‘వెల్‌కమ్ మై ఫ్రెండ్’ అంటూ మొదలయ్యే మూడు వాక్యాల బుల్లి కథ. దానికి తెలుగులో అర్థం. ఎదురుగా బొమ్మ. మరో పేజీలో ‘ద ఎలిఫెంట్ అండ్ ద డాగ్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్’ అంటూ ఏనుగు– కుక్క కథ. ఇవన్నీ స్కూలుకెళ్లే పిల్లల కోసం అజ్వాని కమల మేడమ్ రూపొందించిన చిన్న కథల పుస్తకాల్లోని బుజ్జి బుజ్జి కథలు. ‘ఐ కెన్ రీడ్ బై మైసెల్ఫ్’ అంటూ ఆమె చిన్న పిల్లల కోసం కథల పుస్తకాలు తయారు చేశారు. ఇందుకు తగిన కారణమే ఉంది. కారణం కన్నా ఆమె స్వీకరించిన సామాజిక బాధ్యత ఉంది.
‘‘మన దగ్గర తెలుగు మీడియంలో చదివే పిల్లలకు పదేళ్లు వచ్చేవరకు ఇంగ్లిష్‌తో పరిచయమే ఉండడం లేదు. ఐదారు తరగతుల్లో ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం, ఆ వెంటనే పాఠాలు మొదలవుతున్నాయి. బాగా చదువుతూన్న పిల్లలు కూడా ఇంగ్లిష్ భయంతో స్కూలు ఎగ్గొడతారు. నిజానికి ఇంగ్లిష్ భాష పిల్లలను బడి దొంగలుగా మార్చే మహమ్మారి కాదు. చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను పరిచయం చేస్తే పెద్దయ్యాక ఇంగ్లిష్‌ని మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరు. భూగోళంలో ఎక్కడికి వెళ్లినా మనకు తోడు ఎవరూ లేకపోయినా ఇంగ్లిష్ భాషే తోడుగా ఉండి నడిపిస్తుంది’’ అంటారు కమలా మేడమ్. మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ లేకపోవడం తో ఆమె స్వయంగా కరికులమ్ రూపొందించారు. లెవెల్–1, లెవెల్–2.. ఇలా మొత్తం 120 పుస్తకాలకు రూపమిచ్చారు. తొంభయ్ ఏళ్ల వయసులో చలాకీగా స్కూళ్లకు వెళ్లి ఆ పుస్తకాలను పిల్లలకు పంచుతున్నారు, ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు.
తెలుగింటి కోడలు
కమల 1931లో చెన్నైలో జన్మించారు. విద్యావంతుల కుటుంబం. తండ్రి అజ్వాని డాక్టర్, తల్లి చంద్రావతి. కమల ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జెట్టి దశరథరామిరెడ్డిని పెళ్లి చేసుకుని నెల్లూరును సొంతూరు చేసుకున్నారామె. ఆమెకు చదువుకోవడం, చదువు చెప్పడం ఇష్టం. ఆ ఇష్టంతోనే పెళ్లి తర్వాత ఎం.ఈ. చేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. అదే సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరాన్ని తెలియచేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె సూచనతో 1962లో ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించింది. అది ఆసియా ఖండంలోనే మహిళల కోసం స్థాపించిన తొలి పాలిటెక్నిక్ విద్యాసంస్థ. ఆ కాలేజ్‌కు ప్రిన్సిపల్‌గా కమలా మేడమ్‌నే నియమించింది ప్రభుత్వం. గుంటూరు, మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, నెల్లూరు కరికులం డెవలప్‌మెంట్ సెంటర్‌లో విధులు నిర్వర్తించారు.
తేలిగ్గా చదవాలి
ప్రభుత్వ స్కూలు పిల్లలతో కమలామేడమ్
విద్యావిధానాన్ని తేలిక పరిచిన గురువు ఆమె. సివిల్ ఇంజనీరింగ్ సిలబస్‌లో పాఠ్యాంశాలు బరువైన శాస్త్ర సాంకేతిక పదాలతో ఉండేవి. ఇంగ్లిష్ నేపథ్యం లేని విద్యార్థులకు ఏ మాత్రం కొరుకుడు పడనంత కఠినమైన పారిభాషిక పదాలుండేవి. దాంతో స్టూడెంట్స్ ఫెయిలయ్యేవాళ్లు. కొంతమంది కోర్సు సగంలో వదిలేసే వాళ్లు. ఇదంతా గమనించిన కమలామేడమ్‌కి సబ్జెక్టు సులభంగా అర్థం అయితే ఈ దుస్థితి రాదనిపించింది. తేలికైన ఇంగ్లిష్‌పదాలతో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలన్నింటినీ తిరిగి రాశారామె. అలా ఇంజనీరింగ్ వాళ్ల కోసమే పదకొండు పుస్తకాలు రాశారు. ఆమె చూపించిన దారిలోనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్‌లు కూడా కొత్త పుస్తకాలు రాసుకున్నారు. విద్యార్థుల కోసం ఆమె తీసుకున్న ఆ చొరవ ఆమెను విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్‌ని చేసింది. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి 1989లో రిటైర్ అయ్యారు కమల.
అమెరికా వెళ్లారు.. కానీ
కమలామేడమ్‌కి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ యూఎస్‌లో సెటిలయ్యారు. రిటైర్ అయిన తర్వాత భర్తతో పాటు మేడమ్ కూడా అమెరికా వెళ్లారు. ఎనిమిది మంది మనుమలు– మనుమరాళ్లతో సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఐదేళ్ల కిందట భర్త పోవడంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చేశారు. మిగిలిన జీవితం సమాజానికే అని స్థిరంగా నిశ్చయించుకున్నారు. నాలుగేళ్ల నుంచి ఆమె నెల్లూరు జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం అనే మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు. శేష జీవితం విద్యాసేవకే అంకితం అని స్వచ్ఛంగా నవ్వారు కమలా మేడమ్.
– కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్
ఇంగ్లిష్ మీడియం అత్యవసరం
ప్రస్తుతం అన్నిరంగాల్లో పోటీ పెరిగింది. ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ రాకపోవడం అనే ఒకే ఒక్క కారణంగా చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు కూడా వాళ్ల చదువుకు సంబంధం లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో మాతృభాషతో పాటు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన దార్శనికత అది. – అజ్వాని కమల, విశ్రాంత జాయింట్ డైరెక్టర్, స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు
Comments
Please login to add a commentAdd a comment