
ఎయిర్‌పోర్ట్ కథలు
గుట్టురట్టు
మారణాయుధాలు, మాదక ద్రవ్యాలు.. సాధారణంగా వీటి గురించి విమానాశ్రయాలలో తనిఖీలు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి తనిఖీ అధికారులకు ఇవి రెండూ కాకుండా కొన్ని ‘వింతలు-విడ్డూరాలు’ కనిపిస్తుంటాయి.
డెడ్ బాడీ: 2010లో బెర్లిన్ ఎయిర్‌పోర్టులో తల్లీకూతుళ్లను పట్టుకున్నారు. వారు వీల్ చెయిర్‌లో ఒక వ్యక్తిని తోసుకుంటూ వెళ్తున్నారు. అందులో ఓ మనిషి ఉన్నాడు. అతడికి నల్ల కళ్లజోడు ఉంది. ఆయనకి అల్జైమర్స్ వ్యాధి ఉందని, కంటి కలక కారణంగా కళ్లద్దాలు పెట్టుకున్నాడని తల్లీకూతుళ్లు చెప్పారు. అధికారులకు అనుమానం వచ్చి చూస్తే అదొక శవం అని తేలింది. మృతదేహానిక య్యే రవాణా ఖర్చులను తప్పించుకోడానికి వాళ్లిలా ప్లాన్ చేశారట!
పాము పిల్లలు: స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో విమానాశ్రయంలోని అధికారులు ఒక మహిళపై అనుమానం వచ్చి తనిఖీ చేస్తే ఆమె ధరించిన బ్రా నుంచి 75 పాము పిల్లలు బయటపడ్డాయి. అన్నీ బతికి ఉన్నవే. ఆమె మాటిమాటికీ తన ఛాతీని గీరుకుంటూ ఉండడంతో తనిఖీ అధికారులకు డౌట్ వచ్చిందట.
పుర్రె, కంకాళం: మ్యూనిచ్ ఎయిర్ పోర్టులో అధికారులు ఇద్దరు ఇటలీ వనితలను తనిఖీ చేస్తున్నప్పుడు వారి లగేజీ నుంచి ఒక పుర్రె, కంకాళం బయటపడ్డాయి! అధికారులు షాక్ తిన్నారు. బ్రెజిల్‌లో చనిపోయిన తమ కుటుంబ సభ్యుడి అస్తికలను ఆయన అభీష్టానుసారం ఇటలీలో ఖననం చేసేందుకు వెళుతున్నామని ఆ మహిళలు వివరణ ఇచ్చారు. అలాగే అతడిది సహజసిద్ధమైన మరణమని ధ్రువీకరణ పత్రం చూపడంతో వారిని వదిలిపెట్టారు.
బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్: 2002లో లాజ్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి సూట్‌కేస్ నుండి నాలుగు అరుదైన పక్షులు (బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్) బయటపడ్డాయి. అధికారులు వాటిని క్యాచ్ చేసే లోపే పైకి ఎగిరిపోయాయి. తన బట్టల్లో కొన్ని పిల్ల కోతులు కూడా ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పడంతో వాటిని బయటికి తె ప్పించి అధికారులు అతడిని జైలుకు పంపించారు.
కనుగుడ్లు: 2007లో లండన్ స్టాంస్టెడ్ ఎయిర్‌పోర్‌లో ఒక వ్యక్తి దగ్గరున్న జామ్ జార్‌లో ఐదు జతల మనిషి కనుగుడ్లు తేలుతూ ఉండడాన్ని అధికారులు గమనించారు. విమానాశ్రయాల తనిఖీ చరిత్రలో ఇంత భయంకరమైన ఘటన ఇదేనేమో!