అసిడిటీ బాధ... తగ్గేదెలా..?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 41 ఏళ్లు. నేను చాలాకాలం నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం కొన్ని టాబ్లెట్లు కూడా వాడాను. ఇప్పుడు మళ్లీ అసిడిటీ కోసం కొన్ని మందులు వాడుతున్నాను. అయినా కడుపు నొప్పి, మలబద్దకం, తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - ప్రసాద్, చీరాల
మీరు మందులు వాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ మీరు ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఆ ప్రొసీజర్ చేయించుకోండి. రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి అని రాశారు. మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఐబీఎస్ కాంపోనెంట్ ఉందా లేదా అని చూపించుకోండి.
నా వయసు 27 ఏళ్లు. కడుపునొప్పి, బరువు తగ్గుదల ఉంటే పరీక్ష చేయించుకున్నాను. చిన్న పేగుల్లో టీబీ ఉందని డాక్టర్ చెప్పారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా లేదా అన్నది తెలియజేయండి. - సంతోష్‌కుమార్, కాకినాడ
చిన్న పేగుల్లో టీబీ వల్ల పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. చిన్నపేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే (పేగులు సన్నబారడం జరిగితే) టీబీ నియంత్రణలోకి వచ్చినా అప్పుడప్పుడూ నొప్పి తిరగబెట్టే అవకాశం ఉంది. మీరేమీ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకోసం చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్నవయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందోమో అని భయంగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శివరామకృష్ణ, ఏలూరు
మీ సమస్యను విశ్లేషిస్తే... మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇది ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాదు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 38. నేను కొంతకాలంగా మలబద్ధకం, మలంలో రక్తం పడటం, మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - రామరాజు, కాకినాడ
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఎన్నో రకాల జబ్బులకు దారితీస్తున్నాయి. వాటిలో ఎక్కువమందిని వేధిస్తున్నవి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా.
పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపునకు గురవుతాయి. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలుగుతుంది. దాన్నే పైల్స్ అంటారు.
కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం, అధిక బరువులు ఎత్తడం, దీర్ఘకాలికంగా దగ్గు, వంశపారంపర్యత, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికం. పైన తెలిపిన కారణాల వల్ల మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి వాటిలోని కవాటాలు దెబ్బతినటం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడటంతో తీవ్రమైన నొప్పి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.
పైల్స్‌లో ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలైన పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వాపునకు గురవడం వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్‌టర్నల్ పైల్స్: మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకుని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. ఫిషర్స్: మలద్వారం వద్ద ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్స్ అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది.
ఫిస్టులా: రెండు ఎపితీతియల్ కణజాలం మధ్య ఏర్పడే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవ శరీరంలో ఎక్కడైనా ఇది ఏర్పడవచ్చు. కానీ సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఊబకాయం ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది. రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి, నొప్పి, వాపుతో కూడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. శస్త్రచికిత్స తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు: ఊబకాయం రాకుండా జాగ్రత్త పడటం, పోషకాహారాన్ని... అదీ వేళకు తీసుకోవడం, ఆహారంలో పీచు ఎక్కువ ఉండేవిధంగా చూసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, మాంసాహారం తక్కువ తీసుకోవడం, మలవిసర్జన ప్రతిరోజూ ఉండేలా, అదీ సాఫీగా జరిగేలా చూసుకోవడం, వ్యాయామం చేయడం.
హోమియోకేర్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్ధకం వంటి సమస్యలకు మూలకారణాలను గుర్తించి, వైద్యం చేయడం ద్వారా ఈ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్