వ్యవసహాయదారుడు...
అడవిలో... రెండు దారులు చీలి ఉన్నాయి. నేను బాటసారినై, ఒక్కడినే రెండు దారుల్లో వెళ్లలేను. ఆ విచారంతో... దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగే వరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ... చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను. నేను అదే బాట పట్టాను..! రాబర్ట్‌ఫ్రాస్ట్ అనే ఆంగ్ల కవి రాసిన ‘ద రోడ్ నాట్ టేకెన్’ కవితలోని కొన్ని పంక్తులు ఇవి. ‘తక్కువమంది నడిచిన తోవను నేను ఎంచుకొన్నాను, అదే నా జీవితాన్ని మలుపు తిప్పింద’ని అంటాడు ఫ్రాస్ట్. ఏదో ఒక దారిని ఎంచుకోవాల్సిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురవుతుంటాయి. ఆ సమయంలో తక్కువగా నలిగిన దోవను ఎంచుకొనే వాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తాహెర్ సర్తల్‌వాలా.
భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట వింటూనే ఉన్నాం కానీ... మన దేశంలోని చాలా వ్యవస్థలు ఇంకా మధ్యయుగం పరిధిని దాటి రాలేదు. అలాంటి వాటిల్లో వ్యవసాయం ఒకటి. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులు ఏ మాత్రం అభివృద్ధి చెందింది లేదు. ఒకవైపు కష్టపడుతున్నా సరైన ఒడుపులేకపోవడం వల్ల గిరిజనుల కష్టం రాళ్లపాలవుతోంది. చదువుకొంటున్న సమయంలోనే దీని గురించి అవగాహన ఉంది తాహెర్‌కు.
పుట్టి పెరిగింది వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబంలోనే అయినా... తాహెర్‌కు మాత్రం గ్రామీణ ప్రాంత స్థితిగతులపై ఎనలేని ఆసక్తి. వ్యవసాయం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఇతడు ప్రస్తుతం తక్కువమంది నడుస్తున్న దారిని ఎంచుకొనేలా చేసింది. పుణే విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకొని వెళ్లిపోవడం... లేదా తనకు ఆసక్తి, ఇష్టం ఉన్న గ్రామీణ పరిస్థితుల స్థితిగతుల గురించి అధ్యయనం చేసి... రైతుల్లో అవగాహన నింపడం... ఈ రెండింటిలో ఏ దారి ఎంచుకోవాలా అని సతమతమయ్యాడట తాహెర్. ఇలాంటి తరుణంలో రాబర్ట్ ఫ్రాస్ట్‌లాగా నలగని దారిలో నడిచాడు. ఆ పయనంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకొన్న గమ్యాన్ని చేరాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు.
తాహెర్ ఈ బాటలో నడవడానికి ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా వారు సహకారం అందించారు. గ్రామీణుల గురించి, గ్రామాల్లోని పరిస్థితుల గురించి ఆలోచించే తీరిక ఉన్న భారతీయ యువత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లోని రైతులు చేసే సేద్యంపై అధ్యయనం చేయాలని సంకల్పించాడు తాహెర్. అందుకు గుజరాత్ దక్షిణ ప్రాంతంలోని మొలంబా గ్రామాన్ని ఎంచుకొన్నాడు.
ఆ గిరిజన ప్రాంతంలోని రైతులు సంప్రదాయ వ్యవసాయంతో నష్టపోతున్న తీరు అతి తక్కువ సమయంలోనే అర్థమైంది తాహెర్‌కు. వ్యవసాయ పనుల్లో భాగంగా రైతులు ప్రతి ఏటా కొండలకూ, పంట కోత తర్వాత పంటభూములకూ నిప్పుపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎండిపోయిన గడ్డితో ఉండే పంట పొలాలకు నిప్పుపెడతారు రైతులు. ఆ మంట పక్కనే ఉన్న చెట్లకు కూడా అల్లుకొంటుంది. చాలా ఎక్కువ విస్తీర్ణంలోని కొండ ప్రాంతం కాలిపోతుంది. ఇది ప్రతి ఏటా జరిగేదే! విషాదం ఏమిటంటే ఇలా చెట్టూచేమను కాల్చుకోవడం తమకు పంటకు మంచిదని అక్కడి రైతుల నమ్మకం. శతాబ్దాలుగా ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు వాళ్లు.
తాహెర్ అక్కడి రైతుల్లో ముందుగా ఈ విషయం గురించి అవగాహన నింపడానికి ప్రయత్నించాడు. వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడే ఎండుగడ్డి, ఇతర జీవావరణ నిక్షేపాలు (బయోమాస్)ను కాల్చివేయడం పంటకు తీవ్రమైన నష్టాన్ని కలగచేస్తుందని గిరిజన ప్రాంత రైతులకు వివరించాడు. కాల్చివేయడం వల్ల సారవంతమైన ఎరువు బూడిద కావడంతో పాటు మంటలు అడవికి కూడా అంటుకొని నష్టం కలిగిస్తున్న విషయాన్ని విశదీకరించాడు.
అయితే ఆ గ్రామీణుల మనసు మార్చడం, వారిలో అవగాహన పెంచడం ఒకరోజులో జరిగిన పని కాదు. కొన్ని నెలల పాటు వారిలో ఒకరిగా మెలుగుతూ ప్రతి సందర్భంలోనూ వారికి జరుగుతున్న నష్టం గురించి తెలియజెప్పి, ఊరికి వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి వారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశాడు. సాయిల్ సోలరైజేషన్ ట్రీట్‌మెంట్ (ఎస్‌ఎస్‌టీ) పేరుతో అక్కడి భూసారాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో అవగాహన కలిగించాడు.
వ్యవసాయంపై ఎనలేని ఆసక్తి ఉన్న రైతులను ఇతడి పాఠాలు ఆకట్టుకొన్నాయి. వారు తమ సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చారు. అధునాతన పద్ధతుల పట్ల ఉత్సాహం చూపారు. నాలుగేళ్ళ క్రితం మొలంబా, చుట్టుపక్కల పల్లెల్లో ఈ యువకుడు పని మొదలుపెట్టాడు. ఇప్పుడు అక్కడి వ్యవసాయకార్యక్రమాల్లో మార్పులొచ్చాయి. అక్కడి ప్రజలు తాహెర్‌ను తమవాడంటారు. తమకు కొత్త దారి చూపిన వ్యక్తిగా గౌరవిస్తారు. అన్నదాతలు ఇచ్చే ఆ గౌరవం ఏ మల్టీనేషనల్ కంపెనీ ఏసీ రూమ్‌లోనో కూర్చొని పనిచేస్తుంటే లభించేది కాదనేది అతడి భావన. ప్రపంచం ఎంత ముందడుగు వేసినా వ్యవసాయాన్ని విస్మరించకూడదనీ, ఆ రంగంలో పనిచేయడం తనకు ఆత్మసంతృప్తినిస్తోందనీ ఈ యువకుడు చెబుతాడు. గొప్ప ఆలోచనా విధానమే!
- జీవన్ రెడ్డి.బి