ఒకప్పుడు చెడ్డవి... ఇప్పుడు అవే మంచివి!
తిండి గోల
ఒకప్పుడు ఆ పదార్థాలను కాస్త ప్రతికూలమైనవిగా పరిగణించేవారు. తిన్నా పరిమితి పాటించమంటూ పెద్దలు సుద్దులు చెప్పేవారు. ఆరోగ్యనియమాలు పాటించేవారైతే వాటిని చాలా దూరంగా ఉంచేవారు కూడా. అవే... గుడ్లు, ఆలూ (బంగాళాదుంప). ఇప్పుడు ఆహార నిపుణులంతా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం గుడ్లు, ఆలుగడ్డ (బంగాళదుంప)లను విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకనాడు హెల్త్ పాలిటి విలన్‌లుగా పరిగణించిన పదార్థాలనే మళ్లీ హీరోలను చేస్తున్నారు.
లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన కింగ్స్ కాలేజ్‌లో స్కాట్ హెర్డింగ్ అనే నిపుణుడు ‘ద కన్వర్సేషన్’ అనే జర్నల్ కోసం రాసిన పరిశోధన పత్రంలోని ముఖ్య అంశాలపై ప్రసంగించారు. అందులోని కొన్ని ప్రధానాంశాలివి... ఒకప్పుడు ఒక గుడ్డులో కనీసం 185 ఎంజీ కొలెస్ట్రాల్ ఉంటుందనీ, గుండెకు అదెంతో కీడు అని చెప్పేవారు. అయితే గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన వైద్యపరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా గుడ్లు తినేవారి కొలెస్ట్రాల్ పాళ్లు క్రమబద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారట. గుడ్లు తినకపోవడం వల్ల కోల్పోయే మినరల్స్, విటమిన్స్ ఎక్కువన్నది పరిశోధకుల తాజా మాట.
ఆలుగడ్డ (బంగాళదుంప)లను చాలా అనారోగ్యకరమైనవిగా ఇటీవలి వరకూ పరిగణిస్తూ వస్తున్నారు. వాటిలో చక్కెరను పెంచే గుణం ఉన్నందున వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలుగా చెబుతూ వీలైనంత తక్కువగా వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాటిల్లో కార్బోహైడ్రేట్లతో పాటు, విటమిన్-సి, కొన్ని రకాల విటమిన్-బిలు, కొన్ని ఖనిజాలూ ఉన్నాయనీ, ఆరోగ్యానికి అవి అవసరమంటూ ఇప్పుడు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఆలుగడ్డలను మనం ఎలా వండుకుంటామన్న అంశమే అనారోగ్యకరం తప్ప అవి అనారోగ్య కారకాలు కావంటూ ఆహార నిపుణులు కితాబిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో నివాసం ఉండే మనకు మేలు చేసే బ్యాక్టీరియా విషయంలోనూ బంగాళదుంపతో సానుకూలం ప్రభావం ఉంటుందంటున్నారు స్కాట్ హెర్డింగ్.