నిరంతరం నీళ్లతో నిండుగా ఉండే గుండం, అద్దంలా మెరిసే బండలు, ప్రశాంతమైన వాతావరణం. పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న దేవాలయమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. అక్కడి ఆలయాలే కాదు, ఆప్రాంతమంతా ప్రకృతి రమణీయతకు, అధ్యాత్మిక శోభకు పెట్టింది పేరు. కాకతీయు కాలంలో కట్టిన ఈ రెండంతస్థుల అపురూప రాతి కట్టడానికి ఎదురుగా తొమ్మిది అడుగుల వీరాంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి, శివుని ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు ఆనవాళ్లను బట్టి స్పష్టమవుతుంది. ఈ ఆలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాకారాల మీద ఉన్న శిల్పకళ నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటుతుంది. రామాలయంలోని సీతారాముల విగ్రహాల పాదాలకు సమాంతరంగా, ఎదురుగా వీరాంజనేయస్వామి విగ్రహం రూపుదిద్దుకోవడం చెప్పుకోదగ్గ విశేషం.
నిర్మలమైన నది... ఎండని గుండం
వీరాంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విధిగా మాండవ్య నది (ఇప్పటి మానేరు వాగు) దాటాల్సిందే. కాళ్లకు తడి తాకనిదే ఆలయంలోకి ప్రవేశించలేం. అప్పట్లో మాండవ్య మహాముని తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని వాగుకు ‘మాండవ్య నది’ అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం చుట్టూ ఈ నది ప్రవహిస్తుంది. భక్తులు ఏ దిక్కున వచ్చినా నదిలో కాలు తడవాల్సిందే. ఆలయ ఆవరణలో ఉన్న గుండం ఎప్పుడూ ఎండిపోదు. కరవు వచ్చినా, ఎన్నో సంవత్సరాలు వానలు కురవకపోయినా గుండం లో నీరు ఎండిపోదు. అందుచేత ఈ గుండంలోని జలాలను ఎంతో పవిత్రమైనవిగా స్థానికులు భావిస్తారు. ఆలయ పరిసరాల్లోని బండ రాళ్ల నుంచి ‘నీరు’ జాలు వారుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.
స్థలపురాణం ఇదీ...
సీతారాముల ఆలయంతోపాటు వేంకటేశ్వరస్వామి, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకుని రోజూ పూజలు చేసేవారు. దేవుళ్లకు ఎంతో ప్రీతితో పలు రకాల నైవేద్యాలు తీసుకెళ్లేవారు. కానీ, అక్కడ ఒక రావిచెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసి ఆ ప్రసాదాలను అపవిత్రం చేస్తుండేది. ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు కలిగిస్తుండడంతో వారు ఎంతో ఆందోళనకు గురై, ఒకరోజు రాత్రి రాముని కోవెలలో నిద్రించారు. ఆ రాత్రి వారికిఆంజనేయస్వామి కలలో ప్రత్యక్షమై ‘తాను సమీప గ్రామంలో ఉన్నానని, తనను ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని చెప్పడంతో గ్రామస్థులంతా ఎడ్లబండ్లతో ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరిపారు. ఆశ్చర్యం..! సుందరాకారం లో తొమ్మిది అడుగుల ఏకశిల వీరాంజనేయస్వామి విగ్రహం బయటపడింది. స్వామివారు కలలో చెప్పిందే కంటి ముందు సాక్షాత్కరించడంతో గ్రామస్థుల ఆనందానికి అంతులేదు. గ్రామ శివారులోకి విగ్రహం చేరుకోవడంతోటే రావిచెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసి మంటల్లో కాలిపోయిందట. బ్రహ్మరాక్షసిని హతం చేసిన వీరాంజనేయస్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్ఠించారు.
భీముని మల్లారెడ్డిపేటగా...
పూర్వం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ సంచరించినట్లుగా మల్లారెడ్డిపేట ప్రాంతానికి గుర్తింపు ఉంది. ఆ కాలంలో పాండవులు కొన్ని ఆటలు ముఖ్యంగా ‘చిర్ర గోనె’ ఆడారని ప్రచారం. ఆట ఆడుతుండగా... ఒక బండ కిందకు చిర్ర వెళ్లి పడిందట. అగ్రజుడైన ధర్మరాజు దానిని తీసుకురావాలని భీముడిని కోరాడట. భీముడు బండను నెత్తితో పైకి ఎత్తి చిర్రను తెచ్చాడట. దీనికి నిదర్శనం గా ఓ గుహ మనకు ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లనే మల్లారెడ్డిపేటను ‘భీముని మల్లారెడ్డిపేట’గా పిలుస్తారని ప్రతీతి.
ఊరంతా అంజన్నలే!
ఆంజనేయస్వామి అంటే భీముని మల్లారెడ్డిపేట ప్రజలకు ఎనలేని భక్తి. ఏ కష్టమొచ్చినా స్వామిని వేడుకుంటారు. తమ పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ అంజన్న పేర్లు పెడుతున్నారు. ఏ ఇంటికెళ్లినా అంజన్న పేరున్న వ్యక్తులు కనబడతారు. దేవుని పేరు స్ఫురించే విధంగా పేర్లు ఉన్న వారు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారు.
ఎలా వెళ్లాలంటే...
హైదరాబాద్ నుంచి వచ్చే వారు కామారెడ్డి మీదుగా 160 కిలోమీటర్లు ప్రయాణించి భీముని మల్లారెడ్డిపేటకు చేరుకోవచ్చు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి–సిరిసిల్ల మార్గంలో 32 కిలోమీటర్లు ప్రయాణిస్తే గొల్లపల్లి స్టేజీ నుంచి భీముని మల్లారెడ్డిపేట చేరుకోవచ్చు. గొల్లపల్లి నుంచి బస్‌లు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. సిద్దిపేట నుంచి వచ్చే వారు కామారెడ్డి రహదారిలో 45కిలోమీటర్లు ప్రయాణించి లింగన్నపేట నుంచి భీముని మల్లారెడ్డిపేటకు చేరుకోవచ్చు. బస్‌సౌకర్యం ఉంటుంది. ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల.
ఫొటోలు: ఎర్ర శ్రీనివాస్, గంభీరావుపేట
Comments
Please login to add a commentAdd a comment