ఆర్ట్... ఫర్ హైదరాబాద్ | Art ... For Hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్ట్... ఫర్ హైదరాబాద్

Published Thu, Sep 26 2013 12:28 AM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM

ఆర్ట్... ఫర్ హైదరాబాద్ - Sakshi

ఆర్ట్... ఫర్ హైదరాబాద్

 ‘ఫర్ హైదరాబాద్’ గేయంతో నాలుగు వందల యేళ్ల హైదరాబాద్ సంస్కృతిని చిత్రీకరించిన అధ్యయనకారుడు డాక్టర్ వి.వి.స్వామి. అంతర్జాతీయ వేదిక మీద డాక్టరేట్ అందుకున్న ఈ కళాకారుడి చిత్రాల్లో గ్రామీణ భారతం కనిపిస్తుంది. ఆ రంగులమాలిక ఇది...
 
 మీకు బొమ్మలు వేయాలన్న ఆసక్తి ఎలా మొదలైంది?


 మా తాతగారు రైతు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన మా నాన్నగారికి ఎలాగో కళాభిరుచి కలిగింది. ఆయన డ్రాయింగ్ నేర్చుకోవడానికి పడిన తపన నాకు తెలుసు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్న సైకిల్ మీద స్కూలుకెళ్లేవారు. అప్పటికి ఆయన వయసు ముప్పైకి పైనే. అలా టెన్త్ పూర్తిచేసి మద్రాసులో ఫైన్ ఆర్ట్స్ డిప్లమో కోర్సు చేశారు. డ్రాయింగ్ టీచర్ అయ్యారు. ఇంటి దగ్గర 15-20 మంది పిల్లలు నాన్న దగ్గర బొమ్మలేయడం నేర్చుకుంటూ ఉండేవాళ్లు.
 
 నాన్నగారి ప్రోత్సాహంతోనే ఆర్టిస్ట్ అయ్యారా?


 మేము ఎనిమిది మంది పిల్లలం. నాకే కాదు ఆయన ఎవరికీ చిత్రలేఖనం నేర్పించలేదు. ముగ్గురం మాత్రం ఆయన ప్రమేయం లేకుండానే బ్రష్ పట్టుకున్నాం. కానీ ఈ కళను కొనసాగించింది నేనొక్కడినే.
 
 నాన్నగారు ఎందుకు నేర్పించలేదు?


 దీని మీద ఆధారపడితే జీవనం కష్టమని ఆయనకు గట్టి నమ్మకం.
   
 మరి బొమ్మలు వేయడం ఎలా అలవాటైంది?


 సాయంత్రాలు నేను పుస్తకం పట్టుకుని కూర్చునేవాడినే కానీ ఒక చెవి అటు ఒగ్గి మా నాన్న చెప్పే డ్రాయింగ్ పాఠాలు వింటుండే వాడిని. ఇంట్లో అంతా నిద్రపోయిన తర్వాత లేచి బొమ్మలేసేవాడిని. అలా రాత్రి మూడు వరకు వేసిన రోజులున్నాయి. తొలిబొమ్మను 1962లో బయటపెట్టాను, 65లో గుంటూరులో ప్రదర్శన పెట్టాను.
 
  మీరు వేసే బొమ్మలకు ప్రధానంగా ఏ రంగును ఉపయోగిస్తారు?


 నేను ఒక రంగుకు పరిమితం కాలేదు, కానీ ప్రైమరీ కలర్స్‌ని మాత్రమే ఉపయోగిస్తాను. చిత్రంలో భావప్రకటన ప్రధానం, అది పెన్సిల్ డ్రాయింగా, అక్రిలిక్ పెయింటింగా... అనేది ముఖ్యం కాదు. అలాగే ప్రతి చిత్రకారుడూ తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మంచిదే కానీ ఆ స్టైల్... మనం వేయాలనుకున్న చిత్రలేఖనంలో కాన్సెప్ట్‌కి పరిధులు విధించకూడదు. రంగుల వాడకాన్ని టాపిక్ నిర్ణయించాలి తప్ప మన శైలి కాదు.
 
  చిత్రాల ఇతివృత్తం ఎలా?


 నా చిత్రాలు ఎక్కువగా నేచర్ ఆధారంగా ఉంటాయి. ఒక సబ్జెక్టు అనుకున్న తర్వాత దాని మీద మూడు- నాలుగు నెలలు స్టడీ చేసేవాడిని. ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించి కానీ బొమ్మ వేయను. గణపతి బొమ్మల వేయడానికి ముందు చేసిన అధ్యయనం ద్వారా 64 మూర్తుల వివరాలు తెలిశాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో గణపతి వర్ణన ఉంటుంది. ఆ వర్ణన ఆధారంగా బొమ్మవేయాలి.
 
 పెయింటింగ్స్‌ని ఆదరించడంలో ఇండియాకీ విదేశాలకీ తేడా?


 నా పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ల కోసం దాదాపుగా ఇండియా అంతా తిరిగాను. చిత్రకారులు బొమ్మవేయగలరే కానీ దానిని కొనమని ఎవరినీ అడగలేరు. మార్కెటింగ్‌కి మరొక నిపుణుల మీద ఆధారపడాల్సిందే. గ్యాలరీలు ఆ పని చేసి కమిషన్ తీసుకుంటాయి. అమెరికాలో గ్యాలరీలు 50శాతం, ఇండియాలో 30శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. అలాంటి మార్కెట్ కూడా ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాలకే పరిమితం. హైదరాబాద్‌లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. మనదగ్గర పెయింటింగ్‌ని డెకరేటివ్ పీస్‌గా కొనేవాళ్లే ఎక్కువ. గత కొన్నేళ్లుగా ముంబయిలో పెయింటింగ్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కొనే ధోరణి ఎక్కువవుతోంది. ఆ బొమ్మ వేసిన ఆర్టిస్ట్ భవిష్యత్తులో ఎంఎఫ్ హుస్సేన్‌లాంటి పేరుప్రఖ్యాతులు సంపాదిస్తే... ఇప్పుడు వేలల్లో కొన్న చిత్రం ధర అప్పుడు లక్షలకు చేరుతుంది.
 
 చిత్రకళ మీద ఆరాధన ఉన్నా అంత ధర పెట్టలేని వారి పరిస్థితి?


 ఒరిజినల్ పెయింటింగ్‌ని ప్రింట్ వేసి అమ్మే సంస్కృతి విదేశాల్లో ఉంది. ఇండియాలో ప్రింట్ అమ్మడాన్ని అహ్మదాబాద్‌లో చూశాను.
 
  డాక్టరేట్ ఏ చిత్రానికి అందుకున్నారు?


 పెయింటింగ్‌కి కాదు, రచనకి వచ్చింది. 1990లో హైదరాబాద్ 400 ఏళ్ల వేడుకల సందర్భంగా ‘ఫర్ హైదరాబాద్’ అనే ఎనభై పేజీల ఇంగ్లిష్ పోయెమ్ రాశాను. దానికి మూడేళ్లు హోమ్‌వర్క్ చేశాను. నటరాజ రామకృష్ణ వంటి ప్రముఖులను కలిశాను, నోట్స్ కోసం సాలార్‌జంగ్ మ్యూజియం, సియాసత్ పేపర్ లైబ్రరీలో గంటలకు గంటలు గడిపాను. ‘హిస్టారికల్ అండ్ కల్చరల్ హైదరాబాద్’ అంశం మీద మూడు ప్రాజెక్టులు చేశాను. అందులో ఈ పుస్తకం ఒకటి, మిగిలినవి రెండూ చిత్రకళా ప్రదర్శనలు. 2001లో సిడ్నీలో నిర్వహించిన ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్’ సమావేశంలో డాక్టరేట్ ప్రదానం చేశారు.
 
  హైదరాబాద్ మీద వేసిన చిత్రాల గురించి చెబుతారా?


 అందులో రెండు భాగాలున్నాయి, ఒకటి పురాతన హైదరాబాద్. రాజరిక వ్యవస్థ, అప్పటి ప్రజల జీవనశైలికి ప్రతిబింబాలు. మరొకటి సమకాలీన హైదరాబాద్‌ను ప్రతిబింబించే చిత్రాలు.
 
 యువ చిత్రకారులకు ఏదైనా సూచన..!


 పెయింటింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక చిత్రంతోనే పేరు ప్రఖ్యాతులను కోరుకోకూడదు. ఒక పెయింటింగ్‌ని ఐదారు రోజుల్లో వేస్తాం. రెండు రోజుల తర్వాత పరికించి చూస్తే ఏదో లోపం ఉన్నట్లు, మరికొంత మెరుగులు దిద్దితే బావుణ్ననిపిస్తుంది. అలా సొంతంగా విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవాలి. యువ చిత్రకారుల కంటే కూడా చిన్న పిల్లల తల్లిదండ్రులకు తెలియాల్సిన విషయం ఒకటుంది. ఏ లలిత కళ అయినా ఒంటబట్టాలంటే స్వతహాగా కొంత జ్ఞానం, దార్శనికత ఉండాలి. దానిలో మెళకువలను నేర్పించడం వరకే బోధకుల పాత్ర. నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినట్లు చిత్రకారులను తయారు చేయలేం. డ్రాయింగ్ క్లాసులకు పంపించిన రోజు నుంచి పిల్లలు గొప్ప చిత్రకారులైపోవాలని ఆత్రుత పడకూడదు.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 చిత్రకారుడి గురించి...
 పేరు: డాక్టర్ వి.వి. స్వామి(వల్లూరి వెంకటస్వామి)
 పుట్టింది: గుంటూరు జిల్లా వేమవరం.
 చదివింది: ఎం.ఎ పొలిటికల్ సైన్స్, జర్నలిజంలో పి.జి డిప్లమో, పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్‌లో డిప్లమో, పెయింటింగ్‌లో హయ్యర్ గ్రేడ్.
 ఇప్పటి వరకు వేసిన చిత్రాలు 2,500
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement