
తలనొప్పితోపాటు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే ఆస్ప్రిన్ కొన్ని రకాల కేన్సర్ల చికిత్సకూ ఉపయోగపడుతుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు. ఇప్పటి జరిగిన దాదాపు 71 అధ్యయనాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని ఇందులో భాగంగా ఆస్ప్రిన్ తీసుకునే 12 లక్షల మందిని, తీసుకోని నాలుగు లక్షల మందిలో ఎవరు ఎక్కువ కాలం జీవించాలో పరిశీలించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త పీటల్ ఎల్‌వుడ్ తెలిపారు. కార్డిఫ్ యూనివర్శిటీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంచనా ప్రకారం.. కేన్సర్ వ్యాధి సోకినప్పటికీ ఆస్ప్రిన్ తీసుకునే వారు దాదాపు 30 శాతం మంది ఎక్కువ కాలం జీవిస్తారు.
అతి తక్కువ పరిమాణంలో ఆస్ప్రిన్ తీసుకోవడం గుండెజబ్బులను నివారిస్తుందని, గుండెపోటు, కేన్సర్ల నివారణకూ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలుసు. అయితే కేన్సర్ విషయంలో ఇది అదనపు చికిత్సగానూ ఉపయోగపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పేవు, కడుపు, రొమ్ము, ప్రొస్టేట్ కేన్సర్ల విషయంలో జరిగిన పలు అధ్యయనాలు ఆస్ప్రిన్ ప్రయోజనాల గురించి తెలిపాయని చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఈ పరిశీలనలను ధ్రుపరచుకోవాల్సి ఉందని, ఆ తరువాతే ఆస్ప్రిన్‌ను కేన్సర్‌కు ఓ మందుగా వైద్యులు పరిగణించేందుకు అవకాశముందని వివరించారు.