బొట్టు, కాటుక, చీరకట్టు...ఇవీ భార్య అని కొందరు భర్తలకు అనిపించవచ్చు.ఉద్యోగం, ఐశ్వర్యం, మేధోతనం..ఇవీ భార్య అని కొందరికి అనిపించవచ్చు.కార్యదక్షత, సామర్థ్యం, సమఉజ్జీ..భార్యంటే ఇలా ఉండాలి అని కొందరు భర్తలకు అనిపించవచ్చు.సంతానం, మాతృత్వమే భార్య అనికొందరు భర్తలకు అనిపించవచ్చు.కాని భార్య అంటే కేవలం ఇడ్లీ, పూరి, వెజిటెబుల్ బిర్యానీ,చేపల పులుసు అని భర్తకు అస్తమానూ అనిపిస్తూ ఉంటేఆ భర్తకు చికిత్స చేయాలి. ఆ కాపురాన్ని రిపేరు చేయాలి.
ఆఫీసులో మేనేజర్ కేబిన్ నుంచి బయటికొచ్చి సెక్షన్ వైపు చూశాడు.అందరూ పని చేసుకుంటూ ఉన్నారు.. ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు సీట్‌లో లేడు.‘జగదీష్ ఏమయ్యాడు’ పక్క సీటతన్ని అడిగాడు.‘ఆకలిగా ఉందని క్యాంటీన్‌కి వెళ్లాడు సార్’ అన్నాడు.మేనేజర్ తలాడించి కేబిన్‌లోకి వెళ్లాడు.పదిహేను నిమిషాలు గడిచిపోయాయి.ఇంటర్‌కమ్ నొక్కి అడిగాడు ‘జగదీష్ వచ్చాడా?’‘ఇంకా రాలేదు సార్’ఐదంతస్తుల ఆ బిల్డింగ్‌లో రూఫ్‌టాప్ మీద క్యాంటిన్ పెట్టారు. థర్డ్ ఫ్లోర్ నుంచి క్యాంటిన్‌కు వెళ్లి ఏదైనా తిని రావడానికి పదిహేను నిమిషాలకు మించి పట్టదు. మేనేజర్‌కు కోపం వచ్చింది. సెల్‌లో కాంటాక్ట్ చేశాడు.‘జగదీష్ ఎక్కడ ఉన్నావు’‘ఆకలిగా ఉంటే తినడానికి వచ్చాను సార్’‘ఎక్కడ తింటున్నావు?’‘అమీర్‌పేట్ వచ్చాను సార్. ఇక్కడ కొత్తగా పెట్టిన సందర్శినిలో ఇడ్లీ బాగుంటుందనీ’... జగదీష్ నసిగాడు.మేనేజర్‌కు ఫీజు ఎగిరిపోయింది.ఆఫీస్ ఉన్నది జూబ్లీహిల్స్‌లో. అక్కడి నుంచి ఇడ్లీ తినడానికి, అది కూడా క్యాంటిన్ ఉండగా, ఆఫీస్ అవర్స్‌లో అంతదూరం వెళ్లినందుకు జగదీష్‌ని ఏం చేయాలి అని చాలా కోపం వచ్చింది.
ఎందుకంటే ఇలా చేయడం మొదటిసారి కాదు. కానే కాదు.జగదీష్ శోభనం రాత్రి అనుకున్న ముహూర్తానికి జరగనే లేదు. పెళ్లయ్యాక అత్తగారి ఇంట్లోనే ఏర్పాట్లు చేశారు. భార్య అలంకరించుకుని గదిలోకి వచ్చింది. ఆ సమయానికి జగదీష్ ముఖం గంటు పెట్టుకొని వచ్చాడు.‘ఏంటి అలా ఉన్నారు?’ కంగారుగా అడిగింది భార్య.‘మైసూర్‌పాక్ నూనె వాసన వస్తోంది. ఇలాంటి స్వీట్లా పెట్టేది’ అన్నాడు.‘పోనీలేండి. వేరేవి ఉన్నాయిగా. అవి తీసుకోండి’‘జాంగ్రీ చక్కెర తక్కువ. లడ్డూలో ఒక్క జీడిపప్పు కూడా లేదు’ఈ క్షణాల్లో ఏ భర్తకైనా ఎదురుగా ఉన్న భార్య జీడిపప్పులా కనిపించాలి. ఇతను ఇలా ఉన్నాడేమిటా అని భార్యకు నిజంగానే కంగారు వచ్చింది.‘మధ్యాహ్నం భోజనాలు కూడా గమనించాను. చాలా చెత్తగా ఉన్నాయి. వంటకు ఒంగోలు వాళ్లు వద్దు నెల్లూరు వాళ్లను పిలవండి అన్నాను. విన్లేదు. మాడిపోయిన బజ్జీలు, ముదిరిపోయిన మునగ మసాలా, పోపు తక్కువైన సాంబారు... పెరుగు ఎర్రగా ఉండాలని ముందే చెప్పాను.
పాండురోగం వచ్చినట్టుగా తెల్లగా ఏడ్చిందది’భార్యకు భయం వేసింది.‘మంచి టేస్ట్‌గా ఏదైనా తిని నిన్ను స్వీట్‌గా కిస్ చేయాలనుకున్నాను. నా మూడంతా పాడు చేశారు’ నస మొదలుపెట్టాడు.భార్య బిక్కముఖం వేసుకు కూచుంది. అతడు కోపంతో పచార్లు చేసి చేసి నిద్రపోయాడు.జగదీష్‌ని బంధువుల ఇంటికి తీసుకెళ్లడమే మానేసింది భార్య. ఆమె తరపువారు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. కొందరు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తారు. మరికొందరు బ్యాంకు ఉద్యోగులు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లక తప్పదు. అప్పుడు భార్యకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. జగదీష్ వారితో తన పని గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. రాజకీయాలు మాట్లాడడు. సినిమాల గురించి కూడా మాట్లాడడు. వంట. కేవలం వంటే.‘మొన్న కాకినాడ వెళ్లినప్పుడు సుబ్బయ్య హోటల్‌లో పనసకాయ బిర్యానీ తిన్నాను బావగారూ. బిర్యానీ అంటే అది.
అందరూ మటన్ బిర్యానీకి నాలుక వేళ్లాడేసుకుంటారు కాని తినాల్సింది పనస బిర్యానీయే’‘వైజాగెళ్లినప్పుడు అందరూ భీమిలీ రోడ్డుకెళ్లి సముద్రం చూస్తూ కూలబడతారేంటండీ నా బొంద. అక్కడ నాలుగడుగులు దాటి వెళితే చిన్నపాకలో బ్రహ్మాండమైన మెస్ ఉంటుంది. నలభైఏళ్లుగా నడుపుతున్నాడో మనిషి. ఫిష్ కర్రీ పెడతాడండీ బాబూ... ’బంధువులు ఇతని వాలకం చూసి చూసి ఇతని పేరు ‘ప్లేట్ జగదీష్’ అని పెట్టారు. రాను రాను ‘ప్లేటొచ్చాడా’ అంటే ‘జగదీష్ వచ్చాడా’ అని అర్థం.భార్యకు తల కొట్టేసినట్టయ్యింది. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. ఒక పాప. కాని జగదీష్ ఉద్యోగంలో ఏ ఎదుగుదలా లేదు. ఇంట్లో ఏ అనురాగమూ లేదు. ఆఫీసుకెళ్లాక భర్తలు భార్యలకు హాయ్ అనో, ఏం చేస్తున్నావ్ అనో, తిన్నావా అనో మెసేజ్ పెడుతుంటారు.
కొందరు లవ్ సింబల్స్ నొక్కుతారు. కాని జగదీష్ అలా కాదు.‘రాత్రికి బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి వేసి ముద్దకూర వొండు’‘ఆదివారం కాప్సికం, ఆలూ, వంకాయలు, క్యారెట్ వేసి వాంగిబాత్ చేసుకుందాం’...భర్త దృష్టిలో తాను భార్యను కానని, కాంటినెంటల్ కిచెన్‌లాంటిదని భార్యకు తెలిసి వచ్చే కొద్దీ ఆమెకు మెల్లగా డిప్రెషన్ పెరిగింది.భర్త తిండి పిచ్చికి తిండి సయించడం క్రమేపీ తగ్గిపోయింది. మరోవైపు ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటాడోనని ఆందోళన పెరిగిపోతోంది.ఒకరోజతను తెల్లారి మూడున్నరకు లేచి ప్యాంటు వేసుకుంటుంటే ‘ఎక్కడికండీ?’ అని అడిగింది.‘అబిడ్స్‌లో ఒకతను సరిగ్గా తెల్లారి నాలుగ్గంటలకు వేడి వేడి ఇడ్లీ, కొబ్బరి పచ్చడి బండి పెడతాడు. ఒకసారి తినేసొస్తా’ అని అనేసరికి ఆమె మంచం పట్టింది.
జగదీష్‌కు అతి తిండి పిచ్చి, అతి రుచి పిచ్చి హద్దులు దాటిపోయిందని జగదీష్ తల్లిదండ్రులకు కూడా అర్థమైంది. కూతురు గోడు విన్న ఆమె తల్లిదండ్రులు ‘ఇలాగైతే మీ కొడుకును తీసుకెళ్లి ఏదైనా అయ్యర్ హోటల్‌లో వంటగదిలో పడేయండి. మా అమ్మాయిని ఇంటికి తీసుకెళతాం. ఇటొచ్చాడంటే పొయ్యికట్టెను గొంతులో దూర్చుతాం’ అని వార్నింగ్ ఇచ్చారు.అందరూ కలిసి జగదీష్‌ను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి పడేసినప్పుడు సైకియాట్రిస్ట్ చెప్పిన వివరాలు విని ఆశ్చర్యపోయారు.‘ఇది డ్రగ్ ఎడిక్షన్ కంటే ప్రమాదకరమైన ఎడిక్షన్. మద్యం మాన్పించడానికి, డ్రగ్స్ మాన్పించడానికి ఎంతటి చికిత్స, కౌన్సెలింగ్ అవసరమో దీనికీ అంతే చికిత్స, కౌన్సెలింగ్ అవసరం’ అంది లేడీ సైకియాట్రిస్ట్.‘ఇది ఈటింగ్ డిజార్డర్’ అని చెప్పిందామె.‘ఇది ఉన్న వాళ్లు పని మీద ధ్యాస పెట్టరు. ఇంట్లోని విషయాల పట్ల కూడా శ్రద్ధ ఉండదు. ఎంతసేపూ తిండి ధ్యాసే ఉంటుంది. పైగా ప్రవర్తనలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
కోపం వుంటుంది. ఆహారం మీదా తినే తిండి మీదా అందరికీ ఎంతోకొంత శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. కాని ఇలా ఉన్మాదస్థాయిలో వ్యవహరిస్తుంటే కచ్చితంగా చికిత్స చేయించాల్సిందే. ఈ పిచ్చి ఉన్నవాళ్లు సరైన పచ్చిమిరపకాయ బజ్జీల కోసం రెండు వందల మైళ్లు కూడా కారు వేసుకు వెళతారు’ అందామె.జగదీష్‌కు కూడా తన పరిస్థితి కొంచెం అర్థమైంది. ఇప్పటికి మూడు మెమోలు అయ్యాయి. ఇంకో రెండు ఇస్తే ఉద్యోగం పోతుంది. భార్య పుట్టింటి బెదిరింపు కూడా పని చేసింది.‘నేను చికిత్సకు సహకరిస్తాను డాక్టర్’ అన్నాడు సైకియాట్రిస్ట్‌తో.చికిత్స మొదలైంది.మూడు నెలలు గడిచాయి.బ్రహ్మాండం బద్దలైపోలేదు కాని జగదీష్‌లోని అతి చాలా వరకు తగ్గింది.‘ఏదో ఒకటి మన క్యాంటిన్‌లోనే తిందాం బ్రదర్’ అంటున్నాడు ఆఫీస్‌లో.భార్య ఫోన్ చేసి ‘ఇవాళ వంటా’.. అని ఏదో చెప్పబోతుంటే ‘అదేం వద్దు. టికెట్లు తెస్తా. సెకండ్‌షోకు రెడీ అవ్వు’ అన్నాడు మొన్న.అమృతం అనేది తాగే పదార్థమే అయినా ఆ క్షణాన భార్యకు చెవిలో అమృతం పోసినట్టే అనిపించింది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment