ఆ సర్జరీకి, క్యాన్సర్‌కు సంబంధం ఉండదు | At the time of falling hole to intestinal to close surgery that Jay Zee | Sakshi
Sakshi News home page

ఆ సర్జరీకి, క్యాన్సర్‌కు సంబంధం ఉండదు

Published Fri, Jun 26 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

ఆ సర్జరీకి, క్యాన్సర్‌కు సంబంధం ఉండదు

ఆ సర్జరీకి, క్యాన్సర్‌కు సంబంధం ఉండదు

క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 45. నాకు దాదాపు 20 ఏళ్ల క్రితం పేగుకు రంధ్రం పడితే జీజే ఆపరేషన్ చేశారు. ఇటీవలే ఈ విషయాన్ని ఒక డాక్టర్ గారి దగ్గర ప్రస్తావిస్తే ‘నీకు పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది’ అన్నారు. అప్పట్నుంచి నాకు చాలా భయంగా ఉంది. ఇది నిజమేనా? నేనేమైనా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలా? వివరంగా చెప్పండి.
- హయగ్రీవాచారి, ఖమ్మం


పేగుకు రంధ్రం పడిన సమయంలో దాన్ని మూసేందుకు చేసే శస్త్రచికిత్స జీజే. నిజానికి దీనికీ, క్యాన్సర్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు. అది సాధారణంగా క్యాన్సర్‌కు దారితీసే అవకాశం అంతగా ఉండదు. అయితే మీ వయసు 45 అంటున్నారు. ప్రతి ఒక్కరిలోనూ నలభై ఏళ్లు దాటాక శారీరకంగా కొన్ని మార్పులు వస్తుంటాయి. దానిలో క్యాన్సర్‌కు దారితీసే అంశాలు ఉంటే ఉండవచ్చు. అలాంటి సమయాల్లో క్యాన్సర్‌ను చాలా తొలిదశలో గుర్తిస్తే... వైద్యవిజ్ఞాన ప్రగతి వల్ల ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో  క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది. అందుకే మీకు జీజే ఆపరేషన్ జరిగింది అన్న విషయంతో క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా, అందరిలాగే మీరూ రొటీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షలు ఏడాదికోసారి చేయించుకోవడం అవసరం.
 
నాకు ఒక సందేహం ఉంది. క్యాన్సర్ రావడానికి రేడియేషన్ కూడా ఒక కారణం అంటారు. మళ్లీ క్యాన్సర్ వచ్చిన వారికి అదే రేడియేషన్ ఇస్తుంటారు కదా. మరి అలాంటప్పుడు ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ తిరగబెట్టదా? మా బంధువుల్లో ఒకరికి రేడియేషన్ చికిత్స ఇస్తున్నారు. అప్పట్నుంచి నాకు ఈ సందేహం వస్తోంది. వివరించగలరు.
 - సీహెచ్. సుదర్శన్‌రావు, ఒంగోలు

 
సాధారణంగా వాతావరణంలోనూ రేడియేషన్ పాళ్లు తక్కువ మోతాదులోనే ఎంతో కొంత ఉంటుంటాయి. వాటిని మన శరీరం నిత్యం ఎదుర్కొంటూ ఉంటుంది. అలాగే మనం ఎక్స్-రే, సీటీస్కాన్ లాంటి పరీక్షలు చేయించుకున్నప్పుడు కూడా మనకు తక్కువ మోతాదులో రేడియేషన్ తగులుతుంది. ఈ రేడియేషన్ మనం తీసుకోడానికి అనుమతించే స్థాయి (పర్మిసిబుల్ లిమిట్) లోనే ఉంటుంది. అలాకాక న్యూక్లియర్ యుద్ధాల్లో వేలాదిమందికి రేడియేషన్ తగులుతుంది. దీనివల్ల చాలా రకాల క్యాన్సర్లు (ఉదా: బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు మొ॥వచ్చే అవకాశం ఎక్కువ. ఇక చిన్నపిల్లల్లో రేడియేషన్ చికిత్స ఇచ్చినప్పుడు కూడా 10 - 20 ఏళ్ల తర్వాత రేడియేషన్ ఇండ్యూస్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల్లో రేడియేషన్ చికిత్సను చేయం.ఇక రేడియేషన్ చికిత్సలో ఒకేసారి ఎక్కువ మోతాదు రేడియేషన్‌ను, ప్రమాదకరమైన క్యాన్సర్ కణితిని మాడ్చేచేసేందుకు చికిత్సలా ప్రసరింపజేస్తాం. ఇదీ  వాతావరణంలో ఉండే మామూలు రేడియేషన్‌కూ, చికిత్సకోసం ఉపయోగించే రేడియేషన్‌కూ ఉండే తేడా.
డాక్టర్ పి. విజయానందరెడ్డి
డెరైక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్,
అపోలో హెల్త్‌సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement