్రారంభిద్దాం.
తల్లిభాషను కాపాడుకుందాం: ఇంగ్లిష్ విద్యను ఉపాధి కల్పనకో, విజ్ఞాన వికాసానికో ఉపయోగించడంలో తప్పులేదు కానీ మాతృభాషలో మాట్లాడటమే అవమానకరమన్న స్థాయికి మాత్రం మనం దిగజారకూడదు. మన పిల్లలతో మనం మాతృభాషలోనే మాట్లాడదాం. మాతృభాషను మృతభాష కాకుండా కాపాడుకుందాం. అలాగే మన పెద్దలు, రుషులు, మహాకవులు జాతి ఉద్ధరణ కోసం రచించిన పురాణ సాహిత్యం, కావ్యసంపద, గణిత, ఖగోళ, జ్యోతిష, వైద్య, శిల్ప, చిత్రలేఖనం, ఆర్థిక, పరిపాలనా రంగాల్లో మన ప్రాచీనులు సాధించిన ప్రగతిని గురించి మనం తెలుసుకుందాం. రామాయణ, భారత, భాగవతాలు, గీతామకరందాలను మతగ్రంథాలుగా కాకుండా, వ్యక్తిత్వ వికాసానికీ, భావ వ్యక్తీకరణ నైపుణ్య అభివృద్ధికీ, మానవీయ సంబంధాలను గురించిన అమూల్య సమాచారాన్ని అందించే భాండాగారాలుగా గుర్తించి, ఉపయోగించే ప్రయత్నం చేద్దాం.
స్త్రీలను గౌరవిద్దాం: యత్ర నార్యస్తు పుజ్యంతే రమంతే తత్ర దేవతాః అని శతాబ్దాల కిందటే ప్రబోధించిన మహోన్నత సంస్కృతి మనది. ఇట్లాంటి దేశంలో స్త్రీలను చిన్నచూపు చూడటం, చివరకు గర్భంలో ఉన్నది స్త్రీ శిశువు అని తెలియగానే భ్రూణ హత్యలకు తెగించడం ఎంత ఘోరం! పసిపాపల నుంచి, పండుముసలి వారివరకు స్త్రీలను గౌరవించడం, ఆదరించటం, సమానావకాశాలను కల్పిద్దాం. వారిపై అఘాయిత్యాలను, అకృత్యాలను ఇకనైనా ఆపివేద్దాం.
పెద్దలను ప్రేమిద్దాం: మనకు జన్మనిచ్చి, విద్యా సంస్కారాలను అందించి, మనల్ని మనుషులుగా నిలబెట్టిన తల్లిదండ్రులు సదా ఆదరింపదగిన వారు. కానీ దురదృష్టమేమిటో, తలిదండ్రులే తమ వృద్ధాప్యంలో అనాదరణకు గురవుతూ జీవితాన్ని దుర్భరంగా ఈడ్చవలసి రావడం ఎంత దురదృష్టం! మరెంతటి అమానవీయం! మనం మన పిల్లల ఎదుట మన తలిదండ్రులను ప్రేమాదరలాతో చూసుకుంటే ఒక మంచి జీవిత పాఠాన్ని మన సంతానానికి చెప్పించిన వాళ్లమవుతాము. రేపు వాళ్లూ మనల్ని ఆదరిస్తారు.
- ఆర్.ఎ.ఎస్. శాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఆదోని