
భక్తితో దేవుణ్ణి మనం ఏ రూపంలో కొలిచినా భక్తి మిగులుతుంది తప్ప రూపం మిగలదు. దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నా భక్తిది ఒకటే రూపం కనుక.
హనుమంతుడి గురించి వాల్మీకి రామాయణంలో కనిపించని కథ ఒకటి మనకు వినిపిస్తూ ఉంటుంది. బహుశా ఆ కథ, హనుమంతుడు రాసుకున్న రామాయణంలో ఉందేమో! హనుమంతుడు కూడా ఒక రామాయణం రాసుకున్నాడా.. అనే సందేహానికీ స్పష్టమైన సమాధానం దొరకదు కానీ.. ఆ కథ మాత్రం ఇది: హనుమంతుడు రామభక్తుడు. సీతారాముల సేవకుడు. ఓసారి సీతమ్మవారి నుదుటిపై సిందూరాన్ని చూసి హనుమంతుడు అడుగుతాడు.. ‘‘సీతమ్మ తల్లీ.. ఏమిటది?’’ అని. ‘‘శ్రీరామచంద్రునిపై నాకున్న ప్రేమకు, గౌరవానికి చిహ్నంగా; ఆయన దీర్ఘాయుష్షు కోసం ఈ సిందూరాన్ని అద్దుకున్నాను’’ అంటుంది సీతమ్మ. అప్పుడు హనుమంతుడు తన ఒళ్లంతా సిందూరాన్ని రాసుకుంటాడు. రాములవారిపై తనకంత ఆరాధన ఉందని వ్యక్తం చెయ్యడానికి. అది తెలిసి శ్రీరాముడు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే హనుమంతుడిని సిందూరంతో పూజిస్తారో వారి కష్టాలన్నీ తీరిపోతాయని!
ప్రతి ఊళ్లోనూ హనుమంతుడి గుడి ఉంటుంది. దాదాపుగా ప్రతిచోటా ఒళ్లంతా సిందూరం ఉన్న హనుమంతుడు కనిపిస్తాడు. అయితే ఇటీవల అకస్మాత్తుగా.. హనుమజ్జయంతికి కాషాయం అద్దుకున్న ‘యాంగ్రీ యంగ్ హనుమాన్’ దర్శనమిచ్చాడు! దేశమంతటా జయంతి ఊరేగింపులలో, కారు అద్దాల మీద, మోటార్ సైకిళ్లు, ఆటోలు, బస్సులు, గోడలు, టీ షర్టులు, వాచీలు అన్నిటి మీదా.. ఇలా రుద్రరూపం దాల్చిన హనుమంతుడే! యూత్ ఈ రూపానికి బాగా కనెక్ట్ అయింది. మునుపెన్నడూ ఇలా లేదు! అలాగని ఏ జాతీయవాదో పనిగట్టుకుని ఈ రూపాన్ని సృష్టించి, ప్రచారంలోకి తీసుకురాలేదు. కేరళలోని కుంబ్లా గ్రామంలో ఇరవై ఐదేళ్ల గ్రాఫిక్ డిజైనర్ కరణ్ ఆచార్య 2015లో తన స్నేహితుల కోసం ఈ ‘యాంగ్రీ యంగ్ హనుమాన్’ని డిజైన్ చేశాడు. వాళ్లొక కొత్త లుక్ కోసం అడిగితే ఇలా ‘యాటిట్యూడ్’ ఉన్న లుక్‌ని ఇచ్చాడు. అయితే తన హనుమంతుడికి యాటిట్యూడ్ (తనదైన ధోరణి) ఉంటుంది కానీ, అగ్రెషన్ (దుందుడుకుతనం) ఉండదనీ, పవర్‌ఫుల్‌గా ఉంటాడు కానీ, అణచివేత గుణం ఉండదని కరణ్ అంటాడు. హనుమంతుడు భక్తితో తన రాముడి కోసం ఒళ్లంతా సిందూరం రాసుకున్నట్లే.. కరణ్ తన హనుమంతుడికి కోపాన్ని కాషాయంలా అద్ది కొత్త రూపాన్ని దిద్దాడు. దీన్ని కొందరు తప్పన్నారు కానీ, భక్తితో దేవుణ్ణి మనం ఏ రూపంలో కొలిచినా భక్తి మిగులుతుంది తప్ప రూపం మిగలదు. దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నా భక్తిది ఒకటే రూపం కనుక.