ఆదిత్య, అవ్నీష్
బిడ్డ ఉన్నాడు. తల్లెక్కడ?! ఈయనే తల్లి. తల్లి మాత్రమే కాదు. ప్రపంచంలోనే ‘బెస్ట్ మమ్మీ’ కూడా. ఈ మహిళా దినోత్సవం రోజు బెంగళూరులో జరుగుతున్న ‘వెంపవర్’ ఈవెంట్‌లో మరికొందరు బెస్ట్ మమ్మీలతో పాటు ఈయనా ‘వరల్డ్స్ బెస్ట్ మమ్మీ’ అవార్డు అందుకోబోతున్నారు. పేరు ఆదిత్యా తివారి. ఉండటం పుణె. కొడుకు పేరు అవ్నీష్. నాలుగేళ్ల క్రితం రెండేళ్ల వయసున్న అవ్నీష్‌ని దత్తత తీసుకున్నారు ఆదిత్య. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతడు. అవ్నీష్ సంరక్షణ కోసం ఉద్యోగం మానేశాడు. అవ్నీష్ కొంచెం పెద్దయితే మళ్లీ చేరొచ్చని ఆలోచన. అవ్నీష్ స్పెషల్ చైల్డ్. ‘డౌన్ సిండ్రోమ్’ ఉంది. తెలిసీ దత్తత తీసుకున్నాడు. డౌన్ సిండ్రోమ్ శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదగనివ్వదు. కానీ ఆదిత్య సంరక్షణలో త్వరత్వరగా ఎదుగుతున్నాడు అవ్నీష్! అవ్నీష్‌కి గుండెకు చిన్న రంధ్రం ఉండేది.
ఏ మందులూ వాడకుండానే అది భర్తీ అయింది. బలెవాడిలోని బడికి వెళ్తున్నాడు ఇప్పుడు. డాన్స్ అంటే ఇష్టం. మ్యూజిక్, ఫొటోగ్రఫీ కూడా. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఇప్పటివరకు దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటించారు. అవ్నీష్ లాంటి పిల్లలే ఉన్న 10 వేల మంది తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు ఆదిత్య. సెమినార్‌లు, వర్క్‌షాపులు, క్లాసులు.. ఎక్కడికి వెళ్లినా అవ్నీష్‌ని వెంటబెట్టుకునే వెళ్తారు ఆయన. ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపొస్తే వెళ్లి ప్రసంగించి వచ్చారు. జెనీవాలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కూడా వీళ్లు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అదీ ప్రత్యేక ఆహ్వానమే. అవ్నీష్ ఇంకా కొన్ని సర్జరీలేవో జరగాలి. వాటిని చేయించడానికి తగిన సమయం, వయసు కోసం చూస్తున్నారు ఆదిత్య.
Comments
Please login to add a commentAdd a comment