
అలనాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గొప్ప ఉపన్యాసకుడు. ఓమారు ఆయనను కలిసిన ఒకరు – వేదికపై అంత సరళంగా తేలికగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. మీ మాటల్లో తడబాటు కానీ భయం కానీ కనిపించవు. కారణమేంటీ అని అడిగారు.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు....
‘‘నేను వేదిక ఎక్కినప్పుడే కాదు ఏదైనా సభలోనో సమావేశంలోనో నేను మాట్లాడటం మొదలుపెట్టడంతోనే నా ముందున్న వారందరూ తెలివిలేని వారని అనుకుంటాను. దాంతో నాకు మాట్లాడుతున్నప్పుడు భయం అనిపించదు అని చెప్పారు చర్చిల్.ఇటువంటి ప్రశ్ననే ఓసారి ఓ జెన్ గురువుని ఒకరడిగారు. ఎందుకంటే ఆయన కూడా ఎవరితో అయినా సరే ఏ మాత్రం తొణక బెణకక మాట్లాడుతారు. తననడిగిన ప్రశ్నకు ఆ జెన్ గురువు ఇలా జవాబిచ్చారు....నేను మాట్లాడుతున్నప్పుడల్లా నా ఎదుట నేనే కూర్చున్నట్లు భావిస్తాను. ప్రేక్షకులందరినీ నేనే అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇక నాకెందుకు భయం కలుగుతుంది. ఏ మాత్రం జంకూ బొంకూ లేకుండా చెప్పదలచుకున్నది చెప్పేస్తాను. చెప్పేదీ నేనే వినేదీ నేనే అని అనుకున్నప్పుడు ఇక భయాలెందుకుంటాయి అని ఆయన ఎదురు ప్రశ్నించారు....
ప్రాక్ పశ్చిమ దేశాలలో ఉన్న తేడా ఇదే. ఎదుటివారిని తెలివిలేనివారిగా అనుకోవడానికీ, అంతా తానే అనుకోవడానికి మానసికంగా ఎంత తేడా ఉందో కదూ....
– యామిజాల జగదీశ్