full meals
-
10 Rupee Biryani: రూ.10కే కడుపు నిండా భోజనం... రూ.10కే బిర్యానీ కూడా..
రూ.10కే కడుపు నిండా భోజనం. ప్రస్తుత రోజుల్లో ఇది వినడానికి కొంచెం ఆశ్చరంగానే ఉంటుంది. ఎందుకంటే హోటల్లో ఓ ప్లేటు భోజనం తినాలంటే రూ.100కు పైనే అవుతుంది. అంత మొత్తం చెల్లించుకోలేని పేద రోగుల సహాయకులకు వాల్తేర్ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ చైర్మన్ మక్సూద్ అహ్మద్ సహకారంతో.. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ రూ.10కే సంతృప్తికర భోజనం అందిస్తోంది. ఎంతో మంది అనాథలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన ఈ సంస్థ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే నానుడిని నమ్ముతూ.. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న భావనతో ముందుకు సాగుతోంది. విశాఖపట్నం: అభాగ్యుల సేవలో అలుపన్నదే లేకుండా పయనిస్తోంది స్వామి వివేకానంద సంస్థ. కరోనా సమయంలో కూడా కేజీహెచ్‌లోని రోగుల సహాయకులు, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, వివిధ రైతుబజార్లలోని స్టాళ్లు నడుపుకునే రైతులకు ఆహారం అందజేసింది. వివేకానంద వృద్ధాశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ పర్యవేక్షణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. కాగా.. ఘోషాస్పత్రికి ప్రసవాల నిమిత్తం దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నట్లు సంస్థ గుర్తించింది. రోగుల సహాయకులకు అతి తక్కువ ధరకే ఆహారం అందించాలని సంకల్పించింది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రూ.10కే భోజనం అందించే బృహత్తక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాల్తేరు రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ చైర్మన్ మక్సూద్ అహ్మద్ సహకారంతో 150 రోజులకు పైగా ఘోషాస్పత్రిలో రోగుల సహాయకులకు ఆహారం అందజేస్తోంది. ‘అమృతాహార్’పేరిట అందిస్తున్న ఈ భోజనం నిజంగానే అమృతంలా ఉందని రోగుల సహాయకులు కొనియాడుతున్నారు. తొలుత ఇక్కడ రోజుకు 100 మందికి ఆహారం అందించేవారు. క్రమంగా ఈ సంఖ్య పెరగడంతో 120కి పెంచారు. ఇంకా అవసరం అనుకుంటే ఈ సంఖ్యను మరింత పెంచుతామని వివేకానంద సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. రోగుల సహాయకులు హోటళ్లలో అధిక ధరలు చెల్లించి ఆహారం కొనుగోలు చేయలేకపోవడం, ఇక్కడ క్యాంటీన్ సదుపాయం కూడా లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకొస్తే.. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా అందజేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రుచిగా.. శుచిగా.. అన్నార్తుల కోసం తయారు చేసే ఆహారం రుచిగా, శుచిగా ఉండాలన్నది సంస్థ లక్ష్యం. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘అమ్మవంట’నూకాలమ్మ పర్యవేక్షణలో వివేకానంద సేవా సంస్థకు చెందిన మహిళలు వంట చేస్తున్నారు. వంట చేసే ప్రాంతంలోనే హరినామ సంకీర్తన చేస్తూ.. భోజనాన్ని శుభ్రంగా ప్యాక్ చేస్తారు. ఆటోలో ఘోషాస్పత్రికి తీసుకొచ్చి రోగుల సహాయకులకు అందజేస్తున్నారు. ప్రతి 50 రోజులకు ఓసారి రూ.10కే బిర్యానీ రోగుల సహాయకులకు రుచి, శుచికరమైన భోజనం అందించేందుకు మంచి రకం బియ్యం, నూనె వాడుతున్నాం. గ్యాస్‌తో కాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. ఆ పొయ్యి ఖరీదు రూ.1.80 లక్షలు. ఈ కార్యక్రమానికి డి.సత్యనారాయణ, సీహెచ్ పోతురాజు, ఉమాదేవి, రాణి, సుజాత, భవానీ, నాగమణి, ర త్న, అచ్యుత, కనకమహాలక్ష్మి, డి.సత్యనారాయణ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ప్రతీ 50 రోజులకు ఒకసారి రోగు ల సహాయకులకు రూ.10కే బిర్యా నీ అందజేస్తున్నాం. – సూరాడ అప్పారావు, భోజనం బాగుంది మా పాప డెలివరీ కోసం ఘోషాస్పత్రికి వచ్చాం. బయట మూడు పూటలా భోజనం కొనుక్కుని తినలేకపోతున్న సమయంలో.. ఇక్కడ రూ.10కే ఇస్తారని తెలిసిన వాళ్లు చెప్పారు. రెండు రోజులుగా ఇక్కడికి వచ్చి భోజనం తీసుకెళ్తున్నాను. భోజనం శుభ్రంగా.. ఇంట్లో చేసినట్లే ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. – పద్మ, సింహాచలం తక్కువ ధరకే మంచి భోజనం మా అమ్మాయి ప్రసవం కోసం ఈ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం ఇస్తున్నారని తెలిసి రెండు రోజులుగా తీసుకుంటున్నాను. భోజనం చాలా బాగుంది. ఈ రోజుల్లో పది రూపాయలకు ఏం వస్తుంది? ఇంత చక్కటి భోజనం తక్కువ ధరకే ఇస్తున్న వారు ధన్యులు. – దానీలు, జెండాచెట్టువీధి అన్నీ ప్రత్యేకమైన ప్యాక్‌లో.. వీలున్నప్పుడల్లా ఇక్కడ భోజనం చేస్తుంటాను. చాలా బాగుంటుంది. చక్కని ప్యాకింగ్‌లో భోజనం తీసుకొచ్చి అందజేస్తారు. పేషెంట్ల సహాయకులు ఇక్కడే ఏ చెట్టు కిందో కూర్చుని భోజనం చేస్తారు. అన్నం, కూరలు, సాంబారు అన్నీ ప్రత్యేకంగా ప్యాక్ చేయటం వల్ల సులువుగా శుభ్రం చేసుకునే వీలుంది. –డి.గణేష్, స్వీపర్, ఘోషాస్పత్రి పుణ్యమంతా వీళ్లదే.. మా మనవరాలు డెలివరీకి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం పెడుతున్నారని తెలుసుకుని వచ్చాను. భోజనం చాలా బాగుంది. పుణ్యమంతా వీళ్లదే. ఉదయం, రాత్రి కూడా తక్కువ ధరకి ఆహారం ఇస్తే బాగుంటుంది. – నక్కా సూరి అప్పాయమ్మ, మధురవాడ రూ.10కే భోజనం.. గొప్ప విషయం మాది దిబ్బపాలెం. పాప డెలివరీ కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కు భోజనం తీసుకుంటున్నాం. చాలా బాగుంది. రుచిగానే కాదు శుభ్రంగానూ ఉంది. పది రూపాయలకే ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే గొప్ప విషయమే. – వి. గౌరీ, దిబ్బపాలెం పేదలకు ఉపయోగకరం మా కోడలి పురిటికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడంతా ఏం తెలియదు. భోజనానికి ఇబ్బంది పడుతుంటే ఎవరో ఇక్కడ రూ.10కే మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు. రెండు రోజులుగా ఈ భోజనం తింటున్నాం. చాలా బాగుంది. పేదలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. –పిరిడి అప్పలనాయుడు, ఎస్.కోట -
కడుపునిండా తినండి బాబూ!
రెస్టారెంట్, ఫుడ్ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్‌మీల్స్ ప్లేట్ తీసుకుంటే... హోటల్ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు. ఇలాంటి హోటల్స్ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్‌మీల్స్ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు. కర్ణాటకలోని మణిపాల్‌కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్ నగర్ రోడ్‌లోని హోటల్ గణేష్ ప్రసాద్ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
బీట్రూట్ పులావ్
ఫుల్ మీల్స్ కావలసినవి: బియ్యం - 1 కప్పు, నీళ్లు - 2 కప్పులు, బీట్రూట్ తురుము - 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కొత్తిమీర - కొద్దిగా, బిర్యానీ మసాలా - 1 చెంచా, గరం మసాలా - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, నిమ్మరసం - 1 చెంచా, సోంపు - అరచెంచా, బిర్యానీ ఆకు - 1, యాలకులు - 2, లవంగాలు - 2, దాల్చినచెక్క - చిన్నది, పుదీనా - కొద్దిగా తయారీ: బియ్యాన్ని కాసేపు నానబెట్టాలి. గిన్నెలో నూనె వేసి, వేడెక్కాక సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. తర్వాత బీట్రూట్ తురుము, కొత్తిమీర, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఉప్పు వేయాలి. వేగాక నీళ్లు పోసి, నిమ్మరసం పిండి మూత పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యం వేసి, ఓసారి బాగా కలిపి మూత పెట్టాలి. అన్నం ఇగిరిపోయాక దించేసుకుని, పుదీనా చల్లి వడ్డించాలి. అరటిపండు పాయసం కావలసినవి: అరటిపండ్లు - 2, పాలు - 2 కప్పులు, నీళ్లు - అరకప్పు, చక్కెర - అరకప్పు, యాల కుల పొడి - అరచెంచా, నెయ్యి - 3 చెంచాలు, తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు కలిపి - పావుకప్పు తయారీ: అరటిపండ్లను ఒలిచి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి, కరిగాక డ్రైఫ్రూట్స్‌ని వేయించి తీసేయాలి. అదే గిన్నెలో అరటిపండు పేస్ట్ వేసి రంగు మారేవరకూ వేయించాలి. తర్వాత చక్కెర వేసి కాపేపు వేయించాలి. చక్కెర కరిగి కాస్త పాకంలాగా అవుతుండగా నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కగా అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, కావాలంటే కాస్త నెయ్యి కూడా పోసుకుని దించేయాలి. డ్రైఫ్రూట్స్ వేసి కలిపి వడ్డించాలి. కేరళలో ఈ పాయసంలో చక్కెర బదులు బెల్లం వేసి చేసుకుంటారు. కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆరెంజ్ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - అరకిలో, ఆరెంజ్ జ్యూస్ - 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు - పావుకప్పు, కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు, కోడిగుడ్లు - 2, వెనిగర్ - 5 చెంచాలు, అల్లం తురుము - 1 చెంచా, వెల్లుల్లి తురుము - 1 చెంచా, మిరియాల పొడి - అర చెంచా, ఉప్పు, నూనె - సరిపడా, సోయా సాస్ - 2 చెంచాలు, టొమాటో కెచప్ - 1 చెంచా తయారీ: కోడిగుడ్డు సొనను బీట్ చేసుకోవాలి. చెంచాడు కార్న్ ఫ్లోర్‌ను చల్లని నీటిలో కలిపి పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని కాసేపు ఉడికించాలి. తర్వాత ఓ బౌల్లో చికెన్, ఆరెంజ్ జ్యూస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అరగంట తర్వాత ఈ ముక్కల్ని కోడిగుడ్డు సొనలో ముంచి, కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి ఫ్రై చేయాలి (డీప్ ఫ్రై చేయకూడదు). కాస్త నూనె వేడిచేసి అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉల్లికాడల తురుము వేయించాలి. తర్వాత సోయా సాస్, టొమాటో కెచప్ కూడా వేయాలి. చివర్లో చికెన్ కూడా వేసి వేయించి దించెయ్యాలి. -
ఆలూ మసాలా రోస్ట్
ఫుల్ మీల్స్ కావలసినవి: బంగాళాదుంపలు - పావు కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కారం - 2 చెంచాలు, మసాలా పొడి - 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కరి వేపాకు - మినప్పప్పు - శెనగపప్పు - జీలకర్ర - ఆవాలు - ఒక్కో చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్క తీసేసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు కలిపి కాసేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేగాక ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. ముక్కలు బాగా మగ్గాక గరం మసాలా వేసి దించేసుకోవాలి. స్పైసీ క్యారెట్ పులావ్ కావలసినవి: బియ్యం - 2 కప్పులు, క్యారెట్లు - 4, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పెరుగు - పావుకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - 1 చెంచా, లవంగాలు - 5, దాల్చినచెక్క - చిన్నది, అనాసపువ్వు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - 1 కట్ట, వేయించిన జీడిపప్పులు - 10, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నెయ్యి - 4 చెంచాలు తయారీ: క్యారెట్స్ని చిన్నగా కోసుకుని, పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు కలిపి అరగంట ఉంచాలి. బియ్యం కడిగి, కాస్త పలుకు ఉండేలా అన్నం వండాలి. వండేప్పుడు లవం గాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు గుడ్డలో మూటగట్టి వేయాలి. మసాలా ఘాటు అన్నానికి పట్టేస్తుంది కాబట్టి వండిన తర్వాత మూట తీసేయాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీల కర్ర, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక క్యారెట్ మిశ్రమం వేయాలి. రెండు నిమి షాల తర్వాత లోతైన గిన్నెలో అన్నం, క్యారెట్ మిశ్రమం పొర లుగా వేసుకుని, మూత పెట్టి, కాసేపు ఉడికించాలి. జీడిపప్పు, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. కొబ్బరి-కోవా లడ్డు కావలసినవి: పచ్చికొబ్బరి తురుము - రెండున్నర కప్పులు, పచ్చి కోవా - 1 కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - 1 చెంచా, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు- బాదంపప్పు-కిస్మిస్ - కావలసినన్ని తయారీ: అరకప్పు కొబ్బరి తురుమును ముందే పక్కన పెట్టేసుకోవాలి. స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. కాగాక సన్నగా తరిగిన జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పులను వేసి వేయించి తీసేయాలి. అదే గిన్నెలో కొబ్బరి తురుము వేయాలి. కాస్త రంగు మారాక పచ్చికోవా వేసి మరికాసేపు వేయించాలి. తర్వాత చక్కెర వేయాలి. చక్కెర కరిగి మిశ్రమం అంతా ముద్దలా అయ్యాక వేయించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. చేతికి నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చివరగా లడ్డూలను కొబ్బరి తురుములో దొర్లించి సర్వ్ చేయాలి. -
అభోజన ఆహారం
అభోజనం అంటున్నారు! ఆహారం అంటున్నారు?! ఏం లేదండీ, భోజనానికి మెనూ ఉంటుంది కదా... అదనీ, ఇదనీ! అలాగే అభోజనానికీ ఓ మెనూ అన్నమాట! కార్తికంలో ఉపవాసం ఉండేవాళ్లకి ది మరీ మరీ స్పెషల్. ఆకలితో ఉండీ ఉండీ ఒక్కసారిగా... ఫుల్మీల్స్తో ఫాస్టింగ్‌కి ‘బ్రేక్’ ఇస్తే ఏమైనా ఉందా?! జీర్ణక్రియ... విస్తరి మడిచేయదూ... అందుకే మీ ఆకలి చల్లారుస్తూ, మిమ్మల్ని చురుగ్గా ఉంచే లైట్ ఫుడ్... డిలైట్ ఫుడ్... ఈ వారం మీ కోసం. సగ్గుబియ్యం - పల్లీ పొడి కావలసినవి: సగ్గుబియ్యం - కప్పు; బంగాళదుంపలు - 2 (చిన్నవి) వేయించిన పల్లీలు - అర కప్పు; ఉప్పు - తగినంత పంచదార - అర టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను అల్లం తురుము - టీ స్పూను పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా తయారీ: సగ్గుబియ్యాన్ని సుమారు మూడు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పల్లీలను మిక్సీలో వేసి పొడి చేయాలి ఒక పాత్రలో పల్లీల పొడి, ఉప్పు, పంచదార, సగ్గుబియ్యం వేసి కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి కరివేపాకు, పచ్చి మిర్చి వేసి, వేగాక అల్లం తురుము జత చేసి దోరగా వేయించాలి బంగాళదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి సగ్గుబియ్యం మిశ్రమం వేసి, పదార్థాలన్నీ కలిసేలా కలియబెట్టాలి కొద్దిసేపు ఉడికించాక (మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు) కొబ్బరి తురుము వేసి బాగా కలిపి దించే ముందు కొత్తిమీర, నిమ్మరసం వేయాలి. దోసకాయ బర్ఫీ కావలసినవి: బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పులు; దోసకాయ తురుము - 2 కప్పులు (గింజలు తీసేసి, తురుములోని నీరంతా ఒక పాత్రలోకి పిండి, తురుము పొడిపొడిగా ఉండేలా చేయాలి); బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి - టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము - ముప్పావు కప్పు; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; జీడిపప్పు తరుగు - 3 టేబుల్ స్పూన్లు; కొబ్బరి నూనె - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను తయారీ: ముందుగా బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, దోసకాయ తురుము వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బొంబాయి రవ్వ, దోసకాయ తురుము, పక్కన ఉంచిన దోసకాయ నీళ్లు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు తరుగు, బెల్లం పొడి వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి సుమారు అరగంట సేపు ఉడికించాక, ఏలకుల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి ఒక ప్లేటుకి కొబ్బరి నూనె పూసి, ఉడికించిన దోసకాయ మిశ్రమం అందులో వేసి, కొద్దిగా చల్లారాక చాకుతో ముక్కలుగా కట్ చేయాలి. ఫ్రూట్ రైతా కావలసినవి: చిక్కటి పెరుగు - కప్పు; పంచదార - టేబుల్ స్పూను; రాక్ సాల్ట్ - చిటికెడు; జీలకర్ర పొడి - చిటికెడు; కారం - చిటికెడు; దానిమ్మ గింజలు - పావు కప్పు; ఆపిల్ ముక్కలు - పావు కప్పు; అరటిపండు ముక్కలు - పావు కప్పు; బాదం పప్పులు - ఆరు (చిన్న ముక్కలుగా చేయాలి) తయారీ: పెరుగును (నీళ్లు పోయకూడదు) గిలక్కొట్టాలి పంచదార, రాక్ సాల్ట్, జీలకర్ర పొడి, కారం జత చేసి కలపాలి ఒక పాత్రలో పండ్ల ముక్కలన్నీ వేసి ఆ పైన పెరుగు మిశ్రమం పోయాలి దానిమ్మ గింజలు, బాదం పప్పు ముక్కలు పైన చల్లి, చల్లగా అందించాలి. బియ్యపురవ్వ రొట్టె(కొయ్య రొట్టె) కావలసినవి: నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; నీళ్లు - 2 గ్లాసులు; ఉప్పు - తగినంత; సెనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు; బియ్యపురవ్వ - గ్లాసు; పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు; తయారీ: మందపాటి గిన్నె స్టౌ మీద ఉంచి, టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి రెండు గ్లాసుల నీళ్లు, ఉప్పు వేసి కలపాలి సెనగపప్పు వేసి బాగా కలిపి నీళ్లు మరుగుతుండగా రవ్వ వేస్తూ ఆపకుండా కలిపి మంట తగ్గించి మూత ఉంచాలి బాగా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసి కలియబెట్టాక, కొద్దిగా నెయ్యి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి స్టౌ మీద పెనం ఉంచి కాలాక, ఉడికించిన బియ్యపురవ్వను గరిటెడు తీసుకుని, పెనం మీద వేసి, చేతితో మందంగా ఉండేలా ఒత్తి, మంట తగ్గించి, చుట్టూ నెయ్యి వేసి మూత ఉంచాలి కొద్దిసేపయ్యాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నెయ్యి వేసి మూత ఉంచి రెండు మూడు నిమిషాలయ్యాక తీసేయాలి కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది. రోటి చలిమిడి కావలసినవి: బియ్యం - పావు కేజీ; బెల్లం పొడి - పావు కేజీ (గట్టి బెల్లం వాడాలి); ఏలకుల పొడి - టీ స్పూను; కొబ్బరి తురుము - పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను తయారీ: బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరు వడబోసి బియ్యంలోని నీళ్లు పోయేవరకు పొడి వస్త్రం మీద ఆరబోయాలి కొద్దిగా తడి ఆరాక, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టి, జల్లించాలి పిండి తడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకుని గట్టిగా నొక్కిపెట్టాలి మిక్సీలో బెల్లం పొడి వేసి మెత్తగా చేశాక, కొద్దికొద్దిగా బియ్యప్పిండి జత చేస్తూ మిక్సీ తిప్పాలి పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి చివరగా ఏలకుల పొడి, నెయ్యి వేసి మరోమారు మిక్సీ తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసేసి, చలిమిడి గిన్నెలో వేసి కలపాలి నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేయాలి. (ఈ చలిమిడిని పూర్వం రోలు ఉపయోగించి చేసేవారు. అందుకే దీన్ని రోటి చలిమిడి అనేవారు. ఇప్పుడు కూడా రోలు ఉన్న వాళ్లు మిక్సీ బదులు రోట్లో చేసుకోవచ్చు) తోటకూర గింజల (అమరాంథ్) యోగర్ట్ కావలసినవి: అమరాంథ్ గింజలు - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); ఖర్బూజా పండు - 1 (చిన్నది); అరటిపండు - 1; జీడిపప్పులు - 10; కిస్మిస్ - 15; ఎండు ఖర్జూరాలు - 6; తేనె - తగినంత; పెరుగు - అర కప్పు; తయారీ: బాణలి వేడి చేసి, రెండు టేబుల్ స్పూన్ల అమరాంథ్ గింజలు వేసి, వేయించి తీసి పక్కన ఉంచాలి ఖర్బూజా తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు చేయాలి అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో అరటిపండు ముక్కలు, ఖర్బూజా ముక్కలు వేసి పక్కన ఉంచాలి బాణలిలో జీడిపప్పులు, కిస్మిస్లు విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి ఎండుఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ఒక గ్లాసులో ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి, పైన అర టీ స్పూను తేనె వేసి, ఆ పైన కొన్ని పండ్ల ముక్కలు, కొన్ని ఎండుఖర్జూరం ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కలు వేశాక, అమరాంథ్ గింజలు వేయాలి మరోమారు తేనె వేయాలి ఇలా ఒకదాని తరువాత మరొకటి వేసి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి చల్లగా అందించాలి. సేకరణ: డా. వైజయంతి -
రేటు వింటే.. ముద్ద దిగదు..
ఫుల్ మీల్స్ భోజనం ఎంత? మామూలు హోటల్లో రూ.100 లోపు.. స్టార్ హోటల్ స్థాయికెళితే.. మనం తీసుకునే ఐటంలను బట్టి ఉంటుంది. కానీ రూ.1.22 లక్షలుంటుందా? ఇదిగో చిత్రంలోని కనిపిస్తున్న హార్డ్ రాక్ హోటల్లోని సబ్లిమోషన్ రెస్టారెంట్లో అంతే ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌గా రికార్డునూ సృష్టించనుంది. స్పెయిన్‌లోని ఇవిత ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్‌ను మే 18న ప్రారంభించనున్నారు. ఇందులోని సబ్లిమోషన్ రెస్టారెంట్లో 20 రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుల్ మీల్స్‌కు ఒక్కొక్కరి నుంచి ఇంత భారీ రేటును వసూలు చేయనున్నారు. అంతేకాదు.. ట్రిప్‌కు 12 మందినే అనుమతిస్తారు. వాళ్లు పూర్తిగా ఆరగించినతర్వాతే మిగతావారికి చాన్స్ అన్నమాట. స్పెయిన్‌లో పేరొందిన చెఫ్ పాకో రోన్సెరో వీటి రూపకర్త. మెనూ వివరాలను వెల్లడించనప్పటికీ మునుపెన్నడూ చవిచూడని అనుభూతి ఖాయమని భరోసా ఇస్తున్నారు. -
అతిథికి అందమైన ఆహ్వానం
ఇంటికొచ్చిన అతిథికి సాదరస్వాగతంతోపాటు చక్కని విందు భోజనం పెట్టాలన్న తాపత్రయం ఉంటుంది. కానీ చక్కగా అమర్చి వడ్డించడానికి అందమైన టేబుల్ లేదనే బెంగ చాలామందిలో ఏదో ఒక మూల ఉంటుంది. అలాంటిదేదైనా ఉంటే ఈ టేబుల్ డెకరేషన్ స్టయిల్స్‌ని గమనించండి. ఇక్కడ ఉన్న టేబుళ్లలో ఏదీ ప్రత్యేకమైన మోడల్ కాదు, అన్నీ సాధారణమైనవే. అయితే కలర్‌ఫుల్ క్లాత్, ఫ్లవర్పాట్స్, టేబుల్ నాప్కిన్స్తో అందంగా తీర్చిదిద్దారు. సందర్భానికి అనుగుణంగా టేబుల్ డెకరేషన్ ఉంటే చాలు, అతిథులు మీ ఆతిథ్యాన్ని ఆహ్లాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం టీ, స్నాక్స్‌తో ఆతిథ్యం ఇస్తుంటే... టీ పాట్, కప్పులు, ఒక ప్లేట్, ఆ ప్లేట్‌కు కుడివైపున నైఫ్, ఎడమవైపున ఫోర్క్ అమర్చాలి. పిల్లల బర్త్‌డే పార్టీకి వచ్చే అతిథులు కూడా పిల్లలే అయి ఉంటారు. కాబట్టి పెద్ద బొమ్మలున్న టేబుల్ క్లాత్ వేసి, పక్కనే మోడరన్ ప్రింట్స్ కర్టెన్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. రాత్రిపూట గార్డెన్లో మూన్లైట్ డిన్నర్ చేయాలనుకుంటే... ముదురు రంగు టేబుల్ క్లాత్ పరిచి తెల్లటి ప్లేట్లు పెట్టాలి. పొడవాటి గాజు గ్లాసులో క్యాండిల్ పెట్టి వెలిగించాలి.