అద్దెకొంప | Article By Kodavatiganti Kutumbarao Funday | Sakshi
Sakshi News home page

అద్దెకొంప

Published Sun, Sep 15 2019 4:14 AM | Last Updated on Sun, Sep 15 2019 4:51 AM

Article By Kodavatiganti Kutumbarao Funday - Sakshi

యుద్ధం మూలంగా ప్రజల మనస్తత్వంలో కలిగిన మార్పు ప్రత్యక్షంగా చూడటం అతనికిదే మొదటిసారి. కాని చేసేదేమీ కనిపించలేదు. ఇంకో ఇంటికోసం వెతుకుదామంటే ఆదివారం తప్ప తీరదు. కాకపోయినా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే వాళ్ళకే ఇళ్ళు దొరక్కుండా ఉన్నాయి.

మా శారదాంబ మొగుడు శివకామయ్య యోగ్యుడే కాని వాడి కుటుంబంలో వాడితో పోల్చదగిన మనిషి లేడు. శివకామయ్య తండ్రి వొట్టి దద్దమ్మ. పెళ్ళాం ఎంత చెపితే అంతా. వాళ్ళ వూళ్ళో పార్వతీశంగారిల్లంటే ఎవరూ చెప్పరు. కామాక్షమ్మగారిల్లంటేనే ఎవరికన్నా తెలుస్తుంది. అంతే కాదు కానూరి కామాక్షమ్మ అని ఆవిడనెవ్వరూ పిలవరు. కూనపల్లి కామాక్షమ్మ అనే పిలుస్తారు. కూనపల్లివారి ఆడబడుచు. ఏడుగురు పిల్లలతల్లి. అయినా ఈనాటికీ ఆవిడ కన్నవారింటనే ఉంటున్నది. ఎరగనివాళ్ళు పార్వతీశం ఇల్లరికమని కూడా అనుకోవడం కద్దు. కాని నిజం ఏమంటే కామాక్షమ్మ తండ్రిగారి కాపరం ఏనాడో చితికిపోయింది. జప్తు చేసిన తండ్రి ఆస్తిని కామాక్షమ్మ మొగుడు చేతనే కొనిపించింది. అందుకోసం పార్వతీశం అప్పు చెయ్యవలసి వచ్చింది.

మామగారి కొంప వ్యవహారరీత్యా తనదే అయినా, పార్వతీశంగారు దాన్ని మామగారి ఇల్లల్లేనే చూశాడు. తనకన్న మామగారి వాళ్ళకే ఆ ఇంటి మీద అధికారం ఎక్కువగా ఉన్నట్లు భావించాడు. అతని తరఫున బంధువులు ఎవరు వచ్చినా వాళ్ళకా ఇల్లు పార్వతీశం మామగారిదే– కాకపోతే, కూనపల్లి కామాక్షమ్మ గారిదే అనిపించేదేగాని, పార్వతీశంగారిదనిపించేది కాదు.కామాక్షమ్మ తల్లిదండ్రులు, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ కూడా ఆ ఇంటిని స్వగృహంలాగే చూసుకునేవాళ్ళు. కామాక్షమ్మ నోరు చెడ్డది. ఆమె హృదయం చాలా మంచిదని చెబుతారుగాని, దాని గురించి సాక్ష్యం దొరికేది కాదు. ఎప్పుడన్నా తనకిష్టమైనవారికి మొగుడి సొత్తు పంచితే పంచేదేమో మనమెందుకు కాదనాలి?కాని మొత్తం మీద ఒకటి నిజం. పార్వతీశంలాంటి నోరువాయి లేనివాడిలో వెయ్యి మంచి గుణాలున్నా గమనించేవాళ్ళుండరు. కామాక్షమ్మలాంటి వారిలో ఏమాత్రం మంచి ఉన్నా వెంటనే ప్రచారం అవుతుంది.

ఆవిడ కోడళ్ళను కోసుకు తినేది. 
ఆ మాటంటే ‘‘కోడళ్ళకావిడ ఇచ్చే శిక్షణ తల్లులు కూతుళ్లకు కూడా ఇవ్వరు!’’ అనేవాళ్ళు.నిజానికి కామాక్షమ్మ పెద్దకోడలు అమిత దురుసుపిల్ల. వాళ్ళ పుట్టింటి వాళ్ళు, ‘ఇది కాపరం ఏం చేస్తుంది? ఏ మొగుడు దీనితో వేగుతాడు?’ అనుకునేవాళ్లు. అటువంటి రాక్షసపిల్ల కామాక్షమ్మ ఇంట అడుగు పెట్టిన ఆరు నెలల్లోపల పిల్లి అయిపోయింది,అగ్నికి వాయువు తోడైనట్లు కామాక్షమ్మగారికి తోడుగా ఉండేది విధవ అప్పగారు. ఆ ఇద్దరి మధ్య నలిగిపోతూండేవాళ్ళు ఇంటికోడళ్ళు. ఇంటి కొడుకులకు తల్లిని చూస్తే చెడ్డ భయం. పెళ్ళాలతో మాట్లాడాలన్నా వాళ్లు తల్లి అనుమతి పొందవలసిందే. ఇంట్లో ఉన్న పదిమందీ ఒక్క మనిషి మాట మీద పోవడం వల్ల పైకి కాపరం చాలా గుంభనంగా కనిపించేది.కాని లోపల ఏ ఒక్కరికీ సుఖం ఉండేది కాదని నా అనుమానం. కామాక్ష్మగారి పెత్తనానికి ఎదురుతిరిగిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. అందులో మొదటిది మా శివకామయ్య చెల్లెలు కృష్ణవేణి. అంటే మా శారదాంబ మూడో ఆడపడుచు. ఆవిడ మొగుడి దగ్గరికి వెళ్ళినాక తిరిగి పుట్టింటి గడప తొక్కలేదు. ఈ విధంగా ఇల్లు వదిలిపెట్టిపోయిన మరో కుర్రవాడు శివకామయ్య. తరువాత వాడు సుందరం.ఇందతా ఎందుకు చెప్పానంటే మా శారదాంబను అటువంటి ఇంట్లో ఇచ్చాం. కామాక్ష్మగారు కోడళ్ళను కాల్చుకు తినటంలో మొరటు పద్ధతులు లేవు. కొట్టటమూ, తిట్టటమూ, వాతలు వెయ్యటమూ, అన్నం పెట్టక మాడ్చి చంపటమూ మొదలైనవీ లేవు. అందుచేత ఆవిణ్ని గురించి నలుగురూ అనుకోవడం కూడా జరగలేదు.

మా శారదాంబలాగా ఆత్మాభిమానంతో పెరిగిన పిల్లకి తిట్లకన్నా, దెబ్బలన్నా ఒక మాట భరించటం చాలా కష్టం. తొందరపడి దాని మీద నేరం మోపితేనే సహించని మనిషి కామాక్షమ్మగారి కవాతుకు ఎట్లా లొంగుతుంది. శారదాంబ ఎప్పుడూ నోరు చేసుకునే రకం కూడా కాదు. భరించలేని పరిస్థితి అని తోస్తే ఏదో ఆఘాయిత్యం చేసేస్తుంది.అందుచేత శివకామయ్యకు పట్నంలో ఉద్యోగం దొరికిందంటే చాలా సంతోషించాను. ఎందుచేతనంటే మొదటనే చెప్పినట్టు అతను చాలా యోగ్యుడు. మా శారదాంబక్కూడా అతనంటే చాలా సదాభిప్రాయమే ఉంది. కాని అతను ఇంటి దగ్గర ఉన్నంత కాలమూ మా శారదాంబకు సుఖం లేకపోయింది. ఈ ఉద్యోగం దొరకడం అతని ప్రాణానికీ, దాని ప్రాణాలకూ కూడా ఎంతో సుఖమిచ్చింది.అవి యుద్ధం రోజులు. శివకామయ్యకు దొరికిన ఉద్యోగం కూడా తత్సంబంధమైనదే, అయితే ఏ మొచ్చిందంటే అతను మా శారదాంబను వెంటబెట్టుకొని పట్నంలో కాపరం పెట్టాడో లేదో ఇంతలోనే మద్రాస్‌కు విమానదాడి భయం జాస్తి అయి, అక్కడి నుంచి మన తెలుగువాళ్ళు సకుటుంబంగా స్వగ్రామాలకు పారిపోయి రాసాగారు.

ఏమాటకామాటే చెప్పాలి. మన శివకామయ్య భయం లేదని చెబుతూనే ఉన్నాడు. కాని మేం– అంటే మా వాళ్లంతా శారదాంబను గురించి భయపడసాగాం. శివకామయ్య ఉద్యోగం వదిలి రాలేదు. శారదాంబకున్నపాటి ప్రాణభయం అతనికీ ఉంది. కాని మేం తన్ని గురించి అట్టే విచారించలేదు. మా పిల్లను గురించే భయపడ్డాం. శారదాంబను పంపితేగాని వీలులేదని పట్టుబడితే, మా మాట తీసివెయ్యలేక అతను శారదాంబను మా ఇంటికి పంపేశాడు.అయితే ఏమయిందంటే, శారదాంబ వచ్చిన కొద్ది కాలానికే ఆ విషయం కూడా రూఢి అయింది. ఆ సంగతి తెలియగానే దాని అత్తగారు దాన్ని తమ ఇంటికు తీసుకువెళ్ళి అయిదో నెలలో పంపిస్తామన్నారు. సరే రెండు నెలలు అత్తవారింట గడిపి మా శారదాంబ పురిటికి తిరిగి మా ఇంటికి వచ్చేసింది. దానికి ఇక పురుడొచ్చి పిల్లవాడు పుట్టి, వాడికో మూడు నెలలు గడిచేసరికి అక్కడ పట్నంలో పరిస్థితులు మారిపోయినై. పట్నం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి రాసాగారు. పట్నంలో ఇళ్ళన్నీ గబగబా అయిపోతున్నాయి.

ఇంటివాళ్ళు బతిమాలగా, బతిమాలగా మా శివకామయ్య తాత్కాలికంగా తన భాగంలో నుంచి రెండు గదులు ఇంటివాళ్ళకిచ్చేసి తను సామానుతో సహా ఒక్క గదిలో చేరాడు. ఇంటివాళ్ళు శివకామయ్యను ఎంతో మర్యాదగా చూసేవాళ్లు, కారణమేమంటే ఆరునెల్లపాటు ఇల్లంతాకీ శివకామయ్య ఒక్కడే వుండి ఇంటిని కాపాడాడు. నాలుగు మాసాల అద్దె అతని దగ్గర వాళ్ళు తీసుకోలేదు కూడాను. అటువంటి పరిస్థితిలో వాళ్ళు రెండు గదులివ్వమంటే శివకామయ్య కాదనలేకపోయాడు. అదీకాక వాళ్లు మాట కూడా ఇచ్చారు.

మా శారదాంబ రాగానే నూరారయినా, ఆరు నూరయినా ఆ రెండు గదులూ తిరిగి ఇప్పించేస్తామన్నారు. సగం ఆ ధైర్యంతోటే శివకామయ్య గదులు ఖాళీ చేశాడు.పిల్లవాడికి మూడోనెల అనగా శారదాంబ అత్తవారు తీసుకువెళ్ళారు. మళ్ళీ పట్నం వెళ్ళితే ఎప్పటికో! వాళ్ళకు మాత్రం పిల్లవాడి ముద్దుముచ్చట్లు చూచుకోవాలని ఉండదూ?శారదాంబ అత్తవారింట రెండు నెలలుండి పట్నం వెళ్ళటానికి ఏర్పాటయింది. ఫలాని తేదికి తనకు రెండు గదులూ తిరిగి కావాలని ఇంటివారితో చెప్పాడు శివకామయ్య. దానికేం భాగ్యమన్నారు ఇంటివారు. శారదాంబ ఇంకో వారానికి బయలుదేరుతుందనగా శివకామయ్య మళ్లీ ఇంటివారిని హెచ్చరించాడు.

ఆ గదిలో మరెవ్వరో ఉంటున్నారు. వారు ఈలోపుగానే మరో ఇల్లు చూచుకుని వెళ్ళిపోతున్నారని ఇంటాయన చెప్పడంతో బయలుదేరవద్దని శారదాంబకు తంతి ఇచ్చాడు శివకామయ్య.‘‘నా దగ్గర మూడు గదులకూ అద్దె పుచ్చుకుంటూ ఇదేంపని?’’ అని ఇల్లుగలవాళ్ళని అడిగాడు.దానికి ఇంటివాళ్ళు ‘‘ఈరోజుల్లో పదిహేను రూపాయలకు మూడు గదులెట్లా వస్తాయి? నీ రెండు గదులకూ కలిసి పాతిక రూపాయలు చెవులు మెలేసి పుచ్చుకుంటున్నాము’’ అని సమాధానం చెప్పారు.ఇంటివాళ్ళ డబ్బు దాహమూ, దగా బుద్ధీ చూస్తే మా శివకామయ్యకు ఆశ్చర్యం వేసింది.

యుద్ధం మూలంగా ప్రజల మనస్తత్వంలో కలిగిన మార్పు ప్రత్యక్షంగా చూడటం అతనికిదే మొదటిసారి. కాని చేసేదేమీ కనిపించలేదు. ఇంకో ఇంటికోసం వెతుకుదామంటే ఆదివారం తప్ప తీరదు. కాకపోయినా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే వాళ్ళకే ఇళ్ళు దొరక్కుండా ఉన్నాయి. దొరికేవాళ్లకు దొరుకుతున్నాయనుకోండి. వందలకొద్దీ లంచాలు పెట్టాలి. లేదా ఇచ్చే బాడుగలో సహానికే రశీదు తీసుకోటానికి ఒప్పుకోవాలి. అదీకాకపోతే రెండు సంవత్సరాల అద్దె– అంటే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో ఏ అయిదోవంతో ఆరోవంతో ముందుగా దర్శించుకోవాలి. ఈ పరిస్థితుల్లో మా శారదాంబ అత్తవారింట్లోనే ఉండిపోవలసి వచ్చింది. అక్కడే వచ్చింది చిక్కు. మా శారదాంబ అత్తగారు తన పద్ధతులు మార్చుకోలేదు. ఆ పద్ధతులకు మా చెల్లెలు అలవాటుపడుతుందా అంటే, అదీ కనిపించలేదు. దాని దగ్గర్నుంచి నాకు వారానికో ఉత్తరం రాసాగింది. ప్రతి ఉత్తరంలోనూ చివరికి ఒకటే ముక్క:

‘నేనిక్కడ ఒక్కక్షణం ఉండలేను. ఎవరికీ చెప్పకుండా బయల్దేరి వచ్చేస్తాను’కాని అవతల పట్నంలో తన మొగుడికి కొంపలేదాయె. మా ఇంటికి తీసుకోకపోతే బాగుండదాయె. దాని అత్తగారింటో, అందరి అభిప్రాయమూ ఏమంటే ఇవ్వాళో, రేపో శివకామయ్య ఇల్లు సంపాదిస్తాడని, అటువంటప్పుడు మా శారదాంబను మేం తీసుకుపోతామంటే ఏం బాగుంటుంది?

ఒకసారి ఏదో వంక పెట్టుకొని కామాక్ష్మగారి ఇంటికి వెళ్లాను. వీలు చేసుకుని మా శారదాంబతో మాట్లాడి చూశాను. ఎవరెవరి మీదో పెట్టి తనను నానా మాటలు అంటారంటుంది. ఇందులో మా శారదాంబ అనుకోవటం ఎంతో, నిజం ఎంతో నాకయితే తెలీదుగాని, శారదాంబ బాధపడుతున్నదనడంలో అతిశయోక్తి ఏమిలేదు.అందుచేత శివకామయ్యకు ఉత్తరం వ్రాస్తూ శారదాంబ పరిస్థితి గురించి అది రాసుకోలేని వివరాలన్నీ రాశాను. తన వాళ్ళను గురించి రాశానని అతను అనుకునేవాడు కాదులెండి.నా  ఉత్తరం అందిన కొద్దిరోజుల్లోనే శివకామయ్య ఒక అఘాయిత్యం చేశాడు. తన భాగంలో ఉండవలసిన గదులు ఇంటాయన అవసరానికి తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని రెంటు కంట్రోలర్‌ దగ్గర ఫిర్యాదు చేశాడు.రెంటు కంట్రోలరు ధర్మాత్ముడు. ఇంటాయన చెప్పిన అబద్ధాలన్ని నమ్మక శివకామయ్యదే న్యాయమని గుర్తించాడు. అయితే ఇంటాయన ఇంకో పేచీ పెట్టాడు.

సంవత్సరంన్నర క్రితం నాలుగు నెల్లపాటు శివకామయ్య అద్దె ఇవ్వలేదనీ అందుచేత అతన్ని ఖాళీ చేయించమనీ అర్జీ పెట్టుకున్నాడు. న్యాయానికి శివకామయ్య దగ్గర నాలుగు నెలల ఆ రశీదులు లేవు. దానికి కారణం ఇంటాయన అప్పట్లో అద్దె తీసుకోనన్నాడు. ఆనాడు కృతజ్ఞతాపూర్వకంగా చేసిన పని ఈనాడు స్వార్థానికి అక్కరకు వచ్చింది. అయినా శివకామయ్యే గెలిచాడు. ఆ పాత బాకీ ఆరునెలల మీద తీర్చేటట్టు శివకామయ్యకు అవకాశం ఇచ్చి రెంటు కంట్రోలర్‌ శివకామయ్యకు రెండు గదులూ ఇప్పించాడు. రెంటు కంట్రోలరు ధర్మమా అంటూ మా శారదాంబ పట్నం వచ్చేసింది.
నేను పట్నం వచ్చి వారం రోజులయింది. ఈవారం రోజుల నుంచి చాలా విచిత్రమైన కథ నడవడం చూస్తున్నాను.

ప్రతిరోజూ ముప్పూటలా ఇంటావిడ వంటింట్లోంచి నానా అవాచ్యాలూ మాట్లాడుతుంది. అవి శాపనార్థాలు కాదు. అవి రంకెలు కావు! ఆవిడ అనే మాటల్లో కాస్త సౌమ్యమయినవి ఏమిటంటే, ‘వీళ్లకి సిగ్గన్నా లేదేం? మా ఇంట్లోంచి పొండర్రా అంటే పోయిచావరేం? మా కొంప తప్పితే వీళ్ళకి నిలవనీడే లేదేమో! అయితే చెట్టుకింద పడుకోరాదూ? సిగ్గులా! ఛీ...వీళ్ళ మొహలు తగలెయ్యా. కోర్టుకు పోతారట. వీళ్ళ పిండాలు పిల్లులకెయ్యా!’’ ఈ ధోరణిలో.

మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో గౌరవంగా బ్రతికే ఆడకూతురు నోట ఇటువంటి మాటలు రావటం నాకాశ్చర్యం వేసింది.‘ఎవర్ని ఆ తిట్లు తిట్టుతున్నది?’ అని మా శారదాంబ నడిగాను! శారదాంబ నవ్వి ‘ఇంకెవర్ని? మమ్మల్నే! చావనీ గింజుకోని! మేం ఇల్లు ఖాళీ చేస్తే ఈ భాగాన్నే నలభై రూపాయలకి ఎవరికన్నా ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. డబ్బు దాహం నోటంట అట్లా పలుకుతున్నది. ఇదేం చూశావూ? దొడ్లో పొరపాటున చంచా వదిలేసినా, ఎత్తుకుపోతారు.వాళ్ళకు పనికిరానిదైతే విరగగొడతారు. కొళాయిగొట్టం చిల్లి పొడిచి మా పక్క సందంతా నీళ్ళ ప్రవాహం చేశారు. అలగా కుర్రవాళ్ళకు కానీ అర్ధణా చేతిలో పెట్టి మా కిటికీ ముందు నుంచి బండబూతులు అనిపిస్తారు!’ అన్నది.
 
ఇదంతా ఎలా భరిస్తున్నావని మా శారదాంబను నేనడుగలేదు. ఎలా భరిస్తున్నదో, శారదాంబ ఎంతవరకు మారినదో నే అర్థం చేసుకోగలిగాను. మా శారదాంబ అత్తవారింట్లో అమలులో వున్నది క్షీణించి పోతున్న సంస్కృతికి చెందిన వికృత ఆచారం. కనుకనే శారదాంబ దాన్ని అతిక్రమించి అసహనం ప్రకటించగలిగింది.

ఇక్కడ ఈ మద్రాసులో అద్దె ఇంటి సమస్య అటువంటి కాదు. దీని మూలకందమేమిటో, ఎలా దీన్ని ఎదుర్కోవాలో మా శారదాంబకు తెలియదు. తెలియలేదు. అందుచేతనే దీన్ని సులభంగా భరించగలిగింది. ఏ ఇబ్బంది అయినా తప్పనిసరి కాదనీ, పరిష్కారమవుతుందనీ స్పష్టంగా తెలిసే వరకూ మనం తిరుగుబాటు చెయ్యలేము గద!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement