మాంగల్య బలం
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా భికంపుర గ్రామానికి చెందిన విజేంద్ర ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్ 12, 2013లో భార్య లీలతో పాటు, 30 మంది ప్రయాణికులతో తాను చేసే ట్రావెల్ కంపెనీ బస్సులో చార్‌ధామ్ యాత్రకు వెళ్లాడు. కానీ, దురదృష్టం మృత్యువరదైంది. చెల్లిని కోల్పోయిన అన్న, కొడుకును కోల్పోయిన తండ్రి, తండ్రి చావు చూసిన కొడుకు... గుండె చెరువయ్యేంత విషాదం. ఈ వరదల్లో విజయేంద్ర కూడా తన భార్య లీలను కోల్పోయాడు. ఆమె కోసం వెదకని చోటు లేదు. కలవని అధికారి లేడు. మొక్కని కాలు లేదు. ఎక్కడా ఆమె జాడలేదు. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. ఏడాదిన్నర అయింది. బంధువులందరూ ఆశ వదులుకున్నారు.
ఆమె చనిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, 9 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చింది. కానీ విజేంద్రకు ఎక్కడో ఒక నమ్మకం. తన భార్య ఎక్కడో ఒక చోట బతికే ఉందని. దేవుడి దయ తన మీద ఉందని. అందుకే... ఏ రోజు అయితే తన భార్య కనిపించకుండా పోయిందో, ఆరోజు నుంచి ఉత్తరాఖండ్‌ను విడిచివెళ్లలేదు అతను. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా భార్యను వెదుక్కుంటూ వేలాది గ్రామాలకు వెళ్లాడు. కనిపించిన వారికల్లా ఆమె ఫోటోను చూపించాడు. 2015 జనవరి 27. చివరికి ఎవరో చెప్పారు.
‘‘గోంగోలి అనే ఊళ్లో ఒక అమ్మాయి మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. నీ దగ్గర ఉన్న ఫొటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది’’ అని చెప్పారు. పరుగుపరుగున ఆ ఊరికెళ్లాడు విజేంద్ర. అదృష్టం ఏమిటంటే ఆమె అతడి భార్యే! దురదృష్టమేమిటంటే... లీలా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు కూడా. అయితే ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందట. ఆమె తిరిగి మామూలు మనిషయ్యే రోజు కోసం, జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకునే రోజు కోసం ఇంటిల్లిపాది ఆశగా ఎదురుచూస్తోంది.