సన్మార్గం : దానం ఎప్పటికీ చెడని పదార్థం
పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు అనేక పుణ్యకార్యాలు చేసి, యజ్ఞయాగాలు నిర్వహించి అందరిచేత మంచివాడనిపించుకుని తనువు చాలించాక స్వర్గలోకానికి వెళ్లాడు. ఏళ్లు గడిచేసరికి భూలోకంలో ఆయన కీర్తి మాసిపోయి, ఆ పేరుగల రాజు ఒకప్పుడు ఉండేవాడన్న సంగతి కూడా ప్రజలకు జ్ఞప్తిలేకుండా పోయింది. అప్పుడు దేవతలు ఇంద్రద్యుమ్నుడిని భూమి మీదకు తోసివేశారు. ఇంద్రద్యుమ్నుడు బాధపడుతూ మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్లి ‘‘మహర్షీ! నేనెవరో తెలుసు కదా, నా పేరు ఇంద్రద్యుమ్నుడు’’ అన్నాడు.
మహర్షి ఆయనను తేరిపార చూసి ‘‘నాయనా! నీవెవరో నాకు తెలియదు. నీ పేరు నేనెప్పుడూ వినను కూడా వినలేదు. అయినా నేను హిమగిరివాసిని. రాజులూ, వాళ్ల చరిత్రలతో నాకు సంబంధం లేదు’’ అని చెప్పా డు. ‘‘మహర్షీ! మీ కంటే ముందు పుట్టి సజీవులుగా ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే సెలవియ్యండి. వాళ్ల దగ్గరకి వెళ్లి వారికి నేను తెలుసేమో విచారిస్తాను’’ అన్నా డు ఇంద్రద్యుమ్నుడు.
మంచుకొండ మీద గూబ ఒకటుంది. దాని పేరు ప్రావారకర్ణుడు. అది నాకంటే చాలా ఏళ్ల ముందు పుట్టింది. వెళ్లి దానిని అడిగి తెలుసుకో నాయనా’’ అన్నాడు మార్కండేయుడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అశ్వాకారం ధరించి మహర్షిని మోసుకుంటూ ప్రావారకర్ణుడు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు.
‘‘ఉలూకమా! నేనెవరో నీకు తెలుసు కదా!’’ అన్నాడు రాజు తన నిజస్వరూపం చూపి, తన కథంతా చెప్పాక. ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి ‘‘నాకు తెలియదు’’ అన్నాడు. రాజు సిగ్గుపడ్డాడు. ‘‘నీకంటే ముందు పుట్టి చిరంజీవులుగా ఉన్నవారెవరైనా ఉన్నారా?’’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘‘ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి ‘‘ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సు ఉంది. అక్కడ నాడీఝంగుడనే కొంగ ఉంది. అది నాకంటే వయస్సులో పెద్దది’’ అని చెప్పాడు.
ఇంద్రద్యుమ్నుడు మార్కండేయ మహర్షిని, ప్రావారకర్ణుని మోసుకుంటూ సరోవరం దగ్గరకు వెళ్లి కొంగను కలుసుకుని, ‘‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’’ అని అడిగాడు. అది కూడా కొంతసేపు ఆలోచించి తెలియదని తల అడ్డంగా ఊపింది. తనకంటే ముందు పుట్టి, తనతోపాటు ఆ సరస్సులో ఉంటున్న తాబేలుకు తెలుసేమో కనుక్కుంటానంది. సరేనన్నాడు రాజు.
అందరూ అక్కడే ఉండి, తాబేలుకు కబురు పంపారు. వణుక్కుంటూ వచ్చిన ముసలి కమఠంతో ‘‘ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’’ అంది ప్రావారకర్ణుడు. కమఠం కాసేపు ఆలోచించి, తనలో తాను ఏదో గొణుక్కుని ‘‘నేను ఆయనను ఎరక్కపోవడమేమిటి? ఆ మహానుభావుడు చేసిన దానాలు మరెవరూ చేసి ఉండరు. ఎన్నో గోదానాలు, ఎన్నో భూదానాలు, నిత్యసంతర్పణలు జరిగేవి. ఆ మహనీయుడు భూసురులకు దక్షిణగా వేనవేల గోవులు దానం చేయడం వల్ల ఆ గోవుల తొక్కిళ్ల చేత ఈ సరస్సు ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరే ఇంద్రద్యుమ్నం.’’ అని చెప్పి ఆ మహానుభావుని స్మరిస్తూ నమస్కరించింది కూర్మం.
‘‘నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజుని’’ అని చెప్పి రాజు కూడా కమఠానికి నమస్కరించాడు. ఇంద్రద్యుమ్నుడిని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు తన జన్మ ధన్యమైందని సంతోషించింది ముసలి తాబేలు. ఎన్నో వేల ఏళ్ల తరువాత కూడా ఇంద్రద్యుమ్న మహారాజు గొప్పతనాన్ని, ఆయన చేసిన పుణ్యకార్యాలనూ ఒకరైనా గుర్తు పెట్టుకున్నందుకు దేవతలు సంతోషించి, దివి నుండి భువికి వచ్చి, ‘‘మహారాజా! ఇప్పటికీ భూలోకంలో నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నీవు మాతోపాటు స్వర్గంలోనే ఉండాలి. ఇది మా అందరి కోరిక’’ అని పలికారు. ఇంద్రద్యుమ్నుడు కృతజ్ఞతగా నమస్కరించాడు. మార్కండేయ మహర్షిని, గూబను, కొంగను వారి వారి స్థానాలలో వారిని విడిచిపెట్టి దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తమతో స్వర్గానికి తీసుకువెళ్లారు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సూతమహర్షి ధర్మరాజుకి ఈ కథ చెప్పి, ‘‘ధర్మరాజా! అన్నిదానాలలోఅన్నదానం ఉత్తమం. అన్నదానం చేయలేనివాడు పిడికెడు మెతుకులు పెట్టే ఇల్లు చూపించినా పుణ్యం లభిస్తుంది’’ అంటూ దానధర్మస్వరూపాన్ని వివరించాడు. అంటే చేసిన పుణ్యం ఎప్పటికీ చెడని పదార్థం. పుడమిపై కీర్తి ఎంతకాలం ఉంటుందో, అంతకాలం స్వర్గంలో ఉంటారు మానవులు. అపఖ్యాతి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. బతికినన్నాళ్లూ పుణ్యకార్యాలు చేసి, అందరి దీవెనలు పొంది యశస్సును ఆర్జించుకోవాలి.
- శొంఠి విశ్వనాథం