అతిథికి అందమైన ఆహ్వానం
ఇంటికొచ్చిన అతిథికి సాదరస్వాగతంతోపాటు చక్కని విందు భోజనం పెట్టాలన్న తాపత్రయం ఉంటుంది. కానీ చక్కగా అమర్చి వడ్డించడానికి అందమైన టేబుల్ లేదనే బెంగ చాలామందిలో ఏదో ఒక మూల ఉంటుంది. అలాంటిదేదైనా ఉంటే ఈ టేబుల్ డెకరేషన్ స్టయిల్స్‌ని గమనించండి. ఇక్కడ ఉన్న టేబుళ్లలో ఏదీ ప్రత్యేకమైన మోడల్ కాదు, అన్నీ సాధారణమైనవే. అయితే కలర్‌ఫుల్ క్లాత్, ఫ్లవర్‌పాట్స్, టేబుల్ నాప్‌కిన్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. సందర్భానికి అనుగుణంగా టేబుల్ డెకరేషన్ ఉంటే చాలు, అతిథులు మీ ఆతిథ్యాన్ని ఆహ్లాదంగా స్వీకరిస్తారు.
సాయంత్రం టీ, స్నాక్స్‌తో ఆతిథ్యం ఇస్తుంటే... టీ పాట్, కప్పులు, ఒక ప్లేట్, ఆ ప్లేట్‌కు కుడివైపున నైఫ్, ఎడమవైపున ఫోర్క్ అమర్చాలి. పిల్లల బర్త్‌డే పార్టీకి వచ్చే అతిథులు కూడా పిల్లలే అయి ఉంటారు. కాబట్టి పెద్ద బొమ్మలున్న టేబుల్ క్లాత్ వేసి, పక్కనే మోడరన్ ప్రింట్స్ కర్టెన్ వేస్తే కలర్‌ఫుల్‌గా ఉంటుంది.
రాత్రిపూట గార్డెన్‌లో మూన్‌లైట్ డిన్నర్ చేయాలనుకుంటే... ముదురు రంగు టేబుల్ క్లాత్ పరిచి తెల్లటి ప్లేట్లు పెట్టాలి. పొడవాటి గాజు గ్లాసులో క్యాండిల్ పెట్టి వెలిగించాలి.