బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు.
రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు.
ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు.
ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓలా క్యాబ్‌లో నిందితుడు షాద్‌నగర్ బస్టాప్‌లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment