ఒకప్పుడు సింహం, పులి వంటి జంతువుల చూస్తే మనుషులు దూరంగా పారిపోయేవారు. మరి ఇప్పుడో.. పరిస్థితి రివర్స్ అవుతోంది. అడవుల్లో ఉండే చాలా క్షీరదాలు మనిషి నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట సంచరానికి అలవాటు పడుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం చెబుతోంది. పులులు, సింహాలతోపాటు ఎలుగుబంట్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఆహారం కోసం వేటాడే సమయాన్ని తగ్గించుకోవడం, పరిసరాలపై మరింత ఎక్కువ నిశిత దృష్టిని పెట్టుకోవడం, మానవ సంచారమున్న ప్రాంతాలకు దూరంగా పారిపోవడం వంటి అనేక ఇతర లక్షణాలను కూడా ఇవి ఆపాదించుకుంటున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కైట్లిన్ గేనర్ అంటున్నారు.
అటవీ ప్రాంతాల్లో మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ ఈ క్షీరదాలు మనిషి ఉనికి గురించి తెలియగానే దూరంగా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై ఇప్పటికే జరిగిన 76 అధ్యయనాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని టాంజానియా సింహాలు, నేపాల్, పోలాండ్‌లలోని పులులు, కాలిఫోర్నియా ప్రాంతంలోని అడవి పందులతోపాటు దాదాపు 62 జాతులపై అధ్యయనం జరిగిందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో మానవ సంచారం ఎలా ఉంది? అదే సమయంలో ఈ జంతువుల ప్రవర్తన ఎలా ఉందన్న వివరాలు సేకరించి తాము ఈ అధ్యయనం జరిపినట్లు గేనర్ వివరించారు.
రాత్రి సంచారానికి అలవాటు పడుతున్న జంతువులు!
Published Sat, Jun 16 2018 12:04 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment