లావూ... సన్నం!
అందం-ఆరోగ్యం
‘‘అమె అందంగా ఉంది’’ ... గొణిగాడు విన్‌స్టన్.
‘‘నడుము చూశావా! చుట్టుకొలత ఈజీగా మీటరు ఉంటుంది’’... ఈర్ష్యగా పుల్ల విరిచింది జూలియా.
‘‘అదే ఆమె అందం’’ అన్నాడు విన్‌స్టన్.
జార్జి ఆర్వెల్ రాసిన ఓ నవల్లోని పాత్రలు విన్‌స్టన్, జూలియా.
మధ్యలో ఆ పెద్ద నడుము స్త్రీ ఎవరు? ఆమె కూడా ఒక పాత్రే.
‘లావు’ అని జూలియా ఆమెను తేలికచేసి పడేస్తే, ‘లావే అందం’ అని విన్‌స్టన్ మెస్మరైజ్ అయ్యాడు.
ఆ సాయంత్రం... బ్రిటిస్ బుక్ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లొస్తున్నారు జేకే రోలింగ్. సడెన్‌గా పాత ఫ్రెండ్ ఎదురైంది. ‘‘హే, రోల్! ఏంటి ఇంతలా చిక్కిపోయావ్?’’. ఫ్రెండ్ చూపుల్లో ఆశ్చర్యం. రోలింగ్, ఆ పాత ఫ్రెండ్ కలుసుకుని మూడేళ్లయింది.‘హ్యారీ పోట్టర్’ వంటి గొప్ప ఫిక్షన్ సీరీస్‌ను రాసిన రోలింగ్‌కి ఏం చెప్పాలో తెలీలేదు. ‘‘అప్పుడు పిల్ల తల్లిని కదా’’ అంది. తర్వాత అనుకుంది... ‘‘ఈ మూడేళ్లలోనూ నేనో బిడ్డకు జన్మనిచ్చాను. నా ఆరో నవల రాశాను’’ అని చెప్పి ఉండాల్సిందని. ‘‘సైజు తప్ప మనిషిలో మనిషికి ఆసక్తిరమైనవి ఏవీ ఉండవా!’’.. ఇంటికొచ్చాక నిలువుటద్దంలో చూసుకుంటూ అనుకుంది రోలింగ్. తన ఫ్రెండ్ అన్నమాట నిజమే. నడుము బాగా చిక్కిపోయింది. అంటే సన్నబడింది. రోలింగ్ తన మూడో బిడ్డను, ఆరో పుస్తకాన్ని పక్కనపెట్టి సన్నబడడాన్ని తన మనసు సెలబ్రేట్ చేసుకోడాన్ని ఆమె గమనించింది.
మార్లిన్ మన్రో. ఆమెరికన్ యాక్ట్రెస్, మోడల్, సింగర్... అన్నిటినీ మించి తన కాలపు సెక్స్ సింబల్. ఆమె ఎలా నవ్వితే అది అందం. ఎలా నడిస్తే అది ట్రెండ్. ఏం వేసుకున్నా, వేసుకోకపోయినా అది ఫ్యాషన్. ఆడామగా అన్న తేడా లేకుండా అందరి ఆరాధ్య దేవత. ఆమె ఏం మాట్లాడితే అది వేదం.
‘‘లావుగా ఉండడంలో ఒక్క సంతోషకరమైన సంగతి కూడా లేదు. అయినా సమాజం మనల్ని సన్నగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు అలా కాకుండా వేరేలా ఎలా ఉండగలం? సన్నగా ఉంటే అందంగా ఉంటాం. అందంగా ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. నా జీవితంలో నేను ఒక్కరోజు కూడా ఫ్యాటీగా లేను. ఫ్యూచర్‌లో కూడా ఫ్యాటీగా ఉండబోను’’... ఈ మాటలు మన్రోవి.
ఇంతకీ లావా? సన్నమా? ఏది అందం? బరువు పెరగడమా? బక్కచిక్కడమా? ఏది అందం? ఫ్యాటీగా లేకపోవడమే అందమా? లావూ, సన్నం రెండూ అందమే అంటున్నారు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వైద్య పరిశోధకులు. అయితే లావుగా ఉండేవారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలట!