
మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు! (అమ్మ అనే మాట ఒక క్రియ. నువ్వేం చేశావో అదే నువ్వు. నువ్వెవరివో అది కాదు నువ్వు). కొంచెం ఫిలాసఫీ, కొంచెం అంతర్లీనత కలిసి ఉన్న ఈ వాక్యం ఈ నెల 10న అసోం పోలీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రత్యక్షమైంది! సాధారణంగా అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఫిలాసఫీ, ఫిలాసఫీకి పోలీస్ డిపార్ట్‌మెంట్.. ఒకదానికొకటి సరిపడనివి. వాక్యంలో అంతర్లీనత కూడా కలిసి ఉందంటే.. డిపార్ట్‌మెంట్‌లో ఎవరో బాగా చదువరులైన వాళ్లు ఉండి ఉండాలి. ఆ చదువరులు అమెరికన్ రచయిత్రి చెరిల్ లేసీ డొనోవాన్ 2009లో రాసిన పుస్తకం ‘ది మినిస్ట్రీ ఆఫ్ మదర్‌హుడ్’ ను కూడా చదివే ఉండాలి.
మదర్ ఈజ్ ఎ వెర్బ్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ యు డు, నాట్ జస్ట్ హు ఆర్ యు.. అనే మాట ఆ పుస్తకం లోనిదే. కొన్ని మాటలు అనువాదం చేశాక కూడా ఎంత తన్నుకున్నా అర్థం కావు. మాటల్లో లోతు ఎక్కువగా ఉన్నందు వల్ల కలిగే కష్టం అది. ‘అమ్మ అనే మాట ఒక క్రియ’.. అనే ఈ మాటను మాటల్లోకి కాకుండా, ఒక చక్కటి ఫొటోలోకి తర్జుమా చేస్తే ఇదిగో.. మీరిక్కడ చూస్తున్న ఫొటో అవుతుంది. ఇద్దరు మహిళా పోలీసు అధికారులు డ్యూటీ చేయడానికి వచ్చి, తమ డ్యూటీలో ఏ మాత్రం భాగం కాని ‘పని’ని తల్లి మనసుతో చేతుల్లోకి ఎత్తుకున్నారు.
ఆ రోజు అసోంలో ‘టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు బిడ్డ తల్లులూ వచ్చారు. దరంగ్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రానికి అలా బిడ్డలతో వచ్చిన ఇద్దరు తల్లులకు సహాయంగా ఎవరూ లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న ఈ ఇద్దరు మహిళా పోలీసులు చొరవ చూపి, వారి బిడ్డల్ని చేతుల్లోకి తీసుకున్నారు. ‘‘మీరు నిశ్చింతగా పరీక్ష రాసి రండి. అంతవరకు మీ బిడ్డల పూచీ మాది’’ అని భరోసా కూడా ఇచ్చారు.
ట్విట్టర్‌లో అసోం పోలీస్ డిపార్ట్‌మెంట్ పెట్టిన ఈ ఫొటో ఇప్పుడు.. చిన్నారులు స్వేచ్ఛగా అడుకుంటూ చుట్టుపక్కలంతా తిరిగినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలియ తిరుగుతోంది. ఈ ఇద్దరు మహిళా పోలీసులపై ఏకధారగా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘వియ్ సెల్యూట్’ అని, ‘గ్రేటెస్ట్ వర్క్ ఎవర్, ప్రౌడ్ ఆఫ్ యు’ అని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చెరిల్ లేసీ కరెక్టుగానే చెప్పారు. అమ్మ ఏ యూనిఫామ్‌లో ఉన్నా, అమ్మ మనసుకు ఏ యూనిఫామూ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment