ఎలుగెత్తిన బాధితులు... గొంతు కలిపిన ఏంజెలినా
చైతన్యం
ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ యుద్ధం జరిగినా మహిళలు, చిన్నారులే బాధితులవుతున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అరణ్యకాండ ఇది. మరి దీనికి అంతం లేదా? అంటూ బాధితులు ఆవేదనతో ప్రశ్నించారు ఆ వేదిక మీద నుంచి. ఆఫ్రికాలో దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాలు, దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో మహిళలు బాధితులు అవుతుండటం గురించి ఇటీవల లండన్‌లో ప్రత్యేక చర్చాకార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా హక్కుల ఉద్యమకారిణి నీమా నమడమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈమె కూడా కాంగో అంతర్యుద్ధంలో సామూహిక అత్యాచార బాధితురాలే.
ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనేకమంది బాధిత మహిళలు యుద్ధోన్మాదంలో తాము బలైన విధానం గురించి, తమపై జరిగిన అకృత్యాల గురించి ఏకరువు పెట్టుకోగా జోలీ చలించిపోయింది. ఇలాంటి శరణార్థుల సమస్యల విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా హోదాలో ఉన్న జోలీ వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. యుద్ధమేఘాలు ఆవరించిన దేశాల్లోని మహిళ స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
యుద్ధం ఎందుకు జరుగుతోందో కూడా తెలియని పిల్లలు బాధితులుగా మారుతుండటంపై జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధవాతావరణంలో మహిళలపై లైంగికదాడులు చాలా సహజమైపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించింది. మహిళల ఆవేదనను వ్యక్తపరిచిన ఇదే వేదికపై వాళ్ల శక్తిసామర్థ్యాలకు నిదర్శనమైన ఆవిష్కరణలను కూడా ప్రదర్శించారు. శరణార్థ శిబిరాల్లో ఉన్న మహిళలు రూపొందించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఆ మహిళలను అభినందించింది జోలీ.