కార్పొరేట్ దిగ్గజాల రె‘ఢీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కొందరు నేతలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గానికి మార్చిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. విశ్వసనీయ సమాచారం మేరకు బరిలో దిగనున్న ఇద్దరు కార్పొరేట్ విద్యాసంస్థల దిగ్గజాలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వారు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో తలమునకలై ఉండగా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు ఏ సంఘంలో ఉన్నారు, కొత్తగా చేరే ఓటర్లు ఏ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, చైతన్య విద్యాసంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఇటీవలే కేబినెట్ ర్యాంక్‌తో మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే మార్చి 15తో పూర్తి కానుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అయిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఆయన ఇప్పుడూ స్వతంత్రునిగానే బరిలో దిగుతారా లేక టీడీపీ మద్దతుతో పోటీ చేస్తారా అనేదానిపై స్పష్టత లేదు. అదే విషయాన్ని ఆదివారం ‘సాక్షి’ ఆయన వద్ద ప్రస్తావించగా బరిలో ఉండటం ఖాయమని, మిగిలిన విషయాలు త్వరలో తెలియచేస్తానని చెప్పారు.కాగా ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు (ప్రగతి కృష్ణారావు) కూడా ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నుంచి టీడీపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఒక దశలో టిక్కెట్ ఆయనకు ఖాయమైందనే ప్రచారం జరిగినా చివరికి నిరాశే మిగిలింది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఆయన విడుదల చేసిన ప్రకటన ఎమ్మెల్సీ పదవిపై ఆయన అభిలాషను చెప్పకనే చెబుతోంది.
ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కూడా చర్చించినట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు స్వతంత్ర పోరుకే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాలు బరిలో దిగడం దాదాపు ఖాయమని తేలడంతో ఇక ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయపార్టీల వ్యూహం ఎలా ఉండనుందో తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.ఒకప్పుడు శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బుకట్టలతో ప్రమేయం లేకుండా, పేరు, ప్రతిష్ట ఆధారంగా తలపడేవారు. అటువంటిది ఇప్పుడంతా డబ్బు, అధికారం చుట్టూనే తిరుగుతోంది. ఎంత తక్కువ లెక్కేసుకున్నా వ్యయం రూ.ఆరేడు కోట్లుంటుంది. ఈ నేపథ్యంలో మరో ఐదు నెలల్లో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఉపాధ్యాయ వర్గాల్లో రాజుకున్న వేడి
కాగా ఈ ఎన్నిక కోసం కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ ఈనెల 25 నుంచి డిసెంబరు 16 వరకు గడువుతో షెడ్యూల్ విడుదల చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచే వారెవరు, ఏ పార్టీ తరఫున ఎవరుంటారు, ఏ ప్రాతిపదికన ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేదానిపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభుత్వ (జిల్లా పరిషత్, మున్సిపల్) ఉపాధ్యాయులంతా ఓటర్లుగా అర్హులు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాలోని ఫొటో ఐడెంటిఫికేషన్ నంబర్‌ను శాసనమండలి ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఇందుకు ఈ నెల 10 వరకు మాత్రమే గడువుంది. ఆలోగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో నమోదు చేసుకోకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.