డింపుల్ చేత చెప్పిస్తేనో?!
మహిళా కమిషన్‌పై అఖిలేష్ చిన్నచూపు
మహిళల పట్ల పూర్తి ఉదాసీనంగా ఉన్న రాష్ట్రంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారం అక్కడ రోజుకు కనీసం ఐదు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతకన్నా హేయమైన విషయం ఏమిటంటే - అవన్నీ సాధారణంగా జరిగేవేననీ, అవి ఏ మాత్రం నివారించలేని ఘటనలనీ, రాష్ట్రంలోని ప్రతి మహిళకూ సాయుధ బలగాలను రక్షణగా నియమించలేం కదా అనీ అక్కడి రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా, అత్యంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం! ఇవన్నీ అలా ఉంచితే - ఆర్టీఐ చట్టం ద్వారా ఊర్వశీ శర్మ అనే ఒక సామాజిక కార్యకర్త తెలుసుకున్న వాస్తవాలను బట్టి బడ్జెట్‌లో మహిళా కమిషన్‌కు కేటాయించడానికి నిధులు లేవని కోత విధించిన ప్రభుత్వం, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సొంతానికి రెండు సెవన్ సీటర్ మెర్సిడెస్ కార్లకు, రెండు ల్యాండ్ క్రూయిజర్లకు డబ్బును వెదజల్లడం మహిళల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ తాజాగా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
2011-12, 2013-14 మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కమిషన్‌కు కేటాయింపులను 85 శాతం వరకు తగ్గించింది! 2011-12లో ప్రభుత్వం కమిషన్‌కు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక పరమైన కేటాయింపులను చేయగా, ఆ మొత్తం 2013-14 బడ్జెట్‌లోకి వచ్చేసరికి కేవలం 75 లక్షలకు పరిమితం అయింది. ‘‘దీన్ని బట్టి అఖిలేష్ ప్రభుత్వానికి మహిళల భద్రత పట్ల, సంక్షేమం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేనట్లు స్పష్టమౌతోంది’’అని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి నిజంగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే అంతంత ఖరీదైన మెర్సిడెస్‌లు, క్రూయిజర్లు కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడివని ఆమె ప్రశ్నించారు. ‘‘నిజంగానే ఇది దిగ్భ్రాంతికరమైన విషయం’’ అని మరో కార్యకర్త నీలమ్ రంజన్ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, ‘‘మహిళా సాధికారత విషయంలో సమాజ్‌వాది ప్రభుత్వం ఏనాడూ ఉదారంగా గానీ, ఉదాత్తంగా గానీ లేదు’’ అని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య (బహుజన సమాజ్ పార్టీ) కూడా అఖిలేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళల సమస్యలు ఏ మాత్రం పట్టని విధంగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. ఇలా ఉండగా, బడ్జెట్‌లో మహిళా కమిషన్‌కు కేటాయింపులను పూర్తిగా తగ్గించడం వల్ల రాజధానికి దూరంగా ఉన్న పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ వంటి ప్రాంతాల మహిళల సమస్యలను పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందని మహిళా కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
త్వరలోనే ఈ కమిషన్ సభ్యులు వెళ్ళి, అఖిలేష్ భార్య, పార్లమెంటు సభ్యురాలైన డింపుల్ యాదవ్‌ను కలిసి మహిళల సమస్యలపై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు. స్త్రీ బాధ ఇంకో స్త్రీకి మాత్రమే అర్థమౌతుందంటారు. ఆ నమ్మకంతోనే రాష్ట్రంలోని మహిళల దుఃస్థితిని డింపుల్ దృష్టికి తెచ్చే ప్రయత్నం కమిషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. డింపుల్ కనుక వెంటనే స్పందిస్తే, మహిళల విషయంలో అఖిలేష్ ధోరణి కొద్దిగానైనా మారే అవకాశాలు లేకపోలేదు.