
విమానం కంటే వేగంగా నేల పైనే ప్రయాణించేందుకు వీలు కల్పించే హైపర్‌లూప్ టెక్నాలజీ ప్రాచుర్యం ఏటికేడాదీ పెరిగిపోతోంది. టెస్లా వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్ ఒకవైపు హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్, ఇంకోవైపు ఈ రవాణా వ్యవస్థను ప్రపంచవ్యాప్తం చేసేందుకు పోటీ పడుతున్నారు. ఫ్రాన్స్‌లో ఇటీవలే ఓ టెస్ట్ ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్.. వచ్చే ఏడాదే గల్ఫ్‌లోని అబుదబిలోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అబుదబిలోని రియల్ ఎస్టేట్ కంపెనీ అల్డార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కూడా కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే 2019లో నిర్మాణం మొదలుపెట్టడమే కాకుండా 2020 కల్లా ఒక దశ హైపర్‌లూప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ అంటోంది.
అబుదబి సరిహద్దుల నుంచి దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ దాదాపు ఆరు మైళ్ల పొడవైన మార్గాన్ని నిర్మించాలన్నది కంపెనీ ప్లాన్. అలాగే 2020లో దుబాయిలో జరిగే ఎక్స్‌పో 2020కి హైపర్‌లూప్ నిర్మాణం పూర్తి అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీర్ఘకాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దేశాలన్నింటినీ కలుపుతూ హైపర్‌లూప్‌ను నిర్మించేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్ సీఈఓ బిబాప్ గ్రెస్తా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment