
'ఎంత పనైపోయింది అత్తయ్యా..'
అత్తాలేని కోడలుత్తమూరాలూ ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతురాలూ... ఆహుమ్.. ఆహుమ్... అసలు అత్తాకోడళ్లు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టికాయలు వేసేవాళ్లే ఉండేవాళ్లు కాదు. అత్త రుసరుసలు, కోడళ్ల విసవిసలు సిల్వర్ స్క్రీన్ నుంచి ఇప్పుడు ఇంట్లో టీవీల్లోకి వచ్చేశాయి. సీరియళ్లు సీరియళ్లుగా నడుస్తూ మ్యారథాన్ పరుగులు తీస్తున్నాయి. ఇది సరిపోక ఇప్పుడు యూట్యూబ్‌ని కూడా ఆక్రమించాయి. ‘చిన్నారి అత్తాకోడళు’్లగా యూ ట్యూబ్‌లో ఈ జంట పెద్ద హిట్. డిఫరెన్స్ ఏంటంటే... సినిమాల్లో అత్తాకోడళ్లు కొట్టుకునేవాళ్లు.
టీవీల్లో కీచులాడుకుంటున్నారు. యూట్యూబ్‌లో కిసుక్కులాడుకుంటున్నారు. కోడలిగా ఐదేళ్ల యోధ, అత్తగా పదేళ్ల రమ్యశ్రీల యుద్ధాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
నుదుటికి చేతులు ఆన్చుకుని అత్తగారు ఏడుస్తున్నారు. ఆమెను చూసి కోడలూ ఏడుపందుకుంది ‘అయ్యో... ఏమయింది అత్తయ్యా!’ అంటూ!
‘ఏం చెప్పనే తల్లీ.. మనిద్దరికీ పడదని, మనిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఊరువాడా కోడై కూస్తోందే!’ అంటూ ఏడుపు రాగం పెంచింది అత్తగారు!
‘ఎంత పనైపోయింది అత్తయ్యా..’ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ కోడలూ శ్రుతి పెంచింది.
ఓ క్షణం ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్లుండిపోయి మొహమొహాలు చూసుకుని ఒక్కసారే ‘వా....’ అంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నారు. శోకరాగాలు పెట్టీపెట్టీ చివరకు అత్తగారు ఓ కన్‌క్లూజన్‌కొచ్చారు. ‘ఒసే శిరీషా... ఇక నుంచి మనిద్దరం పోట్లాడుకోకూడదు. నేను చెప్పింది నువ్వు వినాలి. నువ్వు చెప్పింది నేను వింటాను సరేనా?’ అంది.
‘అలాగే అత్తయ్య.. నేను చెప్పింది మీరు వినండి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలు కళ్లు తుడుచుకుంటూ!
‘నేననేదీ అదేనే పిచ్చిమొద్దూ.. నేను చెప్పింది నువ్వు వినాలి.. నువ్వు చెప్పింది నేను వింటాను’ అంది అత్త గద్దిస్తూ!
‘నేననేదీ అదే అత్తయ్యా.... నేను చెప్పింది మీరు వినాలి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలూ అదే స్వరంతో!
‘కాదు నేను చెప్పింది వినాలి’ అని అత్త అంటే ‘కాదు నేను చెప్పింది’ అని కోడలు. అలా నేనంటే నేను అని పోట్లాటకు దిగారు ఇద్దరూ!
ఇదేదో సూర్యకాంతం, సావిత్రి నటించిన సినిమా కాదు. కానీ వాళ్లను సైతం మరిపించిన బుల్లి ఆర్టిస్టుల స్కిట్!
అత్తగా పదేళ్ల రమ్యశ్రీ, కోడలిగా అయిదేళ్ల యోధ.. అదరగొట్టారు! డిఫరెంట్ ఇష్యూస్ మీద అత్తాకోడళ్ల స్కిట్స్‌తో ఈ సమ్మర్‌ని కూల్ చేశారు. అత్తగారిలా మెటికలు విరవడం, బుగ్గలు నొక్కుకోవడం... ముక్కున వేలేసుకొని విస్తుపోవడం.. లాంటి మ్యానరిజమ్స్ ఎలా తెలిశాయి? అని బుజ్జి అత్త రమ్యశ్రీని అడిగితే.. ‘సూర్యకాంతంగారి వల్ల’ అంటూ ఠక్కున జవాబు చెప్తుంది. ‘ఆవిడ ఎవరో నీకు తెలుసా?’ అని మనం ఆశ్చర్యపోయేలోపే ‘గుండమ్మ కథ’ సినిమాలో గుండమ్మగా యాక్ట్ చేసిన ఆవిడ! నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో సూర్యకాంతం గారంటే మరీ ఇష్టం. నన్ను అత్తగారిలా చేయమని చందూ అన్నయ్య (ఈ అత్తాకోడళ్ల స్కిట్స్ డెరైక్టర్, యోధ తండ్రి కె. చంద్రశేఖర్) చెప్పగానే నాకు గుండమ్మ కథ సినిమా, అందులో సూర్యకాంతం గారే గుర్తొచ్చారు. అంతే... ఆమెనే ఇమిటేట్ చేశా!’ అని వివరించేసింది రమ్యశ్రీ.
సొగసరి కోడలు
సూర్యకాంతం లాంటి గడసరి అత్త పెద్దరికానికి సమయస్ఫూర్తితో చెక్‌పెట్టే సావిత్రి లాంటి సొగసరి కోడలుగా హండ్రెడ్ మార్క్స్ కొట్టేసింది యోధ. ‘కోడలు అంటే అలా మూతి ముడవాలని, ముక్కు తిప్పాలని ఎవరు చెప్పారు?’ అని అడిగితే ‘ఎన్ని సీరియల్స్ చూడట్లేదూ?’ అంటూ దీర్ఘం తీసింది. ‘కోడలు శిరీషగా చేస్తున్నప్పుడు టీవీలో వచ్చే ‘అమ్మ నా కోడలా’లో కోడలినే గుర్తు తెచ్చుకున్నావా?’ అని అడిగితే ‘ఉహూ.. సావిత్రిగారిని!’ అని యోధ ఆన్సర్. ‘అబ్బో సావిత్రిగారు కూడా తెలుసా నీకు?’ అంటూ అబ్బురపడుతుంటే ‘మా అత్తగారికి సూర్యకాంతం తెలిసినప్పుడు నాకు సావిత్రిగారు తెలియరేంటి?’ అంది గడుసుగా. ‘అయితే నువ్వూ గుండమ్మ కథ చూశావా?’ అన్నప్పుడు... ‘చూశాను’ అంది. ‘కానీ గుండమ్మ కథలో సావిత్రిగారేం నీలాంటి మాటకారి కోడలు కాదే?’ అని అడిగితే... ‘మాటకారి తనాన్ని నేను యాడ్ చేసుకున్నా’ అంటుంది ఆరిందలా చేతులు తిప్పుతూ!
‘సరే.. అత్తాకోడళ్లుగా చేశారు కదా... ఏమనిపించింది?’ అని అడిగితే...
‘యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే, ఒక లైలా కోసం, సూర్య వర్సెస్ సూర్య, ప్యార్ మే పడిపోయానే అలా ఇప్పటిదాకా 39 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశా. కాబట్టి నాకు మా నాన్న ఇచ్చిన కోడలి వేషం చాలా ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది మరి. ఈజీ చేసేశా’ అంటూ అంతే ఈజీగా చెప్పేసింది యోధ. ‘అత్తగారి వేషం వేయడానికి నాకూ పెద్ద కష్టమనిపించలేదు. ఎందుకంటే నేను కూచిపూడి డాన్సర్‌ని కాబట్టి. ఇందాకే చెప్పాను కదా.. సూర్యకాంతంగారిని గుర్తుతెచ్చుకున్నానని. ఈ రెండూ రీజన్స్ వల్ల ఈజీగా యాక్ట్ చేశాను’ తన విజయ రహస్యం చెప్పింది రమ్యశ్రీ అత్త ఉత్తమురాలు... కోడలు గుణవంతురాలు
ఈ స్కిట్స్‌లో అత్తాకోడలుగా మీరిద్దరూ కౌంటర్స్ వేసుకుంటుంటారు కదా.. రియల్ లైఫ్‌లో అత్తాకోడళ్లు ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడిగితే... ‘కోడలు ఇలా మాత్రం ఉండొద్దమ్మా..!’ అంటూ రమ్యశ్రీ ముక్కు తిప్పితే.. ‘అత్తగారూ ఇలా ఉండొద్దు లెండీ!’ అంటూ యోధా మూతి ముడిచింది. అంతలోకే నవ్వుకుంటూ ఇద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ‘అత్తా, కోడలు ఇద్దరూ ప్రేమగా ఉండాలి.. కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండాలి’ అని చెప్పారు.
- సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
రిలీఫ్ కోసం తీస్తే హిట్ అయింది
చదువు విషయంలో పిల్లలకు ఎలాగూ చాయిస్ లేదు. మనిష్టాన్నే రుద్దుతున్నాం. కనీసం సెలవుల్లోనైనా వాళ్ల ఇష్టాయిష్టాలను గమనించి వాటినే నేర్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఆలోచనతో ఉన్న నాకు మా పిల్లలు గురుగులు పెట్టి ఆడుకోవడం.. అచ్చు గృహిణుల్లా మాట్లాడుకోవడం చూసి అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో ఈ అత్తాకోడళ్ల స్కిట్ తయారు చేశా. ఒకటి చేయించి ఆ వీడియోను ఎఫ్‌బీ, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాక వచ్చిన రెస్పాన్స్ చూసి.. దీన్ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే కాక అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటే బాగుంటుంది, అలాగే ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే చిన్న మెసేజీ ఇచ్చేలా మలిస్తే బాగుంటుంది అనిపించింది. అంతే.. డిఫరెంట్ థీమ్స్‌తో ఈ కాన్సెప్ట్‌ని ఇలా డెవలప్ చేశాను. ఈ రోజు విదేశాలనుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. యూసఫ్‌గూడ (హైదరాబాద్)లో మా పిల్లలు చదివే ఎస్‌జీబీ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారాణిగారు పిల్లలకు ఫ్రీఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్లను దీవిస్తున్న అందరికీ థాంక్స్!’
- కె. చంద్రశేఖర్ (యోధ తండ్రి, స్కిట్స్ డెరైక్టర్)
టెన్ థీమ్స్: శిరిషా కాఫీ, జనాభా లెక్కలు, అత్తగారి నెక్లెస్, పనిమనిషి, గంగిరెద్దు, అలనాటి జ్ఞాపకం, మెసేజ్, న్యూస్ పేపర్, పాపులర్ అత్తాకోడళ్లు, యాంకరింగ్.. ఇలా ఈ అత్తా కోడళ్లు వేసిన ఈ పది థీమ్స్‌కి యూట్యూబ్‌లో వ్యూస్ వేల సంఖ్యలో ఉన్నాయి.