సెల్‌ నెంబరే కీలకం!  | Jubilee Hills theft case under investigation | Sakshi
Sakshi News home page

సెల్‌ నెంబరే కీలకం! 

Published Sun, May 14 2023 4:11 AM | Last Updated on Sun, May 14 2023 5:41 AM

Jubilee Hills theft case under investigation - Sakshi

బంజారాహిల్స్‌: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్‌ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్‌్కఫోర్స్‌ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి.

ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్‌ఫోన్‌ నెంబర్‌ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్‌ఫోన్‌ వినియోగించడంతో పోలీసులు టవర్‌డంప్‌ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్‌ నెంబర్‌ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు.  

వైన్‌ బాటిల్‌ ఖాళీ చేశాడు... 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్‌ ఎన్‌ఎస్‌ఎన్‌.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్‌ఎస్‌ఎన్‌.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్‌ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది.

కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్‌ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్‌ మెసేజ్‌ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు.

ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్‌ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్‌లో చాటింగ్‌చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు.

రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్‌లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్‌ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్‌నగర్‌లో కారు దిగి బస్టాప్‌కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్‌ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్‌ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement