
అరెస్టారెంట్..!
‘‘వడ్డించేవాడు మనవాడు కాకపోతే.. వరుసలో ముందున్నా వడపోతే’’... అనే విషయం అనుభవంలోకి వచ్చింది కేథలిన్ హ్యాంప్టన్‌కి. పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే మధ్య వయస్కురాలైన కేథలిన్... గత వాలెంటైన్స్‌డే రోజు భర్తతో కలిసి లంచ్ చేయాలనుకుని ఎన్జోస్ కెఫె ఇటాలియానో అనే రెస్టారెంట్‌లో సీట్ రిజర్వ్ చేసుకుంది. అయితే సడన్‌గా తనకు రావడం కుదరదని భర్త చెప్పడంతో ఒంటరిగానే రెస్టారెంట్‌కి వెళ్లింది. ఇద్దరి కోసం తను రిజర్వ్ చేసుకున్న టేబుల్ మీద ఒక్కతే కూచుంది. అయితే రష్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ టేబుల్‌ని ఇంకొకరితో కలిసి షేర్ చేసుకోమన్నారు రెస్టారెంట్ వాళ్లు. దీనికి ఆమె అంగీకరించలేదు. నిమిషాలు ముదిరి గంటలవుతున్నా... ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి ఆమె దగ్గరకి ఎవరూ రాలేదు.
దీంతో ఒళ్లు మండిన ఆమె రెస్టారెంట్‌లో నుంచి వెళ్లిపోబోయింది. అయితే దానికి కూడా నిర్వాహకులు చాలాసేపు ఆమెను అనుమతించలేదు. విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయిన కేథలిన్... గొడవ చేసి ఎలాగైతేనేం అక్కడి నుంచి బయటపడింది. ఈ అవమానం కారణంగా రోజుల తరబడి వలవల ఏడ్చేసిన కేథలిన్... తనకు ఇంత క్షోభ కలిగించిన వాళ్లని ఊరికే వదలకూడదనుకుంది. ‘‘విందు కోరి వస్తే ఖైదు చేస్తారా? ఆతిథ్యం అడిగితే అలుసుగా చూస్తారా’’ అంటూ సదరు రెస్టారెంట్ మీద లక్ష డాలర్ల పరిహారం కోరుతూ కోర్టు కెక్కింది.