యాదాద్రి క్షేత్రం నమూనా చిత్రం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి క్షేత్రపాలకుడిగా భారీ ఆకృతిలో భక్తులకు దర్శనమివ్వాల్సిన ఆంజనేయస్వామి విగ్రహానికి ఇబ్బంది వచ్చి పడింది. దేవాలయాన్ని భారీఎత్తున అభివృద్ధి చేస్తూ పూర్తిగా పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో క్షేత్రపాలకుడైన హనుమంతుడి భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద క్షేత్రాల్లో ఎక్కడా లేనట్టుగా ఏకంగా 108 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెరసి కొత్తరూపు సంతరించుకుని దివ్యక్షేత్రంగా వెలుగొందే మహా మందిరానికి ఈ భారీ ఆంజనేయ విగ్రహమే ప్రధానాకర్షణగా నిలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ భారీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో పునరాలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంత బరువైన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే కట్టడానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నేపథ్యంలో యాదాద్రి అభివృద్ధి సంస్థ పునరాలోచనలో పడింది.
అఖండ శిల కాకపోవటమే కారణం...
యాదగిరీశుడు గుట్టపై కొలువుదీరి ఉన్నాడు. ఇది స్వయంభూక్షేత్రంగా అనాదిగా విరాజిల్లుతోంది. విశాలమైన గుట్ట కావటంతో పైభాగంలో 14.11ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసి మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 2.33 ఎకరాలు కేవలం ప్రధానాలయానికే కేటాయించారు. మిగతా వాటిల్లో తిరుమల తరహాలో నాలుగు మాడవీధులు, బ్రహ్మోత్సవ కల్యాణ మండపం, సత్యనారాయణ స్వామి వ్రతాల మండపం, విశ్రాంతి మందిరం, యాగశాల, పుష్కరిణి, రెండు ప్రాకారాలు, హనుమదాలయం, శివాలయం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడే 108 అడుగుల ఎత్తుతో అభయాంజనేయుడి కాంస్య విగ్రహానికి స్థలాన్ని కేటాయిం చారు. అదంతా గుట్ట కావటంతో, విగ్రహానికి ప్రతిపాదించిన స్థలంలో అడుగుభాగం అఖండరాయిగా భావించారు. ఇటీవల ప్రాకార నిర్మాణానికి పునాదులు తవ్వగా అడుగున అఖండ రాయి కాదని, అది వదులుగా ఉన్న రాతి పొర లని తేలింది. దీంతో ఎక్కువ లోతుకు తవ్వి ప్రాకార నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడదే ఆందోళనకు కారణమవుతోంది.
అలాంటి రాతి పొరలపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు సరికాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి విగ్రహం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తేల్చాలని అధికారులు కోరటంతో నిపుణులు ఆ పని ప్రారంభించారు. నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, భారీ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తే అది మందిర కట్టడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రాథమికంగా వారు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టి మిగతా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు.
జూన్ నాటికి ఆలయ పైభాగం నిర్మాణం పూర్తి చేసి, దసరా నాటికి మిగతా పనులు కొలిక్కి తెచ్చి ఆ వెంటనే ప్రధాన గర్భాలయంలోకి బాలాలయంలో ఉన్న స్వామి ఉత్సవ మూర్తులను తరలించాలని నిర్ణయించారు. దసరా తర్వాత మంచి ముహూర్తం గుర్తించి ప్రధానాలయంలోనే లక్ష్మీనారసింహుడు భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొంటున్నారు. నిపుణులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొలువైన ఆంజనేయుడే భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment