బర్నింగ్ ప్రాబ్లమ్!
ఒకప్పుడు ట్రైన్ ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. బొగ్గును తీసుకొని ఇంజన్ కడుపులో వేస్తే భగభగమని మండి ఛుక్ ఛుక్‌మని పరుగెడుతుండేవి. మన కడుపూ అంతే. కడుపులో అన్నం పడితే... ఆ అన్నం భగభగా మండి మనల్ని పరుగులు తీసేలా చేస్తుంది. కానీ... వేళకు అన్నం పడకపోతే కడుపే మండిపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో యాసిడ్ తిప్పేస్తుంది. ఈరోజుల్లో వేళకు భోజనం, నిద్ర ఎలాగూ కరువయ్యాయి. దీనికి తోడు పాడు స్ట్రెస్ యాసిడ్‌ను చిమ్మిస్తూనే ఉంటుంది. కడుపు రగిలిపోతూనే ఉంటుంది... అమ్మో!! ఎసిడిటీ... బర్నింగ్ ప్రాబ్లమ్!
మనం తిన్న అన్నం అరగాలంటే యాసిడ్ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా... లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే... కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. ఆ యాసిడ్ మంటలూ, కడుపు ఉబ్బరాలపై అవగాహన కోసం ఈ కథనం.
కడుపు నిర్మాణం అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలికను చూద్దాం. అచ్చం కింద ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఒక సన్న మూతి ఉన్న సీసాలా ఉంటుంది మన కడుపు నిర్మాణం. అలాంటి సీసాలో నీళ్లు పోస్తున్నామనుకోండి. ఏమవుతుందో ఊహించండి. కింది నుంచి గాలి బుడగలు బుసబుసమంటూ పైకి వస్తాయి కదా. కడుపులోని అన్నంపై యాసిడ్ పనిచేస్తున్నప్పుడు, అవసరమైన దాని కంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు అది పైకి తంతుంది. అలాగే గ్యాస్ కూడా. ఆ గ్యాస్ పైకి వస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు యాసిడ్ పైకి రావడాన్ని వెట్‌బర్ప్ అంటారు. ప్రతివారూ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అయితే కొందరికి అది నిత్యకృత్యం. యాసిడ్, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు.
ఈ సమస్యకు పేర్లు ఎన్నో...
యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, గ్యాస్ కడుపులోనే చిక్కుకుపోయి కడుపు ఉబ్బరంగా ఉండే ఈ సమస్యను సాధారణంగా ఎసిడిటీగా పేర్కొంటాం. అయితే దీనికి వైద్యపరంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి... నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్‌ఈఆర్‌డీ), ఎరోసివ్ ఈసోఫేజియల్ డిసీజ్ (ఈఈజీ), గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ). కొందరిలో ఎసిడిటీ వల్ల కడుపు మంట, గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం రాత్రివేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా రాత్రివేళల్లో కనిపించే ఆ సమస్యను నాక్చర్నల్ జీఈఆర్‌డీ అంటారు.
కారణాలు
గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్ లైఫ్‌స్టైల్), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్న వెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ∙ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం ∙పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడంతో యాసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ∙జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అదేపనిగా వేపుడు పదార్థాలు తీసుకుంటూ ఉండటం, కొన్నిసార్లు భోజనం తినకపోవడం (మీల్ స్కిప్ చేయడం), తీవ్రమైన పని ఒత్తిడి ∙రాత్రిషిఫ్ట్‌లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం ∙అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం ∙నిద్రలేమి.
మరికొన్ని అంశాలు
పైన పేర్కొన్న కారణాలతో పాటు మరికొన్ని అంశాలు సైతం ఎసిడిటీకి దోహదం చేస్తుంటాయి. అవి... ∙స్థూలకాయం ∙ఒళ్లు కదలకుండా ఒకే చోట కుదురుగా కూర్చొని పనిచేసే వృత్తులలో ఉండటం వ్యాయామం చేయకపోవడం ∙తరచూ కాఫీ తాగడం లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ∙చాక్లెట్లు తినడం రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వంటి అంశాలు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి ∙ఇక మద్యం (ఆల్కహాల్), పొగతాగే అలవాటు, మింట్ (పుదీనా బిళ్లలు) చప్పరిస్తూ ఉండటం కూడా ఎసిడిటీకి దోహదం చేస్తుంది.
అనర్థాలు
►దీర్ఘకాలికంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుండేవారిలో చాలా ఆరోగ్యపరమైన అనర్థాలు సంభవిస్తుంటాయి.
►జీర్ణాశయం కింది భాగం (లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్) సన్నబడిపోతుంది.
►చాలా కొద్ది మందిలో మాత్రం యాసిడ్ పైకి ఎగజిమ్ముతూ ఉండే జీఈఆర్‌డీ సమస్య చాలాకాలం పాటు కొనసాగేవారిలో నోటి నుంచి జీర్ణాశయం (పొట్ట) వరకు ఉండే నాళం క్రమంగా పేగు వంటి కణజాలాన్ని పెంపొందించుకుంటుంది. దీన్నే బారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అయితే దీనిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అది క్రమంగా ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.
నివారణ
►చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి.
►స్థూలకాయం ఉన్నవారు తప్పక బరువు తగ్గించుకోవాలి
►బరువు పెరుగుతున్న వారు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి
► పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి
►రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు
►రాత్రి ఆహారం తీసుకోగానే నిద్రకు ఉపక్రమించకూడదు
►రాత్రి భోజనం తర్వాత వీలైతే కాసేపు నడవాలి
► రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి
►రాత్రి పడుకోవడానికి ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు
► కంటినిండా నిద్రపోవాలి
►డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్‌ను తీసుకోకూడదు.
►పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ
► మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను తలకింద పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు.
ఎసిడిటీ నిర్ధారణ పరీక్షలు
యూజీఐ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డీసీజ్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఇక దీన్ని నిర్ధారణ చేయడానికి 24 గంటల పీహెచ్ మానిటరింగ్ పరీక్షను గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు.
చికిత్స
దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. వీటితో తగినంత ఉపశమనం కనిపిస్తుంది. డయాఫ్రమ్ బలహీనంగా ఉండటంతో కడుపు ఛాతీలోకి పొడుచుకువచ్చిన (హయటస్ హెర్నియా) కండిషన్‌లో ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
గృహ వైద్యం
అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఎసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి.
ఎసిడిటీ ఉండి ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి
ఎసిడిటీ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గుతుండటం, మింగడం చాలా కష్టంగా అనిపించడం, ఎసిడిటీ మందులు తీసుకుంటున్నా ఉపశమనం కనిపించకపోవడం, చికిత్సకు స్పందించక.. లక్షణాలు పెరుగుతూ పోతూ ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
ఎసిడిటీ వల్ల కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు
ఎప్పుడూ దగ్గు వస్తుండటం గొంతు బొంగురుగా అనిపిస్తుండటం ఆస్తమా – పిల్లికూతలు మింగుతున్నప్పుడు గొంతునొప్పి (అయితే దీన్ని గ్యాస్ కారణంగా అని గుర్తుపట్టలేకపోవడంతో.. దగ్గు, గొంతు బొంగురుపోవడం, ఆయాసపడటం, మింగుతునప్పుడు వచ్చే నొప్పికి మామూలుగా తీసుకునే మందులు వాడుతుంటారు. అవి సమస్యను పరిష్కరించకపోగా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి).
కొందరిలో ఉదరంలోని భాగాలను కప్పి ఉంచే డయాఫ్రమ్ అనే పొర బలహీనంగా ఉండటంతో కడుపు భాగం ఛాతీలోకి పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. దాంతో ఛాతీలో నొప్పితో ఎసిడిటీ, గ్యాస్ సమస్య బయటపడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్‌ట్రబుల్‌కు దోహదపడుతుంటాయి. మలం నల్లరంగులో వస్తుంటే అది కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం అవుతుందన్న దానికి సూచనగా భావించి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
గుండెపోటో, గ్యాస్ ట్రబులో తెలియక తికమక
ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని గుండెపోటులా పొరబడే అవకాశం ఉంటుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పే అయినా డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింత వహించాలి. అంతేగానీ... కేవలం ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పే అయినా నిర్లక్ష్యం చేయకూడదు.
తీసుకోకూడనివి
⇒ స్ట్రాంగ్ కాఫీలు n చాక్‌లెట్లు
⇒ కూల్ డ్రింక్‌లు
⇒ ఆల్కహాల్
⇒ మసాలాలతో కూడిన ఆహారం
⇒పుల్లటి సిట్రస్ పండ్లు
⇒ టొమాటో
⇒ కొవ్వుతో ఉండే ఆహారాలు
⇒ వేటమాంసం (రెడ్‌మీట్) చేయకూడనివి...
⇒ ఒకేసారి ఎక్కువగా తినేయడం
⇒ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.
ఎసిడిటీని నివారించే ఆహారాలు...
ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ’ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది.
తీసుకోవాల్సినవి
⇒కాస్త వీక్‌గా ఉండే హెర్బల్ టీ (అవి కడుపులో యాసిడ్ పాళ్లను పెంచకూడదు)
⇒ తాజా పండ్లు
⇒ పరిశుభ్రమైన మంచినీళ్లు
⇒ నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు
⇒ ఉడికించిన అన్నం, తాజా బ్రెడ్, ఉడికించినమొక్కజొన్న గింజలు
⇒ పియర్‌పండ్లు, అరటిపండ్లు, ఆపిల్స్, పుచ్చపండు
⇒ ఉడికించిన ఆలూ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారట్, గ్రీన్ పీస్
⇒ కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు
⇒ కొవ్వు తక్కువగా ఉండే చేపలు, కోడి మాంసం చేయాల్సినవి
⇒ కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినడం
⇒ నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినడం.
డాక్టర్ శివరాజు
సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్