Acidity
-
ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతినొప్పి కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజానికి ఛాతినొప్పి అనగానే గుండె సంబంధిత అనారోగ్య సమస్యగానే భావిస్తాం. కానీ ఆయనకు ఎసిడిటీ కారణంగా ఛాతినొప్పి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా ? దీన్ని గుర్తించగలమా..?ఒడిశాలో జన్మించిన శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్. ప్రస్తుతం ఆయన చైన్నైలోని అపోల ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ శక్తిదాస్కి ఎసిడిటి కారణంగా ఛాతి నొప్పి వచ్చిందని అందువల్లే ఆస్పత్రిలో చేరినట్లు నివేదకలు చెబుతున్నాయి. అంటే ఎసిడిటీ వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుందా అనే సందేహం ఒక్కసారిగా అందరిలోనూ మెదలయ్యింది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అన్నవాహికలోకి ఆమ్లం తిరిగి ప్రవహిస్తున్నప్పు ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా గుండెల్లో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమువుతాయని అన్నారు. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో బయటపడవచ్చు లేదా మందులతో కూడా నివారించొచ్చని వెల్లడించారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన సందర్భాల్లోనే ఇలా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. గుర్తించగలమా? అంటే..ఆమ్లత్వంతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పిని యాసిడ్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఇది ఛాతీలో మంటలా వస్తుంది. అయితే అందరూ గుండెల్లో మంటగా అపోహ పడుతుంటారు. ఈ విధంగా ఏదైనా తిన్న తర్వాత జరగుతుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు తీవ్రమై కొన్ని సార్లు పుల్లని రుచి లేదా కడుపు ఆమ్లం గొంతులోకి తన్నుకురావడంతో వాంతి రూపంలో బయటకొస్తుంది. అయితే గుండె సంబంధిత ఛాతీ నొప్పిలా కాకుండా ఎసిడిటీ సంబంధిత అసౌకర్యం చేతులు, మేడ లేదా దవడలకు వ్యాపించదు. చెప్పాలంటే ఈ సమస్యను ప్రథమ చికిత్సలో భాగంగా బాధితుడిని నిటారుగా కూర్చోబెడితే ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం పొందుతారు. పైగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఛాతి నొప్పిని గుండె సంబంధితమా లేదా ఎసిడిటీ వల్ల అనేది గుర్తించడం మాత్రమే కష్టమే అంటున్నారు నిపుణులు. అందువల్ల వాళ్లని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే అక్కడ వైద్యులే ఇది దేని వల్ల వచ్చిందనేది అంచనా వేయగలరు అని చెబుతున్నారు నిపుణులు.ఎప్పుడు క్రిటికల్ అంటే..అన్నవాహిక అల్సర్లు లేదా స్ట్రిక్చర్స్ వంటి అంతర్లీన సమస్యలు ఉంటే..నిర్జలీకరణానికి దారితీసేలా నిరంతర వాంతులు లేదా తీవ్రమైన ఛాతి నొప్పికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
అసిడిటీ ఆమడ దూరంలో ఉండాలంటే..!
అసిడిటీ నివారించాలంటే ఈ జాగ్రత్తలు బెటర్ బాగా మసాలాలతోనూ, కారంతో కూడిన ఆహారాలు అసిడిటీని ప్రేరేపిస్తాయి. అంతేకాదు టీ, కాఫీలు లెక్కకుమించి తాగుతున్నా కూడా అసిడిటీ రావచ్చు. ఇలా అసిడిటీని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండటం, అలాగే దాన్ని నివారించే పదార్థాలను తీసుకోవడం మేలు. అలాంటి ఆహారాలేమిటో చూద్దాం.ఒకేసారి ఎక్కువగా తినేయడం సరికాదు. కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినాలి.తీసుకోవాల్సినవి: స్ట్రాంగ్ కాఫీలుచాక్లెట్లు, కూల్‌డ్రిండ్, ఆల్కహాల్మసాలాలతో కూడిన ఆహారంపుల్లటి సిట్రస్ పండ్లు, టోమాటో, కొవ్వుతో ఉండే ఆహారాలు, వేటమాంసం తదితరాలు..తీసుకోవాల్సినవి:కాస్త వీక్‌గా అనిపిస్తే హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. తాజా పండ్లు, పరిశుభ్రమైన మంచినీళ్లు, నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలుఅన్నం, ఉడికించిన మొక్కజొన్న గింజలుపియర్ పండ్లు, అరటి పండ్లు, ఆపిల్స్, పుచ్చపండ్లు, ఉడికించిన ఆలు, బ్రోకలీ, క్యాబేజ్, గ్రీన్ పీస్, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు చేపలు, కోడి మాంసం తదితరాలు..(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏమవుతుందో తెలుసా?
అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠత తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదు మించి వాడకుండా ఉండటం మంచిది. -
Health Tips: తినగానే పడక మీదకి వెళ్తున్నారా.. అయితే..
Health Tips In Telugu: ఇటీవల ఆరోగ్యస్పృహ పెరగడం వల్ల తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం లేదుగానీ... గతంలో చాలామంది రాత్రి భోజనం కాగానే వెంటనే పడక మీదికి చేరేవారు. ఇప్పటికీ ఇలాంటివాళ్లు ఉన్నారు. నిజానికి తిన్న వెంటనే పడక మీదికి చేరడం వల్ల అసిడిటీ ప్రభావంతో కడుపులో ఇబ్బందులు పెరుగుతాయి. ఓ సీసా నిండా నీళ్లు ఉన్నప్పుడు, దాన్ని నిలబెట్టకుండా... పక్కకు ఒరిగేలా చేస్తామనుకోండి. దానిలోని ద్రవం సీసా గొంతు భాగంలోకి వచ్చినట్టే... మన కడుపులోని ద్రవాలూ గ్రావిటీ వల్ల ఫుడ్పైప్లోకి వస్తాయి. దాంతో మన కడుపులోని యాసిడ్... అన్నంపై పనిచేయడానికి బదులుగా గొంతులోంచి పైకి తన్నినట్లుగా అవుతుంది. దాంతో గొంతులో వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపులోని అన్నంపై యాసిడ్ ప్రభావం తగ్గి, అది త్వరగా అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం (బ్లోటింగ్) వంటి అనర్థాలన్నీ జరుగుతాయి. అందుకే భోజనం తిన్న వెంటనే, పడక మీదికి ఒరిగిపోకుండా... ఆహారానికీ, నిద్రకూ కనీసం రెండు గంటల వ్యవధి ఇవ్వడం అవసరమన్నది వైద్యనిపుణుల సలహా. చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! -
కొవ్వు కాదమ్మా.. ఇది కడుపు ఉబ్బరం!
‘ఏం తిన్నా పొట్ట రాయిలా టైట్‌గా అయిపోతోంది’... ‘ఏమిటో... ఈమధ్య ఏదైనా తినగానే కడుపు ఉబ్బరం. ఛాతీ నుంచి కింద పొట్ట వరకూ ఒకటే మంట’... ‘తిన్నదేమీ లేదు గాని పొద్దస్తమానం ఇలా తేన్పులు’... ఇవీ నలుగురు కూడి కలిసిన చోట్ల మాట్లాడే మాటల్లో కనీసం ముగ్గురు చెప్పుకునే మాటలు, చేసుకునే ఫిర్యాదులు. మామూలు వాళ్లకి ఇదో ఇబ్బందా అనిపిస్తుందేమో! కానీ... మనకు తెలియకుండానే జీవనశైలిని ప్రభావితం చేసే ఎంతో పెద్ద సమస్య ఇది. తిన్న ఆహారం అరుగుదల విషయంలో మనం రోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపులో గ్యాస్ చేరడంతో ఉబ్బరం ఎవరిలోనంటే... కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్నపేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి మలద్వారం గుండా బయటకు పోతుంటుంది. కానీ చాలా మందిలో గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా పరిణమిస్తుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్దకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు. ఈ సమస్యకు వివిధ కారణాలు... అది బాధించేవారెవరంటే... ∙బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ∙చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ∙హార్డ్ క్యాండీల వంటివాటిని ఎప్పుడూ చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు ∙వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరు తినేటప్పుడు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. గ్యాస్ తగ్గడానికి పరిష్కారం ఏమిటి? మీరు ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది. ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. ∙ సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి ∙జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి ∙గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ సమస్యకు దోహదపడే అంశాలు రోజూ తీసుకునే మోతాదుకంటే ఎక్కువగా ఆహారం తినడం ∙ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. ∙అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండే ఆహారాలైన టమాటా, నిమ్మ జాతి పండ్లు, పుల్లగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్ కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్నొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కడుపు ఉబ్బరం– పరిష్కారాలు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. ∙పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి ∙చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లు తీసుకోవచ్చు ∙కొవ్వుతో కూడిన వాటిని పరిమితంగా తీసుకోండి ∙తినకముందే పాక్షికంగా పులిసే ఇడ్లీ, దోసెల వంటివాటిని ఎక్కువగా తీసుకోండి. ఇలాంటి ఆహారాన్ని పూర్తిగా పులియకముందే తినడం మంచిది ∙మాంసాహారంలో కొవ్వు తక్కువగా ఉండే చికెన్ మేలు రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండండి ∙ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కడుపు ఉబ్బరం తగ్గించడానికి ఆహారపరమైన మార్గదర్శకాలివి... పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలు... అరటిపండ్లు, పుచ్చకాయ, టొమాటోలు, బాదాం వంటి నట్స్ ∙కొబ్బరినీళ్లలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. ఒంట్లోని సోడియమ్‌ను బయటకు పంపిస్తాయి, దాంతో కడుపులోని గ్యాస్, కడుపుఉబ్బరం తగ్గుతాయి. భోజనం తర్వాత సోంఫ్ తింటే కొంతవరకు పొట్టఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఒక టీ–స్పూన్ సోంఫ్ గింజలను ఒక గ్లాసెడు నీళ్లు లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు. ∙గ్లాసెడు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అవుతుంది. ఇక వేణ్ణీళ్లలో నిమ్మరసం కలిపినప్పుడు... ఆ మిశ్రమానికి విరేచనాన్ని మృదువుగా చేసి సాఫీగా బయటకు వెళ్లేలా చేసే గుణం ఉంటుంది. మృదువిరేచనం అయినప్పుడు గ్యాస్ కూడా సాఫీగా బయటకు వెళ్లి పొట్ట తేలిగ్గా ఉంటుంది. రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి దాల్చినచెక్క కడుపుబ్బరాన్ని సమర్థంగా తగ్గిస్తుంది. ఒక గ్లాసెడు వేడి నీళ్లలో ఒక కాస్తంత దాల్చిన చెక్క పొడితో పాటు ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే పొట్ట ఉబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.∙బ్రిస్క్‌వాకింగ్ గానీ, జాగింగ్ లేదా రన్నింగ్ వల్ల కడుపులోని గ్యాస్ కదిలి బయటకు వెళ్తుంది. ఇదే అలవాటును కొనసాగిస్తే కడుపు ఉబ్బరం ఉండదు. వెల్లుల్లి : మొత్తం జీర్ణవ్యవస్థనే శుభ్రం చేసి, కడుపు ఉబ్బరాన్ని పూర్తిగా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను మింగండి. ఆ తర్వాత భోజనం చేయండి. కింది నుంచి గ్యాస్ వెళ్లిపోయి కడుపు తేలిక అవుతుంది. ఇది కాస్త ప్రయత్నించి చూడాల్సిన అంశం. ఎందుకంటే... సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కొందరిలో... విచిత్రంగా అవే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. అలాగే మీకు ఏ ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుందో కూడా గమనించుకొని, వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రోబయాటిక్ డ్రింక్స్ కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. అది కుదరకపోతే తాజా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే కొందరికి పెరుగు కూడా కడుపుబ్బరం, గ్యాస్ తగ్గిస్తుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్,బైఫిడోబ్యాక్టీరియమ్ అనే మేలు చేసే బ్యాక్టీరియా (ప్రోబయాటిక్స్) కడుపులోని ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కానీ ఇటీవల ‘యోగర్ట్’ పేరిట పెరుగులోనే అనేక ఫ్లేవర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి వల్ల మాత్రం కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. ఇంట్లో చేసే పెరుగు మంచిది.∙ఆర్టిచోక్ అనే మొక్కలో సినారిన్ అనే పదార్థం ఉంటుంది. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఆర్టిచోక్ తీసుకోవడం వల్ల అందులోని ‘సినారిన్’ అనే పదార్థం కడుపులోని గ్యాస్‌ను తొలగించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ∙అవకాడోలో ఉండే లైపేజ్ కూడా కొవ్వులను త్వరగా జీర్ణం చేసి కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది. అల్లం టీ: అప్పుడప్పుడూ తాజాగా అల్లం టీ తయారు చేసుకొని తాగితే కడుపు తేలిగ్గా ఉంటుంది. పుదీనా టీ : పుదీనా ఆకులను టీలాగా కాచుకొని తాగితే కడుపు ఉబ్బరంతో పాటు అనేక జీర్ణవ్యవస్థలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అల్లం తురుము కాస్తంత కలుపుకొని మజ్జిగ తాగడం కూడా కడుపును తేలిక చేస్తుంది. పప్పు తింటే గ్యాస్ పెరుగుతుందా: ఒక్కొక్కరి జీర్ణవ్యవస్థ పనితీరు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో పదార్థాన్ని జీర్ణం చేసుకునే తీరు కూడా ఒక్కోలా ఉంటుంది. అందుకే పప్పులు ప్రతి ఒక్కరిలో అదే తరహాలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయనేమీ లేదు. చిక్కుళ్లు, ఇతరత్రా పప్పు ధాన్యాల్లో నీటిలో కరగని పీచు (ఇన్సాల్యుబుల్ ఫైబర్) చాలా ఎక్కువ. ఆ పీచును అరగదీయడంలో జీర్ణవ్యవస్థ చాలా కష్టపడుతుందని ‘మయో క్లినిక్’ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. పప్పులు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్న చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిని ఎక్కువ సేపు నానబెట్టి ఉడికించడం వల్ల, వాటిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌కు కారణమయ్యే ఫైలేట్స్ పాళ్లు తగ్గి పొట్ట హాయిగా ఉంటుంది. గ్యాస్‌ను ఉత్పన్నం చేసే ఆహారాలు.... ∙బీన్స్ ∙బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు ∙పియర్స్, ఆపిల్స్ ∙పొట్టు ఉన్న గోధుమలు ∙సోడాలు, కూల్‌డ్రింక్స్ ∙పాలు, పాల ఉత్పాదనల్లో చీజ్, ఐస్‌క్రీమ్స్ ∙ప్యాకేజ్‌ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినేవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి చాలా ఆరోగ్యకరం. కాబట్టి వాటిని సమస్య రానంత మేరకు పరిమితంగా తీసుకోవాలి. కడుపు ఉబ్బరం సమస్య తగ్గడానికి ఆహారమే మంచి ఔషధం. అలాగే అరటి వంటి కొన్ని పండ్లు కూడా. అయితే పండ్లు తినే సమయంలో కొన్ని రకాల పండ్లలో (ముఖ్యంగా ఆపిల్, పియర్ వంటి వాటిల్లో) సార్బిటాల్ అనే చక్కెరలాంటి పదార్థం ఉంటుంది. ఇది కడుపుబ్బరాన్ని కలిగించవచ్చు. అలాగే పెరుగు వంటివి కూడా. అందుకే ఇందులో ఏ ప్రక్రియ మీకు సరిపడుతుందో, దేన్ని అవలంబిస్తే కడుపు తేలిక అవుతుందో గమనించి దాన్ని అనుసరించవచ్చు. పైగా ఇక్కడ పేర్కొన్న చిట్కాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రోగనిరోధక శక్తిని పెంచేవే. కాబట్టి మీరు ఇబ్బంది కలిగించకుండా ఉండేదాన్ని ఎంచుకోండి. కడుపును తేలిగ్గా ఉంచుకోండి. ఇన్పుట్స్: డాక్టర్ రామకృష్ణ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ – రాధిక, చీఫ్ డైటీషియన్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అసిడిటీకి మందులా.. కాలేయం జాగ్రత్త
అసిడిటీ, కడుపులో మంట వంటి ఇబ్బందుల నివారణకు వాడే మందులు కాలేయానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిప్రజోల్, పాంటోప్రజోల్ వంటి యాంటాసిడ్లను దాదాపు 10 శాతం మంది ప్రజలు వాడుతుంటారని.. అయితే ఈ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ మందుల వల్ల కడుపులోని ఆమ్లాల మోతాదు తగ్గినా.. మూడు రకాల కాలేయ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతున్నాయని గుర్తించారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు బెర్న్డ్ శ్నాబ్ తెలిపారు. ఆహారంలోని సూక్ష్మజీవులను నాశనం చేసేందుకు, జీర్ణక్రియకు సాయపడేందుకు ఆమ్లాలు అవసరమవుతాయని.. మందుల ద్వారా ఉత్పత్తయ్యే ఆమ్లాల మోతాదును నియంత్రించినప్పుడు దాని ప్రభావం శరీరంలోని సూక్ష్మజీవులపై పడుతుందని చెప్పారు. పేగుల్లో ఎంటిరోకోకస్ బ్యాక్టీరియా పెరిగిపోతుందని.. ఇవి కాస్తా కాలేయంలోకి చేరి వాపునకు దారితీస్తున్నాయని వివరించారు. కాలేయ వ్యాధితో బాధపడే వారికీ ఈ ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ మందులు ఇస్తుంటారని దురదృష్టవశాత్తూ ఈ మందులు వాడటం వల్ల వ్యాధి మరింత ముదురుతుందని హెచ్చరించారు. మద్యం అలవాటు ఉండి.. ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ మందులు వాడే దాదాపు 4,830 మంది వ్యర్థాలను విశ్లేషించినప్పుడు వాటిల్లో ఎంటిరోకోకస్ బ్యాక్టీరియా మోతాదు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. అంతేకాకుండా మద్యం అలవాటుండి ఈ మందులు వాడే ప్రతి ఐదుగురిలో ఒకరు కాలేయ వ్యాధి బారిన పడతారని చెప్పారు. -
హెల్త్ టిప్స్
► ఎసిడిటీతో బాధపడుతున్నవారు భోజనానంతరం ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ► పిల్లలకు రోజూ... ఒక టేబుల్ స్పూన్ తేనెకి కొద్దిగా క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్ కలిపి ఇస్తే... అది మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ► శరీరంపై వచ్చే ర్యాష్ తగ్గడానికి కొన్ని తమలపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ►ముక్కులో రక్తం కారుతూ ఉంటే దానిమ్మ రసం రెండు చుక్కలు ముక్కులో పిండుకోవాలి. -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
అది ఐబీఎస్ కావచ్చు! నా వయసు 36 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. ఆరు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – శ్రీరామ్, తిరుపతి మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం తెలపలేదు. ఇక రెండో అంశం... మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. – డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ చిన్నవయసులోనేమోకాళ్ల నొప్పులు ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి. – శిరీష్, గుంటూరు మీరు చెప్పిన అంశాలను పరిశీలిస్తే... మీకు మోకాలి చిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది తాత్కాలికమైన సమస్య. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. – డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ ఆటిజమ్ తగ్గుతుందా? మా అబ్బాయి వయసు ఐదేళ్లు. గత ఎనిమిది నెలలుగా అకారణంగా ఏడ్వటం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవలేకపోవడం, గంటల కొద్దీ స్తబ్ధంగా ఉండటం చేస్తున్నాడు. గట్టిగా అరవడం, నవ్వడం కూడా చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆటిజమ్ అని చెప్పారు. దీనికి హోమియోలో ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా? – నందకిశోర్, గుంటూరు ఆటిజమ్ ఉన్నవారికి కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఇలాంటి పిల్లల్లో గమనించాల్సిన అంశాలు... ∙ఇతరులతో కలవలేకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, ఒంటరిగానే ఎక్కు సమయం గడపడం. ∙భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావడం ఆలస్యం కావచ్చు ∙ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఒకే రకమైన వస్తువులను సేకరించడం, చేతులు–కాళ్లు అదేపనిగా ఆడించడం వంటివి చేస్తారు. మరీ చిన్న వయసు పిల్లల్లో దీన్ని ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చు ∙అకారణంగా ఏడవటం ∙తల్లి దగ్గరకు తీసుకున్నా గుర్తించకపోవడం ∙పరిచితమైన వ్యక్తులను చూడగానే పలకరింపు నవ్వు కూడా నవ్వకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కాస్త పెద్ద వయసులో ఉన్నవారిలో అయితే... మిగతా పిల్లలతో కలవలేకపోవడం ∙పిలిస్తే పలకకపోవడం ∙మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపడం ∙కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం, చేతులు–కాళ్లు లేదా వేళ్లు అసహజంగా ఒకే తీరులో కదిలిస్తూ ఉండటం ∙మానసిక ఎదుగుదల లోపించడం లేదా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ చురుకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ సమస్యతో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఆటిజమ్‌కు కారణాలు ఇవీ అని చెప్పడం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి. కొందరిలో మెదడులో లోపాలుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోముల వంటివి కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడే అందరిలోనూ ఒకేలాంటి తీవ్రత ఉండదు. దీనిని నివారించడానికి పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎక్కువ సమయం వారితో గడపాలి.హోమియోలో ఈ సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది, పిల్లల వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని కాన్స్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను క్రమక్రమంగా తగ్గిస్తూ... పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ తలకు దెబ్బ తగిలినా కోలుకోవడం అసాధ్యమేమీ కాదు... న్యూరో కౌన్సెలింగ్ మా స్నేహితుడి వయసు 21. ఆర్నెల్ల క్రితం బైక్ యాక్సిడెంట్లో తలకు గాయమై, రక్తస్రావం అయింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మా పేర్లు కూడా తప్పుగా చెబుతున్నాడు. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతూ... ఎమ్సెట్ క్లాస్ మిస్సవుతున్నానంటాడు. వాడు మామూలుగా అవుతాడా? చదువు పూర్తిచేయగలడా? తలకు దెబ్బతగిలిన వారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? దయచేసి తెలపండి. – మహేశ్‌కుమార్, హనుమకొండ మన మెదడు సున్నితమైన అనేక రసాయనిక చర్యల వల్ల పనిచేస్తుంటుంది. మెదడులోని రసాయనాలను న్యూరోట్రాన్స్మీటర్లు అంటారు. రసాయన సంకేతాలుగా పనిచేసే ఇవి మెదడులోని ప్రాథమిక కణాలైన న్యూరాన్ల మధ్య సమాచారాన్ని మార్పిడి చేస్తుంటాయి. ఇది ఆ వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలను మార్చి వేస్తుంది. మెదడులోని రసాయనాల సమతూకం సరికావడానికి కొన్ని వారాల నుంచి కొన్నిసార్లు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ విధంగా సరిచేసుకునేందుకు మెదడుకు ఉండే సామర్థ్యం వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి కోలుకోవడం అన్నది గాయం తీవ్రతపైన కూడా ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ స్నేహితుడి తలకు పెద్ద గాయమే అయినట్లుంది. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తులు తిరిగి సాధారణ సామర్థ్యంతో పనిచేయడం సాధ్యం కాదని అపోహపడుతుంటారు. కానీ మీరు నిరాశచెందనవసరం లేదు. తలకు తీవ్ర గాయం అయినప్పుడు కోలుకోవడం విషయంలో ఆసక్తికరమైన, ఆశాజనకమైన మరో అంశం సహజంగా కోలుకునేందుకు సంబంధించి, మెదడుకు ఉన్న సామర్థ్యం. ఇందుకోసం మెదడు కొత్త న్యూరాన్లను తయారు చేసుకోగలదని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రక్రియ ఏ మేరకు, ఎంత వేగంగా జరుగుతుందన్నది ఇంకా స్పష్టంగా వెల్లడికానప్పటికీ, మెదడు గాయపడ్డ వ్యక్తి పునరావాస అవకాశాలు మాత్రం మెరుగుపడతాయన్నది సుస్పష్టం. ఈ కోలుకునే ప్రక్రియ మీద వ్యక్తి వయసు ప్రభావం ఉంటుందా... అని అడిగితే ఉంటుందనే చెప్పాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు కోలుకునే శక్తి తగ్గుతుంది. కానీ మీ ఫ్రెండ్‌ది చిన్న వయసే కాబట్టి అతడు కోలుకొని చదువు కొనసాగించేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. – డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బర్నింగ్ ప్రాబ్లమ్!
ఒకప్పుడు ట్రైన్ ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. బొగ్గును తీసుకొని ఇంజన్ కడుపులో వేస్తే భగభగమని మండి ఛుక్ ఛుక్మని పరుగెడుతుండేవి. మన కడుపూ అంతే. కడుపులో అన్నం పడితే... ఆ అన్నం భగభగా మండి మనల్ని పరుగులు తీసేలా చేస్తుంది. కానీ... వేళకు అన్నం పడకపోతే కడుపే మండిపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో యాసిడ్ తిప్పేస్తుంది. ఈరోజుల్లో వేళకు భోజనం, నిద్ర ఎలాగూ కరువయ్యాయి. దీనికి తోడు పాడు స్ట్రెస్ యాసిడ్‌ను చిమ్మిస్తూనే ఉంటుంది. కడుపు రగిలిపోతూనే ఉంటుంది... అమ్మో!! ఎసిడిటీ... బర్నింగ్ ప్రాబ్లమ్! మనం తిన్న అన్నం అరగాలంటే యాసిడ్ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా... లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే... కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. ఆ యాసిడ్ మంటలూ, కడుపు ఉబ్బరాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపు నిర్మాణం అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలికను చూద్దాం. అచ్చం కింద ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఒక సన్న మూతి ఉన్న సీసాలా ఉంటుంది మన కడుపు నిర్మాణం. అలాంటి సీసాలో నీళ్లు పోస్తున్నామనుకోండి. ఏమవుతుందో ఊహించండి. కింది నుంచి గాలి బుడగలు బుసబుసమంటూ పైకి వస్తాయి కదా. కడుపులోని అన్నంపై యాసిడ్ పనిచేస్తున్నప్పుడు, అవసరమైన దాని కంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు అది పైకి తంతుంది. అలాగే గ్యాస్ కూడా. ఆ గ్యాస్ పైకి వస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు యాసిడ్ పైకి రావడాన్ని వెట్బర్ప్ అంటారు. ప్రతివారూ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అయితే కొందరికి అది నిత్యకృత్యం. యాసిడ్, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఈ సమస్యకు పేర్లు ఎన్నో... యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, గ్యాస్ కడుపులోనే చిక్కుకుపోయి కడుపు ఉబ్బరంగా ఉండే ఈ సమస్యను సాధారణంగా ఎసిడిటీగా పేర్కొంటాం. అయితే దీనికి వైద్యపరంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి... నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్ఈఆర్డీ), ఎరోసివ్ ఈసోఫేజియల్ డిసీజ్ (ఈఈజీ), గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). కొందరిలో ఎసిడిటీ వల్ల కడుపు మంట, గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం రాత్రివేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా రాత్రివేళల్లో కనిపించే ఆ సమస్యను నాక్చర్నల్ జీఈఆర్డీ అంటారు. కారణాలు గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్ లైఫ్‌స్టైల్), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్న వెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ∙ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం ∙పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడంతో యాసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ∙జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అదేపనిగా వేపుడు పదార్థాలు తీసుకుంటూ ఉండటం, కొన్నిసార్లు భోజనం తినకపోవడం (మీల్ స్కిప్ చేయడం), తీవ్రమైన పని ఒత్తిడి ∙రాత్రిషిఫ్ట్‌లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం ∙అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం ∙నిద్రలేమి. మరికొన్ని అంశాలు పైన పేర్కొన్న కారణాలతో పాటు మరికొన్ని అంశాలు సైతం ఎసిడిటీకి దోహదం చేస్తుంటాయి. అవి... ∙స్థూలకాయం ∙ఒళ్లు కదలకుండా ఒకే చోట కుదురుగా కూర్చొని పనిచేసే వృత్తులలో ఉండటం వ్యాయామం చేయకపోవడం ∙తరచూ కాఫీ తాగడం లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ∙చాక్లెట్లు తినడం రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వంటి అంశాలు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి ∙ఇక మద్యం (ఆల్కహాల్), పొగతాగే అలవాటు, మింట్ (పుదీనా బిళ్లలు) చప్పరిస్తూ ఉండటం కూడా ఎసిడిటీకి దోహదం చేస్తుంది. అనర్థాలు ►దీర్ఘకాలికంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుండేవారిలో చాలా ఆరోగ్యపరమైన అనర్థాలు సంభవిస్తుంటాయి. ►జీర్ణాశయం కింది భాగం (లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్) సన్నబడిపోతుంది. ►చాలా కొద్ది మందిలో మాత్రం యాసిడ్ పైకి ఎగజిమ్ముతూ ఉండే జీఈఆర్డీ సమస్య చాలాకాలం పాటు కొనసాగేవారిలో నోటి నుంచి జీర్ణాశయం (పొట్ట) వరకు ఉండే నాళం క్రమంగా పేగు వంటి కణజాలాన్ని పెంపొందించుకుంటుంది. దీన్నే బారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అయితే దీనిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అది క్రమంగా ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. నివారణ ►చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ►స్థూలకాయం ఉన్నవారు తప్పక బరువు తగ్గించుకోవాలి ►బరువు పెరుగుతున్న వారు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి ► పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి ►రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు ►రాత్రి ఆహారం తీసుకోగానే నిద్రకు ఉపక్రమించకూడదు ►రాత్రి భోజనం తర్వాత వీలైతే కాసేపు నడవాలి ► రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి ►రాత్రి పడుకోవడానికి ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు ► కంటినిండా నిద్రపోవాలి ►డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్‌ను తీసుకోకూడదు. ►పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ ► మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను తలకింద పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఎసిడిటీ నిర్ధారణ పరీక్షలు యూజీఐ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డీసీజ్ను నిర్ధారణ చేయవచ్చు. ఇక దీన్ని నిర్ధారణ చేయడానికి 24 గంటల పీహెచ్ మానిటరింగ్ పరీక్షను గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు. చికిత్స దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. వీటితో తగినంత ఉపశమనం కనిపిస్తుంది. డయాఫ్రమ్ బలహీనంగా ఉండటంతో కడుపు ఛాతీలోకి పొడుచుకువచ్చిన (హయటస్ హెర్నియా) కండిషన్లో ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గృహ వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఎసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ ఉండి ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి ఎసిడిటీ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గుతుండటం, మింగడం చాలా కష్టంగా అనిపించడం, ఎసిడిటీ మందులు తీసుకుంటున్నా ఉపశమనం కనిపించకపోవడం, చికిత్సకు స్పందించక.. లక్షణాలు పెరుగుతూ పోతూ ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఎసిడిటీ వల్ల కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు ఎప్పుడూ దగ్గు వస్తుండటం గొంతు బొంగురుగా అనిపిస్తుండటం ఆస్తమా – పిల్లికూతలు మింగుతున్నప్పుడు గొంతునొప్పి (అయితే దీన్ని గ్యాస్ కారణంగా అని గుర్తుపట్టలేకపోవడంతో.. దగ్గు, గొంతు బొంగురుపోవడం, ఆయాసపడటం, మింగుతునప్పుడు వచ్చే నొప్పికి మామూలుగా తీసుకునే మందులు వాడుతుంటారు. అవి సమస్యను పరిష్కరించకపోగా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి). కొందరిలో ఉదరంలోని భాగాలను కప్పి ఉంచే డయాఫ్రమ్ అనే పొర బలహీనంగా ఉండటంతో కడుపు భాగం ఛాతీలోకి పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. దాంతో ఛాతీలో నొప్పితో ఎసిడిటీ, గ్యాస్ సమస్య బయటపడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. మలం నల్లరంగులో వస్తుంటే అది కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం అవుతుందన్న దానికి సూచనగా భావించి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. గుండెపోటో, గ్యాస్ ట్రబులో తెలియక తికమక ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని గుండెపోటులా పొరబడే అవకాశం ఉంటుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పే అయినా డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింత వహించాలి. అంతేగానీ... కేవలం ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకోకూడనివి ⇒ స్ట్రాంగ్ కాఫీలు n చాక్లెట్లు ⇒ కూల్ డ్రింక్‌లు ⇒ ఆల్కహాల్ ⇒ మసాలాలతో కూడిన ఆహారం ⇒పుల్లటి సిట్రస్ పండ్లు ⇒ టొమాటో ⇒ కొవ్వుతో ఉండే ఆహారాలు ⇒ వేటమాంసం (రెడ్‌మీట్) చేయకూడనివి... ⇒ ఒకేసారి ఎక్కువగా తినేయడం ⇒ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఎసిడిటీని నివారించే ఆహారాలు... ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ’ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది. తీసుకోవాల్సినవి ⇒కాస్త వీక్‌గా ఉండే హెర్బల్ టీ (అవి కడుపులో యాసిడ్ పాళ్లను పెంచకూడదు) ⇒ తాజా పండ్లు ⇒ పరిశుభ్రమైన మంచినీళ్లు ⇒ నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు ⇒ ఉడికించిన అన్నం, తాజా బ్రెడ్, ఉడికించినమొక్కజొన్న గింజలు ⇒ పియర్పండ్లు, అరటిపండ్లు, ఆపిల్స్, పుచ్చపండు ⇒ ఉడికించిన ఆలూ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారట్, గ్రీన్ పీస్ ⇒ కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు ⇒ కొవ్వు తక్కువగా ఉండే చేపలు, కోడి మాంసం చేయాల్సినవి ⇒ కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినడం ⇒ నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినడం. డాక్టర్ శివరాజు సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హెల్త్‌టిప్స్
ఎసిడిటీ, అజీర్తితో బాధపడేవారు పరగడుపున టీ స్పూన్ అల్లం రసంలో ఐదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకుంటుంటే ఎసిడిటీ, అజీర్తి తగ్గుతాయి.కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లవంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉసిరి పొడి కలుపుకొని ప్రతిరోజూ తీసుకుంటే ఎసిడిటీ సమస్య క్రమంగా తగ్గుతుంది.చలికాలంలో తరచుగా జలుబు వేధిస్తుంటుంది. జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా రెండు రోజులు చేస్తే ఉపశమనం ఉంటుంది. -
'ఏడు'పించే ఎసిడిటీ మనకిక వద్దు!
ఎసిడిటీ మొదలవగానే కడుపులో మంట మొదలైపోతుంది. కడుపు ఉబ్బిపోతుంది. కడుపులో ఇబ్బంది కలుగుతుంది. కడుపులోంచి గొంతులోకి బ్లో అవుట్లా బ్లోటింగ్ రూపంలో వస్తుంటాయి. అనగా ఎడతెరిపి లేకుండా తేన్పులు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ఈ సమస్యనుంచి దూరం కావడానికి మందూ మాకూ వాడకుండానే కేవలం ఏడు జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఏడుపించే సమస్యలు మాయం. మందులు వాడనవసరం లేదనంటే మరీ మంచిదేగా! ఆరోగ్యానికి హెవెన్ ఈ కిందనున్న సెవెన్! 1. ఒంటి బరువు తగ్గితే... కడుపు బరువూ తగ్గుతుంది... పెరిగే బరువును కాస్త అదుపులో పెట్టుకోండి. కనీసం నాలుగైదు కిలోలు తగ్గితే... కడుపు కష్టాలు నాలుగింతలు తగ్గుతాయి. బరువు తగ్గడం నలు విధాల మాత్రమే కాదు పలువిధాల ఆరోగ్యం. కడుపునకూ మహాభాగ్యం. 2. జఠరాగ్నికి ఆజ్యం ఆల్కహాల్... అసలే యాసిడ్. దానికి ఆల్కహాల్ తోడైతే మరింత ముప్పు. ఆహారాన్ని కాల్చేందుకు వాడే ద్రవరూపంలో ఉండే అగ్నే ఈ యాసిడ్. ఆల్కహాల్ తాగడం అంటే ఈ యాసిడ్‌కు మరింత ఆజ్యం పొయ్యడమే. అప్పుడు ఆల్కహాల్ తోడైన యాసిడ్ కడుపులోని రక్షణ కణాల పొరను దెబ్బతీస్తుంది. అందుకే ఎసిడిటీ ఉన్న కొందరిలో మద్యం తాగగానే అది ఆల్కహాలాహలంగా మారిపోతుంది. యాసిడ్ జ్వాలల మంట గొంతులోకి తంతుంటుంది. ఎసిడిటీ ఉన్నవారిలో ఆల్కహాల్ మానేస్తే... అంతా చీర్సే! 3. పొగతాగకండి... కడుపులో ‘పొగ’ రాజేయకండి... పొగ ఊపిరితిత్తులనే ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకుంటున్నారా? పొగ తాగితే కడుపులో నెగడు మండించినట్లే. పొగ వల్ల భుగభుగమని సెగ లెగయగ ఆసిడ్ గొంతులోకి వస్తుంది. పీల్చినప్పుడు పై నుంచి లోపలికి, పీల్చాక కడుపులోంచి పైకి... ఇలా టూ వేస్లోనూ టూ మచ్ ప్రాబ్లమ్. పొగ మానేస్తే నో ప్రాబ్లమ్. అన్నట్టు పొగతో ఆహారకోశం (స్టమక్) నుంచి గొంతులోకి ఉండే మార్గం (అన్నవాహిక-ఈసోఫేగస్)లోకి ఆహారాన్ని పైకి రానివ్వకుండా చూసే కవాటం వదులవుతుంది. దాంతో దాంట్లోంచి యాసిడ్ తేన్పులు పొగలు గక్కుతుంటాయి. కడుపులోని సున్నిత పొరల్నీ రక్కుతుంటాయి. కడుపు పొరలపై పగబట్టే పొగ తాగే అలవాటు వదిలేయండి. స్మోకింగ్ మానేసి కింగ్‌లా ఉండండి. 4. రఫ్ఫాడించే కెఫిన్... కాఫీలోనూ, కొన్ని కూల్‌డ్రింకుల్లోనూ ఉండే కెఫిన్ సైతం కడుపు పొరలపై రఫ్ఫ్గా వ్యవహరిస్తుంటుంది. కెఫిన్ కూడా పొగలాగే కడుపులోంచి ఈసోఫేగస్‌లోకి ఆహారాన్ని రానివ్వకుండా చూస్తే ‘లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’ను సరిగా మూసుకోనివ్వదు. దాంతో కాఫీ తాగగానే కొందరికి దాని రుచి గొంతులోకి వచ్చేసే అనుభవం చాలా సాధారణం. కెఫిన్‌ను తగ్గించుకోండి. యాసిడ్ తుఫాన్‌ను నివారించుకోండి. 5. గ్యాస్ ఉండే డ్రింకులతో గ్యాస్ట్రో వ్యవస్థకు దెబ్బ... అసలే గ్యాసు పైకి తన్నే సమస్య ఉండనే ఉంది. దీనికి తోడు సోడాలు, కూల్ డ్రింకుల వంటి వాటిలో ఉండే గ్యాసు తోడయ్యిందనుకోండి. ఈ డబుల్గ్యాస్లతో కడుపుకు ట్రబుల్ పెరుగుతుంది. ఈ గ్యాస్... కడుపునుంచి తప్పించుకోడానికి గ్యాప్ వెతుకుతుంటాయి. తేన్పుల రూపంలో బాధిస్తుంటాయి. గ్యాస్‌కు తోడైన యాసిడ్ కూడా గొంతులోకి చేదుగా వస్తుంటుంది. మాటిమాటికీ బాధిస్తుంటుంది. 6. అన్నం మితమైతే అన్నకోశానికీ హితం... ఒక్కసారిగా అన్నం ఎక్కువగా తినేస్తే కడుపు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కడుపుబ్బరం అనిపిస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారూ, కడుపుబ్బరంతో బాధపడేవారూ తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. మితమైన మోతాదులతో ఎక్కువ సార్లు తినడం అన్నకోశానికీ మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరంతో సతమతమయ్యే బాధనూ నివారిస్తుంది. 7. తిన్నవెంటనే స్లీపేయకండి... సమస్యను నిద్రలేపకండి : కొందరు ఇలా తినేసి, అలా పడుకుంటుంటారు. తిన్నవెంటనే స్లీపేయడం అంటే కడుపు సమస్యలను నిద్రలేపడమే అంటున్నారు నిపుణులు. మనం నిద్రపోవగానే పక్కకు ఒరుగుతాం. దాంతో గ్రావిటీ వల్ల యాసిడ్ అన్నంపైనే ఉండకుండా అదీ కాస్తంత పక్కకు ఒరుగుతుంది. అంటే నేరుగా అన్నంపై పనిచేయకుండా కడుపు పొరలపై ఎక్కువగా పనిచేస్తుంటుందన్నమాట. సీసాను నిలబెట్టకుండా పక్కకు ఒరిగేలా పడుకోబెట్టినప్పుడు ద్రవం సీసా గొంతులోకి వచ్చినట్లుగానే... యాసిడ్ కూడా గ్రావిటీ బలంతో కాస్తంత గొంతులోకి అంటే ఈసోఫేగస్‌లోకి వచ్చేస్తుంది. ఇందుకే అన్నం తినీతినగానే... పడక మీద పడిపోవద్దు. ఆహారానికి రాత్రి నిద్రకు మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూడండి. కడుపులోని అన్నం పేగుల్లోకి కదిలిపోయేందుకు కాస్త టైమిస్తే... మన టైమ్ బాగుంటుంది. హెల్త్ కూడా బాగుంటుంది. మందులు కొనడం ఎందుకు? అసలే బాగా లేని కడుపులోకి మళ్లీ వాటిని ఎందుకు? ఖర్చు ఎందుకు కడుపును రొచ్చు చేసుకోవడం ఎందుకు? అసలు టాబ్లెట్ అన్న ఊసే లేకుండానే... పై ఏడు మార్గాలతో ఏడిపించే ఎసిడిటీ నుంచి దూరం కావచ్చు. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అసిడిటీ బాధ... తగ్గేదెలా..?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 41 ఏళ్లు. నేను చాలాకాలం నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం కొన్ని టాబ్లెట్లు కూడా వాడాను. ఇప్పుడు మళ్లీ అసిడిటీ కోసం కొన్ని మందులు వాడుతున్నాను. అయినా కడుపు నొప్పి, మలబద్దకం, తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - ప్రసాద్, చీరాల మీరు మందులు వాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ మీరు ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఆ ప్రొసీజర్ చేయించుకోండి. రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి అని రాశారు. మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఐబీఎస్ కాంపోనెంట్ ఉందా లేదా అని చూపించుకోండి. నా వయసు 27 ఏళ్లు. కడుపునొప్పి, బరువు తగ్గుదల ఉంటే పరీక్ష చేయించుకున్నాను. చిన్న పేగుల్లో టీబీ ఉందని డాక్టర్ చెప్పారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా లేదా అన్నది తెలియజేయండి. - సంతోష్‌కుమార్, కాకినాడ చిన్న పేగుల్లో టీబీ వల్ల పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. చిన్నపేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే (పేగులు సన్నబారడం జరిగితే) టీబీ నియంత్రణలోకి వచ్చినా అప్పుడప్పుడూ నొప్పి తిరగబెట్టే అవకాశం ఉంది. మీరేమీ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకోసం చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్నవయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందోమో అని భయంగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శివరామకృష్ణ, ఏలూరు మీ సమస్యను విశ్లేషిస్తే... మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇది ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాదు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. నేను కొంతకాలంగా మలబద్ధకం, మలంలో రక్తం పడటం, మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - రామరాజు, కాకినాడ మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఎన్నో రకాల జబ్బులకు దారితీస్తున్నాయి. వాటిలో ఎక్కువమందిని వేధిస్తున్నవి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపునకు గురవుతాయి. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలుగుతుంది. దాన్నే పైల్స్ అంటారు. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం, అధిక బరువులు ఎత్తడం, దీర్ఘకాలికంగా దగ్గు, వంశపారంపర్యత, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికం. పైన తెలిపిన కారణాల వల్ల మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి వాటిలోని కవాటాలు దెబ్బతినటం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడటంతో తీవ్రమైన నొప్పి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలైన పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వాపునకు గురవడం వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్: మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకుని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. ఫిషర్స్: మలద్వారం వద్ద ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్స్ అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది. ఫిస్టులా: రెండు ఎపితీతియల్ కణజాలం మధ్య ఏర్పడే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవ శరీరంలో ఎక్కడైనా ఇది ఏర్పడవచ్చు. కానీ సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఊబకాయం ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది. రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి, నొప్పి, వాపుతో కూడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. శస్త్రచికిత్స తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు: ఊబకాయం రాకుండా జాగ్రత్త పడటం, పోషకాహారాన్ని... అదీ వేళకు తీసుకోవడం, ఆహారంలో పీచు ఎక్కువ ఉండేవిధంగా చూసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, మాంసాహారం తక్కువ తీసుకోవడం, మలవిసర్జన ప్రతిరోజూ ఉండేలా, అదీ సాఫీగా జరిగేలా చూసుకోవడం, వ్యాయామం చేయడం. హోమియోకేర్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్ధకం వంటి సమస్యలకు మూలకారణాలను గుర్తించి, వైద్యం చేయడం ద్వారా ఈ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి చెక్
* దేశంలోనే తొలిసారిగా ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స * ఔట్ పేషెంట్‌గా వచ్చి అరగంటలో చికిత్స చేయించుకుని వెళ్లొచ్చు * దీంతో శాశ్వతంగా ఎసిడిటీకి చెక్ పెట్టవచ్చన్న చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌లోనే ఈ చికిత్స జరుగుతోందని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తమ ఆస్పత్రిలోనే ఈ పద్ధతిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణా హోటల్లో డైరెక్టర్ జీవీ రావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే అది చివరకు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మందుల వాడకం వల్ల దుష్ఫలితాలు వస్తాయని, అందుకే ఈ చికిత్స సరైందని అన్నారు. జపాన్‌లో ఈ చికిత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చవుతుండగా.. తాము రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకే చేస్తున్నామన్నారు. తిరుపతికి చెందిన స్టాఫ్ నర్స్ అమ్ములు నాలుగేళ్లుగా ఎసిడిటీతో బాధపడుతుంటే ఆమెకు ఈ చికిత్స విజయవంతంగా చేశామన్నారు. ఎండోస్కోపీ విధానం అనేది శస్త్రచికిత్స కాదని.. కేవలం ఎండోస్కోపీ టెక్నిక్‌గా ఆయన అభివర్ణించారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటాన్ని కొత్తగా కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టడమే ఈ వైద్య విధానమన్నారు. కణాలతో కవాటాన్ని సృష్టించి ఈ చికిత్స చేస్తామన్నారు. దీన్నే యాంటీ రిఫ్లక్స్ ముకోసాల్ రిఫ్లెక్షన్ (ఆర్మ్స్) అంటారని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ విధానంలో చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో ఎసిడిటీ సమస్య తలెత్తదన్నారు. 2 వేల ఏళ్లుగా మనుషులకు ఎసిడిటీ వస్తూనే ఉందని, దేశంలో రోజురోజుకూ ఎసిడిటీ సమస్య పెరిగిపోతోందన్నారు. జైపూర్‌లో 22 శాతం మందికి, ఢిల్లీలో 17 శాతం, చెన్నైలో 10 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం, ఏపీలో 24 శాతం మంది ఎసిడిటీతో బాధపడుతున్నారని చెప్పారు. జీవన విధానం మారడం వల్లే ఎసిడిటీ, కడుపులో మంట వస్తుందన్నారు. దాంతోపాటు వ్యాయామం లేకపోవడం మరో ప్రధాన కారణమన్నారు. ఆర్మ్స్ వైద్య చికిత్స విధానాన్ని జపాన్‌కు చెందిన వైద్యుడు కనుగొన్నారని, ఇది వైద్య రంగంలో విప్లవమని పేర్కొన్నారు. -
కడుపు మంటే కదా అని తీసిపారేయకండి..!
బంజారాహిల్స్ (హైదరాబాద్): కడుపులో మంటతో బాధ పడుతున్నవారు తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. వారికి అల్సర్ సోకి తీవ్ర ప్రమాద స్థాయికి చేరుతుందని బెల్జియంకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గై బాక్స్‌టెన్స్ చెప్పారు. శనివారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దెక్కన్ హోటల్లో గ్యాస్ట్రో సొఫాజియల్ రెఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) సదస్సు జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్, చెన్నైకి చెందిన డాక్టర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి డాక్టర్ గై మాట్లాడారు. సమయానికి తినడం, నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్లే ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి కావచ్చని గై చెప్పారు. ధూమపానం, మద్యపానం వల్ల ఈ సమస్య వస్తుందని పేర్కొన్నారు. నొప్పి నివారిణి కోసం వాడే పెయిన్ కిల్లర్స్‌తో ఎసిడిటీ సమస్య తీవ్రంగా ఉంటుందని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. కడుపులోని యాసిడ్ ఛాతిలోకి రావడం వల్ల ఈ మంట వస్తుందని.. ఇది సాధారణమే అయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలకు దారి తీసు ప్రమాదం ఉందని డాక్టర్ తెలిపారు. -
ఎసిడిటీని తగ్గించే ఏలక్కాయ
దినుసు ‘ఫలాలు’ ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. తెల్లరక్తకణాలు ఏం చేస్తాయంటే! హెల్త్ క్విజ్ 1. తెల్లరక్తకణాలు ఏం చేస్తాయి? 2. తెల్లరక్తకణాల్లో ప్రధానమైనవి ఏమిటి? 3. న్యూట్రోఫిల్స్ ఎలా ఉపయోగపడతాయి? 4. లింఫోసైట్స్ ఏం చేస్తాయి? 5. మోనోసైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? 6. ఇజినోఫిల్స్ కలిగించే ప్రయోజనం ఏమిటి? జవాబులు : 1. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడతాయి. 2. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ 3. శరీరానికి బ్యాక్టీరియా, ఫంగైల నుంచి రక్షణ కలిగిస్తాయి. 4. కొన్ని రకాల వైరస్ల నుంచి క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. 5. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 6. కొన్ని పరాన్నజీవుల నుంచి, క్యాన్సర్లనుంచి దేహానికి రక్షణ కల్పిస్తాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలకు నిమిసులైడ్ వద్దు! నిషేధిత మందులు జ్వరం తగ్గడానికి వాడే మందుల్లో నిమిసులైడ్ ఒకటి. అయితే ఈ ఫార్ములాతో తయారైన మందులను పన్నెండేళ్ల లోపు పిల్లలకు వాడకూడదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిషేధం విధించింది కూడా. పన్నెండేళ్ల లోపు పిల్లలకు ప్రిస్కిప్షన్‌లో ఈ మందులను రాయకూడదని డాక్టర్లకు సూచనలిస్తూ, పిల్లలకు రాసిన ప్రిస్కిప్షన్‌లో ఈ మందులు ఉన్నప్పటికీ వారికి ఆ మందులను అమ్మరాదని దుకాణదారులకు ఆదేశాలిచ్చింది. ఈ మందు గాఢత వల్ల పిల్లల్లో హైపోథెర్మియా, కడుపులో అపసవ్యతలు, పేగుల్లో రక్తస్రావం, కాలేయానికి సంబంధించిన సమస్యల వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.