
తలలకు రక్ష
ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా చలాన్లు గీకేస్తుంటే, వారి బారి నుంచి తప్పించుకోవడానికి బజారులో దొరికే ఏవో హెల్మెట్‌ను కొనుక్కొచ్చి, తప్పనిసరిగా తలలకు తగిలించుకుంటాం. వాటి నాణ్యతను పెద్దగా పట్టించుకోం. అవి మన తలలకు ఏమాత్రం రక్షణ ఇస్తాయోనని ఆలోచించనే ఆలోచించం. యాక్సిడెంట్ల నుంచి హెల్మెట్లు ఎంతో కొంత రక్షణనిస్తాయనేది కాదనలేం గానీ, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి తలలకు పూర్తి రక్షణ ఇస్తాయనే భరోసా ఏమీ లేదు.
అయితే, ఇక్కడ కనిపిస్తున్న 6డీ హెల్మెట్ మాత్రం సాధారణ హెల్మెట్లకు పూర్తిగా భిన్నమైనది. నిక్షేపంగా దీనిని ధరించే వారి తలలు పదిలంగా ఉంటాయి. ఈ హెల్మెట్ లోపల రెండు పొరలుగా ఫోమ్ లేయర్ ఉంటుంది. రెండు పొరలను విభజిస్తూ, వాటి మధ్య గాలి చొరబడేందుకు వీలుగా ఉండే చిన్న చిన్న రబ్బర్ సక్షన్ కప్పుల మాదిరి ఐసోలేషన్ డ్యాంపర్స్ బయటి నుంచి ఎదురైన ఎలాంటి తాకిడినైనా తట్టుకుని, తలకు పూర్తి రక్షణ కల్పించగలవని కాలిఫోర్నియాలోని ‘6డీ హెల్మెట్స్’ కో-ఫౌండర్ బాబ్ వెబర్ చెబుతున్నారు.