అసిడిటీ, కడుపులో మంట వంటి ఇబ్బందుల నివారణకు వాడే మందులు కాలేయానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిప్రజోల్, పాంటోప్రజోల్ వంటి యాంటాసిడ్‌లను దాదాపు 10 శాతం మంది ప్రజలు వాడుతుంటారని.. అయితే ఈ ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటర్ మందుల వల్ల కడుపులోని ఆమ్లాల మోతాదు తగ్గినా.. మూడు రకాల కాలేయ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతున్నాయని గుర్తించారు.
ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు బెర్న్‌డ్ శ్నాబ్ తెలిపారు. ఆహారంలోని సూక్ష్మజీవులను నాశనం చేసేందుకు, జీర్ణక్రియకు సాయపడేందుకు ఆమ్లాలు అవసరమవుతాయని.. మందుల ద్వారా ఉత్పత్తయ్యే ఆమ్లాల మోతాదును నియంత్రించినప్పుడు దాని ప్రభావం శరీరంలోని సూక్ష్మజీవులపై పడుతుందని చెప్పారు. పేగుల్లో ఎంటిరోకోకస్ బ్యాక్టీరియా పెరిగిపోతుందని.. ఇవి కాస్తా కాలేయంలోకి చేరి వాపునకు దారితీస్తున్నాయని వివరించారు.
కాలేయ వ్యాధితో బాధపడే వారికీ ఈ ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటర్ మందులు ఇస్తుంటారని దురదృష్టవశాత్తూ ఈ మందులు వాడటం వల్ల వ్యాధి మరింత ముదురుతుందని హెచ్చరించారు. మద్యం అలవాటు ఉండి.. ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటర్ మందులు వాడే దాదాపు 4,830 మంది వ్యర్థాలను విశ్లేషించినప్పుడు వాటిల్లో ఎంటిరోకోకస్ బ్యాక్టీరియా మోతాదు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. అంతేకాకుండా మద్యం అలవాటుండి ఈ మందులు వాడే ప్రతి ఐదుగురిలో ఒకరు కాలేయ వ్యాధి బారిన పడతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment