కొవ్వు కాదమ్మా.. ఇది కడుపు ఉబ్బరం! | special story to dripping | Sakshi
Sakshi News home page

కొవ్వు కాదమ్మా.. ఇది కడుపు ఉబ్బరం!

Published Wed, Nov 22 2017 11:12 PM | Last Updated on Wed, Nov 22 2017 11:44 PM

special story to dripping - Sakshi - Sakshi - Sakshi - Sakshi

‘ఏం తిన్నా పొట్ట రాయిలా టైట్‌గా అయిపోతోంది’... ‘ఏమిటో... ఈమధ్య ఏదైనా తినగానే కడుపు ఉబ్బరం. ఛాతీ నుంచి కింద పొట్ట వరకూ ఒకటే మంట’... ‘తిన్నదేమీ లేదు గాని పొద్దస్తమానం ఇలా తేన్పులు’... ఇవీ నలుగురు కూడి కలిసిన చోట్ల మాట్లాడే మాటల్లో కనీసం ముగ్గురు చెప్పుకునే మాటలు, చేసుకునే ఫిర్యాదులు.

మామూలు వాళ్లకి ఇదో ఇబ్బందా అనిపిస్తుందేమో! కానీ... మనకు తెలియకుండానే జీవనశైలిని ప్రభావితం చేసే ఎంతో పెద్ద సమస్య ఇది.   తిన్న ఆహారం అరుగుదల విషయంలో మనం రోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

కడుపులో గ్యాస్‌ చేరడంతో ఉబ్బరం ఎవరిలోనంటే...
కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్‌ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్నపేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి మలద్వారం గుండా బయటకు పోతుంటుంది. కానీ చాలా మందిలో గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా పరిణమిస్తుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్దకం, పొట్టనొప్పి, హైపర్‌ అసిడిటీలకు దారితీయవచ్చు. ఈ సమస్యకు వివిధ కారణాలు... అది బాధించేవారెవరంటే...  

∙బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు  పొగతాగే అలవాటు ఉన్నవారు ∙చ్యూయింగ్‌గమ్‌ నమిలేవారు  ∙హార్డ్‌ క్యాండీల వంటివాటిని ఎప్పుడూ చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ / కూల్‌డ్రింక్స్‌ (గ్యాస్‌ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు ∙వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరు తినేటప్పుడు గ్యాస్‌ ఎక్కువగా మింగుతుంటారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్‌ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది.

గ్యాస్‌ తగ్గడానికి పరిష్కారం ఏమిటి?
మీరు ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్‌ సమస్య అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
∙తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి.  పెదవులు మూసి తినడం మంచిది. ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్‌ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. ∙ సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి ∙జ్యూస్‌ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి ∙గ్యాస్‌ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.

గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్‌ సమస్య పెరుగుతుంటే... మార్కెట్‌లో ఇటీవల ల్యాక్టోజ్‌ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఈ సమస్యకు దోహదపడే అంశాలు
రోజూ తీసుకునే మోతాదుకంటే ఎక్కువగా ఆహారం తినడం ∙ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. ∙అసిడిక్‌ నేచర్‌ ఎక్కువగా ఉండే ఆహారాలైన టమాటా, నిమ్మ జాతి పండ్లు, పుల్లగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్‌ కోలా డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్నొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

కడుపు ఉబ్బరం– పరిష్కారాలు
తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. ∙పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి ∙చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లు తీసుకోవచ్చు ∙కొవ్వుతో కూడిన వాటిని పరిమితంగా తీసుకోండి ∙తినకముందే పాక్షికంగా పులిసే ఇడ్లీ, దోసెల వంటివాటిని ఎక్కువగా తీసుకోండి. ఇలాంటి ఆహారాన్ని పూర్తిగా పులియకముందే తినడం మంచిది ∙మాంసాహారంలో కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ మేలు  రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండండి ∙ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.

కడుపు ఉబ్బరం తగ్గించడానికి ఆహారపరమైన మార్గదర్శకాలివి...
పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలను తగ్గిస్తాయి. పొటాషియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు... అరటిపండ్లు, పుచ్చకాయ, టొమాటోలు, బాదాం వంటి నట్స్‌ ∙కొబ్బరినీళ్లలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. ఒంట్లోని సోడియమ్‌ను బయటకు పంపిస్తాయి, దాంతో కడుపులోని గ్యాస్, కడుపుఉబ్బరం తగ్గుతాయి.  భోజనం తర్వాత సోంఫ్‌ తింటే కొంతవరకు పొట్టఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఒక టీ–స్పూన్‌ సోంఫ్‌ గింజలను ఒక గ్లాసెడు నీళ్లు లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు.  ∙గ్లాసెడు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అవుతుంది. ఇక వేణ్ణీళ్లలో  నిమ్మరసం కలిపినప్పుడు... ఆ మిశ్రమానికి విరేచనాన్ని మృదువుగా చేసి సాఫీగా బయటకు వెళ్లేలా చేసే గుణం ఉంటుంది. మృదువిరేచనం అయినప్పుడు గ్యాస్‌ కూడా సాఫీగా బయటకు వెళ్లి పొట్ట తేలిగ్గా ఉంటుంది.

రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి
దాల్చినచెక్క కడుపుబ్బరాన్ని సమర్థంగా తగ్గిస్తుంది. ఒక గ్లాసెడు వేడి నీళ్లలో ఒక కాస్తంత దాల్చిన చెక్క పొడితో పాటు ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే పొట్ట ఉబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.∙బ్రిస్క్‌వాకింగ్‌ గానీ, జాగింగ్‌ లేదా రన్నింగ్‌ వల్ల కడుపులోని గ్యాస్‌ కదిలి బయటకు వెళ్తుంది. ఇదే అలవాటును కొనసాగిస్తే కడుపు ఉబ్బరం ఉండదు.
వెల్లుల్లి : మొత్తం జీర్ణవ్యవస్థనే శుభ్రం చేసి, కడుపు ఉబ్బరాన్ని పూర్తిగా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను మింగండి. ఆ తర్వాత భోజనం చేయండి. కింది నుంచి గ్యాస్‌ వెళ్లిపోయి కడుపు తేలిక అవుతుంది. ఇది కాస్త ప్రయత్నించి చూడాల్సిన అంశం. ఎందుకంటే... సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కొందరిలో... విచిత్రంగా అవే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. అలాగే మీకు ఏ ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుందో కూడా గమనించుకొని, వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి.

ప్రోబయాటిక్‌ డ్రింక్స్‌ కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. అది కుదరకపోతే తాజా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే కొందరికి పెరుగు కూడా కడుపుబ్బరం, గ్యాస్‌ తగ్గిస్తుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్,బైఫిడోబ్యాక్టీరియమ్‌ అనే మేలు చేసే బ్యాక్టీరియా (ప్రోబయాటిక్స్‌) కడుపులోని ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కానీ ఇటీవల ‘యోగర్ట్‌’ పేరిట పెరుగులోనే అనేక ఫ్లేవర్స్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి వల్ల మాత్రం కడుపు ఉబ్బరం, గ్యాస్‌ తగ్గడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. ఇంట్లో చేసే పెరుగు మంచిది.∙ఆర్టిచోక్‌ అనే మొక్కలో సినారిన్‌ అనే పదార్థం ఉంటుంది. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఆర్టిచోక్‌ తీసుకోవడం వల్ల అందులోని ‘సినారిన్‌’ అనే పదార్థం కడుపులోని గ్యాస్‌ను తొలగించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ∙అవకాడోలో ఉండే లైపేజ్‌ కూడా కొవ్వులను త్వరగా జీర్ణం చేసి కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది.
అల్లం టీ: అప్పుడప్పుడూ తాజాగా అల్లం టీ తయారు చేసుకొని తాగితే కడుపు తేలిగ్గా ఉంటుంది.
పుదీనా టీ : పుదీనా ఆకులను టీలాగా కాచుకొని తాగితే కడుపు ఉబ్బరంతో పాటు అనేక జీర్ణవ్యవస్థలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అల్లం తురుము కాస్తంత కలుపుకొని మజ్జిగ తాగడం కూడా కడుపును తేలిక చేస్తుంది. 

పప్పు తింటే గ్యాస్‌ పెరుగుతుందా:

ఒక్కొక్కరి జీర్ణవ్యవస్థ పనితీరు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో పదార్థాన్ని జీర్ణం చేసుకునే తీరు కూడా ఒక్కోలా ఉంటుంది. అందుకే పప్పులు ప్రతి ఒక్కరిలో అదే తరహాలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయనేమీ లేదు.
చిక్కుళ్లు, ఇతరత్రా పప్పు ధాన్యాల్లో నీటిలో కరగని పీచు (ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌) చాలా ఎక్కువ. ఆ పీచును అరగదీయడంలో జీర్ణవ్యవస్థ చాలా కష్టపడుతుందని ‘మయో క్లినిక్‌’ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.  పప్పులు, ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌ ఉన్న చిక్కుళ్లు, బీన్స్‌ వంటి వాటిని ఎక్కువ సేపు నానబెట్టి ఉడికించడం వల్ల, వాటిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌కు కారణమయ్యే ఫైలేట్స్‌ పాళ్లు తగ్గి పొట్ట హాయిగా ఉంటుంది.

గ్యాస్‌ను ఉత్పన్నం చేసే ఆహారాలు....
∙బీన్స్‌ ∙బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు
∙పియర్స్, ఆపిల్స్‌ ∙పొట్టు ఉన్న గోధుమలు
∙సోడాలు, కూల్‌డ్రింక్స్‌
∙పాలు, పాల ఉత్పాదనల్లో చీజ్, ఐస్‌క్రీమ్స్‌
∙ప్యాకేజ్‌ఫుడ్స్‌లో బ్రెడ్స్‌ వంటివి తినేవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్‌ మినహాయిస్తే మిగతావి చాలా ఆరోగ్యకరం. కాబట్టి వాటిని సమస్య రానంత మేరకు పరిమితంగా తీసుకోవాలి.

కడుపు ఉబ్బరం సమస్య తగ్గడానికి ఆహారమే మంచి ఔషధం. అలాగే అరటి వంటి కొన్ని పండ్లు కూడా. అయితే పండ్లు తినే సమయంలో కొన్ని రకాల పండ్లలో (ముఖ్యంగా ఆపిల్, పియర్‌ వంటి వాటిల్లో) సార్బిటాల్‌ అనే చక్కెరలాంటి పదార్థం ఉంటుంది. ఇది కడుపుబ్బరాన్ని కలిగించవచ్చు. అలాగే పెరుగు వంటివి కూడా. అందుకే  ఇందులో ఏ ప్రక్రియ మీకు సరిపడుతుందో, దేన్ని అవలంబిస్తే కడుపు తేలిక అవుతుందో గమనించి  దాన్ని అనుసరించవచ్చు. పైగా ఇక్కడ పేర్కొన్న చిట్కాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రోగనిరోధక శక్తిని పెంచేవే. కాబట్టి మీరు ఇబ్బంది కలిగించకుండా ఉండేదాన్ని ఎంచుకోండి. కడుపును తేలిగ్గా ఉంచుకోండి.
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ రామకృష్ణ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌
– రాధిక, చీఫ్‌ డైటీషియన్‌ కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement