అది ఐబీఎస్ కావచ్చు!
నా వయసు 36 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. ఆరు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – శ్రీరామ్, తిరుపతి
మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం తెలపలేదు. ఇక రెండో అంశం... మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది.
– డాక్టర్ భవానీరాజు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
చిన్నవయసులోనేమోకాళ్ల నొప్పులు
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 27 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నాకు రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పి వస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి. – శిరీష్, గుంటూరు
మీరు చెప్పిన అంశాలను పరిశీలిస్తే... మీకు మోకాలి చిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది తాత్కాలికమైన సమస్య. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
– డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్
హోమియో కౌన్సెలింగ్
ఆటిజమ్ తగ్గుతుందా?
మా అబ్బాయి వయసు ఐదేళ్లు. గత ఎనిమిది నెలలుగా అకారణంగా ఏడ్వటం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవలేకపోవడం, గంటల కొద్దీ స్తబ్ధంగా ఉండటం చేస్తున్నాడు. గట్టిగా అరవడం, నవ్వడం కూడా చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆటిజమ్ అని చెప్పారు. దీనికి హోమియోలో ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా? – నందకిశోర్, గుంటూరు
ఆటిజమ్ ఉన్నవారికి కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఇలాంటి పిల్లల్లో గమనించాల్సిన అంశాలు... ∙ఇతరులతో కలవలేకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, ఒంటరిగానే ఎక్కు సమయం గడపడం. ∙భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావడం ఆలస్యం కావచ్చు ∙ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఒకే రకమైన వస్తువులను సేకరించడం, చేతులు–కాళ్లు అదేపనిగా ఆడించడం వంటివి చేస్తారు. మరీ చిన్న వయసు పిల్లల్లో దీన్ని ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చు ∙అకారణంగా ఏడవటం ∙తల్లి దగ్గరకు తీసుకున్నా గుర్తించకపోవడం ∙పరిచితమైన వ్యక్తులను చూడగానే పలకరింపు నవ్వు కూడా నవ్వకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక కాస్త పెద్ద వయసులో ఉన్నవారిలో అయితే... మిగతా పిల్లలతో కలవలేకపోవడం ∙పిలిస్తే పలకకపోవడం ∙మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపడం ∙కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం, చేతులు–కాళ్లు లేదా వేళ్లు అసహజంగా ఒకే తీరులో కదిలిస్తూ ఉండటం ∙మానసిక ఎదుగుదల లోపించడం లేదా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ చురుకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ సమస్యతో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
ఆటిజమ్‌కు కారణాలు ఇవీ అని చెప్పడం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి. కొందరిలో మెదడులో లోపాలుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోముల వంటివి కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్‌ల బారిన పడ్డా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఈ సమస్యతో బాధపడే అందరిలోనూ ఒకేలాంటి తీవ్రత ఉండదు. దీనిని నివారించడానికి పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎక్కువ సమయం వారితో గడపాలి.హోమియోలో ఈ సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది, పిల్లల వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని కాన్స్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను క్రమక్రమంగా తగ్గిస్తూ... పూర్తిగా నయం చేయవచ్చు.
– డాక్టర్ ఎ.ఎం. రెడ్డి,
సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
తలకు దెబ్బ తగిలినా కోలుకోవడం అసాధ్యమేమీ కాదు...
న్యూరో కౌన్సెలింగ్
మా స్నేహితుడి వయసు 21. ఆర్నెల్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌లో తలకు గాయమై, రక్తస్రావం అయింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మా పేర్లు కూడా తప్పుగా చెబుతున్నాడు. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతూ... ఎమ్సెట్ క్లాస్ మిస్సవుతున్నానంటాడు. వాడు మామూలుగా అవుతాడా? చదువు పూర్తిచేయగలడా? తలకు దెబ్బతగిలిన వారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? దయచేసి తెలపండి. – మహేశ్‌కుమార్, హనుమకొండ
మన మెదడు సున్నితమైన అనేక రసాయనిక చర్యల వల్ల పనిచేస్తుంటుంది. మెదడులోని రసాయనాలను న్యూరోట్రాన్స్‌మీటర్లు అంటారు. రసాయన సంకేతాలుగా పనిచేసే ఇవి మెదడులోని ప్రాథమిక కణాలైన న్యూరాన్ల మధ్య సమాచారాన్ని మార్పిడి చేస్తుంటాయి. ఇది ఆ వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలను మార్చి వేస్తుంది. మెదడులోని రసాయనాల సమతూకం సరికావడానికి కొన్ని వారాల నుంచి కొన్నిసార్లు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ విధంగా సరిచేసుకునేందుకు మెదడుకు ఉండే సామర్థ్యం వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి కోలుకోవడం అన్నది గాయం తీవ్రతపైన కూడా ఆధారపడి ఉంటుంది.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ స్నేహితుడి తలకు పెద్ద గాయమే అయినట్లుంది. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తులు తిరిగి సాధారణ సామర్థ్యంతో పనిచేయడం సాధ్యం కాదని అపోహపడుతుంటారు. కానీ మీరు నిరాశచెందనవసరం లేదు. తలకు తీవ్ర గాయం అయినప్పుడు కోలుకోవడం విషయంలో ఆసక్తికరమైన, ఆశాజనకమైన మరో అంశం సహజంగా కోలుకునేందుకు సంబంధించి, మెదడుకు ఉన్న సామర్థ్యం. ఇందుకోసం మెదడు కొత్త న్యూరాన్లను తయారు చేసుకోగలదని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రక్రియ ఏ మేరకు, ఎంత వేగంగా జరుగుతుందన్నది ఇంకా స్పష్టంగా వెల్లడికానప్పటికీ, మెదడు గాయపడ్డ వ్యక్తి పునరావాస అవకాశాలు మాత్రం మెరుగుపడతాయన్నది సుస్పష్టం. ఈ కోలుకునే ప్రక్రియ మీద వ్యక్తి వయసు ప్రభావం ఉంటుందా... అని అడిగితే ఉంటుందనే చెప్పాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు కోలుకునే శక్తి తగ్గుతుంది. కానీ మీ ఫ్రెండ్‌ది చిన్న వయసే కాబట్టి అతడు కోలుకొని చదువు కొనసాగించేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి.
– డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం,
సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
Published Thu, Apr 20 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
Advertisement
Advertisement