అడవిమల్లె... ‘అవా!’ | Adavimalle ... 'Ava' | Sakshi
Sakshi News home page

అడవిమల్లె... ‘అవా!’

Published Thu, Feb 20 2014 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

అడవిమల్లె... ‘అవా!’ - Sakshi

పామ్ చెట్లతో ముడిపడ్డ జీవనం వారిది.
 పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరే నైజం వారిది.
 జంతువులను కూడా బిడ్డల్లా
 సాకగలిగే హృదయం వారిది.
 అడవిలో పుట్టి, అడవిలో పెరిగి,
 అడవిలోనే కలిసిపోతున్న అచ్చమైన అడవి మల్లెలు ‘అవా’గిరిజన తెగ ప్రజలు.

 
భూమిపై అంతరించిపోతున్న గిరిజన జాతుల్లో ప్రథమస్థానంలో ఉంది ‘అవా!’ భూమిపై ఇతర వ్యక్తులతో ఎలాంటి పరిచయాలనూ పెట్టుకోకుండా ఉన్న జాతి కూడా ‘అవా’ ఒక్కటే! 1800ల కాలంలో ఆంగ్లేయులను పోలినట్టుగా ఉండే ‘అవా’ తెగ ఆహార్యం అండమాన్‌లోని ‘జరావా’ జాతి వారి జీవనశైలికి దగ్గరగా ఉంటుంది.
 
వివాహాలకు పరిమితి లేదు...

ఈ తెగలో అందరికీ అందరితో బంధుత్వం ఉంటుంది. చిన్న చిన్న సమూహాలుగా ఉండే పెద్ద కుటుంబం వీరిది. ‘టుపి’ భాషలో మాట్లాడుకుంటారు. ఎంత దూరమైనా సమూహమంతా కలిసే వెళతారు. ‘అవా’ పురుషులు, స్త్రీలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ లింగ వివక్ష లేదు. ‘అవా’ పురుషులు పెద్ద జంతువులను వేటాడితే.. స్త్రీలు చిన్నజంతువులను వేటాడతారు.

అలాగే ఫలాలను సేకరించడం, పిల్లల పెంపకాలను ఈ తెగ స్త్రీ బాధ్యతగా తీసుకుంటుంది. ఆహారపదార్థాలను సేకరించడంలో సహాయపడే జంతువులను ‘అవా’ జాతి అమితంగా ప్రేమిస్తుంది. ముఖ్యంగా కోతులను జీవితంలో భాగం చేసుకుంటుంది ‘అవా’ మహిళ. ఎంతలా అంటే ఒక రొమ్మున తన బిడ్డకు పాలు ఇస్తూనే, మరో రొమ్మున కోతి పిల్లకు పాలుపడుతుంది. నలువైపులా చురుగ్గా శోధించే గద్దలనూ దగ్గరకు తీస్తుంది. వీటి సంజ్ఞల ఆధారంగా పొంచి ఉండే ప్రమాదాలను తెలుసుకుంటుంది.

ఈ తెగ లో వయసులో పెద్ద అయిన మహిళ నాయకురాలిగా ఉండి, సలహాలు ఇస్తుం టుంది. వివాహాలను కుదర్చడం, ప్రసవ సమయంలో శిశువులను కాపాడటం ఈ నాయకురాలి విధి. ‘అవా’ జీవనవిధానం అంతా ద్రావిడ పద్ధతిలో ఉండటం విశేషం. అయితే తెగ నుంచి వేరయిన వారితో వీరు తిరిగి బంధుత్వాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే అలా దూరమైన వారు తమ తెగ వారే అనే నమ్మకం లేకపోవడం వల్ల. ఆ విధంగానే ఈ తెగ అతి పెద్ద సమూహం నుంచి అతి చిన్న సమూహంగా మారి ఉంటుందని పరిశోధకుల అంచనా!
 
పామ్ చెట్లతో అనుబంధం...

 
దుస్తుల గురించి వారికి తెలియదు. పామ్ చెట్ల తీగలను, ఆకులను అల్లి అడ్డవస్త్రంగా ధరిస్తారు. పామ్ చెట్ల నుంచి తీసిన నారను తాడులా పేని, దానికి చిన్నచిన్న గవ్వలు గుచ్చి మెడలో ధరిస్తారు. పామ్ చెట్ల ఆకులతో బుట్టలు అల్లుతారు. పామ్ చెట్ల కొమ్మల నుంచి తీసిన నారతో గట్టి తాళ్లను పేనుతారు. పామ్ చెట్ల ఆకులతోనే త్రిభుజాకారంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు.
 
అడవిలో అత్యంత లాఘవంగా జంతువులను ఎలా వేటాడాలో, ఆహారాన్ని ఎలా సేకరించుకోవచ్చో ఈ తెగకు తెలుసు. కానీ, ఆధునిక మనుషుల అన్యాయాలను ఎదుర్కో వడం తెలియదు. దీనివల్లే ఆధునిక ప్రపంచం నుంచి మరింత దూరంగా వెళ్లిపోతోంది ఈ తెగ. వీరి సమస్యను చూస్తుంటే తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డలు తిరిగి ఆ తల్లి గర్భంలోకే వెళుతున్నట్టుగా ఉంటుంది.
 
 సంక్షేమం
 తూర్పు, ఈశాన్య బ్రెజిల్‌లో భాగమైన అమెజాన్ అడవిలో ఉంది ‘అవా!’ తెగ. ప్రస్తుతం వారి సంఖ్య 350. మరో 100 మంది ఈ తెగతో వేరై ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకుండా జీవిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలుసుకుంది.  ‘అవా’ తెగను 1973లో మొదటిసారి బ్రెజిల్ ప్రభుత్వం గుర్తించింది. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలకన్నా యురోపియన్ ఆక్రమణదారుల హింసాత్మక దాడులతో ‘అవా’ తెగ చిన్నాభిన్నమైపోయింది. ఈ పరిస్థితిని గమనించి ‘అవా’ తెగవారి సంక్షేమం కోస అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించింది. ‘అవా’తెగ జీవించడానికి అనువుగా గ్రామాలను ఏర్పాటుచేసింది. అయితే ఈ తెగవారు ప్రభుత్వ సహాయం తీసుకోవడం లేదు. తమ పూర్వపు సంస్కృతినే కాపాడుకుంటూ వస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement