అల్సర్‌ని నివారించవచ్చు...
మహాభాగ్యం
నోటిలో వచ్చే అల్సర్లలో చాలా రకాలు అపరిశుభ్రత కారణంగా వచ్చేవే ఉంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతోపాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఏ కారణాలతో మౌత్‌అల్సర్ వచ్చినా సరే... నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్‌లను, అల్సర్ కారణంగా ఎదురయ్యే ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు. దంతాలను డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవాలి. పొగాకు వాడే అలవాటును పూర్తిగా మానేయాలి.
కాఫీ, పుల్లటి పదార్థాల వాడకాన్ని పరిమితం చేయాలి. దంతాలు వంకర ఉండడం, మొనదేలి వాడిగా ఉండడం వల్ల అవి నోటి లోపలి భాగాలకు గుచ్చుకుంటాయి. ఆ గాయాలు క్రమంగా అల్సర్‌కు దారి తీస్తుంటాయి. కాబట్టి వాటిని గుర్తించిన వెంటనే డెంటిస్టుని సంప్రదించి సరి చేయించుకోవాలి. సీలియాక్ డిసీజ్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు డైటీషియన్ సలహా మేరకు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. తరచుగా నొప్పితో కూడిన అల్సర్ వస్తున్న సందర్భాలలో దీర్ఘకాలంగా స్టిరాయిడ్స్ వాడకం, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత నీటిని నోటిని పుక్కిలించాలి. కాఫీ, టీల వంటివి తాగిన తరవాత కూడా నోటిని పుక్కిలించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మౌత్ అల్సర్లను నివారించవచ్చు.