కొత్త గాలి వీస్తోంది! | A new wind blows! | Sakshi
Sakshi News home page

కొత్త గాలి వీస్తోంది!

Published Thu, Mar 6 2014 12:05 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

కొత్త గాలి వీస్తోంది! - Sakshi

కొత్త గాలి వీస్తోంది!

ఒకప్పుడు...
 ‘‘పుస్తకాలు చదివే అలవాటుందా?’’
 ‘‘టెక్ట్స్‌బుక్స్ చదవడానికే టైం చాలడం లేదు...’’
 ఇప్పుడు...
 ‘‘పుస్తకాలు చదివే అలవాటుందా?’’
 ‘‘చదివే అలవాటే కాదు... రాసే అలవాటూ ఉంది.’’
 ఇప్పుడు హిందీ సాహిత్యాన్ని కొత్తగాలి పలకరిస్తోంది. పుస్తకాలు చదవడంతో పాటు రాస్తున్న యువకుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. తమ సబ్జెక్ట్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, ఐఐటి-ఐఐఎమ్ పట్టభద్రులు కలం పట్టుకొని కథలు, నవలలు రాస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను తమ రచనల్లో ప్రతిబింబిస్తున్నారు. యువ రచయిత ప్రకాష్ దూబె(ఢిల్లీ) రాసిన ‘టర్మ్ అండ్ కండిషన్స్ అప్లై’ నవలకు మంచి ఆదరణ లభిస్తోంది.

 
‘‘కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలనేదే నా ప్రయత్నం’’ అంటున్న దూబె కఠినమైన పదాలను కాకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే పదాలను తన రచనలలో వాడుతున్నాడు.
 
‘‘ఇంగ్లిష్‌తో పోలిస్తే హిందీ పుస్తకాలు పెద్దగా అమ్ముడు పోకపోవడానికి కారణం ఆ పుస్తకాల్లో వస్తువు సమకాలీన పరిస్థితులకు దగ్గరగా ఉండకపోవడమే’’ అనేది కొందరు ప్రచురణ కర్తల అభిప్రాయం. ఈ లోటును ఇప్పుడు యువ రచయితలు పూరిస్తున్నారు. వర్తమాన పరిస్థితులను తమ రచనల్లో ఆవిష్కరిస్తున్నారు.
  నిఖిల్ వయసు ఇరవై ఏడేళ్ళు. ‘నమక్’ పేరుతో ఇటీవల ఒక పుస్తకం ప్రచురించాడు. యువతలోని నిరాశా నిస్పృహలను, కలలను ఈ నవల చిత్రీకరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల మీద ఐఐటి - ఢిల్లీ పట్టభద్రుడు ప్రచండ్ రాసిన నవలకు మంచి స్పందన లభించింది.
 
 హిందీతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలను ఎక్కువగా చదివే సచిన్ (లక్నో) హిందీలో రాయడానికి మాత్రమే ఇష్టపడతాడు. ‘‘ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో తేలికగా రాసేయగలను. కానీ నా కథలను హిందీలో చెబితేనే బాగుంటుంది. హిందీలో ఎం.ఏ, పిహెచ్‌డీలు చేసిన వారు మాత్రమే రచనలు చేయగలరనే అపోహను నాలాంటి వారు దూరం చేస్తున్నారు’’ అంటున్నాడు సచిన్. నిజానికి, కొత్త తరం రచయితలలో చాలామంది చిన్న చిన్న పట్టణాలలో పుట్టి పెరిగినవారే. పాఠకులను విస్తృతస్థాయిలో చేరడానికి యువత సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటోంది. తమ రచనలను ప్రమోట్ చేసుకోవడానికి యూ ట్యూబ్ వీడియోలను వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
 
‘‘పాతతరం ప్రచురణకర్తలు ఒకప్పటి పుస్తకాలను పునర్ముద్రించడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప కొత్త రచయితల రచనలను ప్రచురించడం లేదు. రిస్క్ అనుకుంటున్నారు. నిజానికి యువ రచయితలకు కొత్త సబ్జెక్ట్‌లు రాయగల నైపుణ్యం ఉంది’’ అంటున్నాడు ముంబాయికి చెందిన శైలేష్. ముప్పై ఏళ్ళ శైలేష్ తన ప్రచురణ సంస్థ ద్వారా వందమందికిపైగా ప్రభావవంతులైన యువకుల పుస్తకాలను ప్రచురించాడు. ‘కొత్తదనం సాహిత్యానికి నిండుదనం చేకూరుస్తుంది’ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కొత్తగాలితో హిందీ సాహిత్యం పులకిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement