ఆయుర్ ( ఆయుర్వేదం) కూల్...
సమ్మర్ స్పెషల్
ఆయుర్వేదం అన్నిరకాల ఆహార పదార్థాల గుణగణాల్ని, ప్రయోజనాల్ని... అవి మనపై చూపే ప్రభావాల్ని నిశితంగా పరిశీలించి వివరించింది. జీవనాధారమైన నీళ్లలోనే వర్షపునీరు, బావినీరు, తటాకజలం, నదీజలం, సముద్రజలం వంటివాటి మధ్య తేడాలు చెప్పింది. చెరకురసం, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దోస, రకరకాల ఫలాలు, వాటి రసాల ప్రయోజనాలను పేర్కొంది. వరి, గోధుమ, బార్లీలతో ద్రవాహారం ఎలా చేసుకోవాలో పేర్కొంది. పండ్లకు తోడుగా ఆహార దినుసులు, మూలికలూ, చక్కెర, పటికబెల్లం (మిశ్రీ), బెల్లం, నీరు మొదలైన వాటితో వివిధ పానీయాలు, పానకాలు (షర్బత్తులు) ఎలా చేసుకోవాలో చెప్పి, వేసవి తాపాన్ని ఎలా అధిగమించవచ్చో తెలియజేస్తుంది ఆయుర్వేదం. వాటిని చేసుకుందాం. వేసవి వేడిమిని జయిద్దాం.
ఫల రస పానీయాలు
ఈ కింద పేర్కొన్న పండ్లరసాలకు చక్కెర, ఏలకులు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ద్రవ్యాలను చేర్చుతారు. ఇలా వాటితో పాటు నిమ్మవంటి పానీయాలకు అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుంటారు. (బత్తాయి వంటి వాటికి నీళ్లు కలపరు). ఇలా పలచగా, రుచికరంగా చేసుకునే ద్రవాహారాలను పానీయాలు అంటారు. ఇవన్నీ ఆకలిని కలిగించి, జీర్ణశక్తిని పెంచి, నీరసాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అవి...
ద్రాక్ష: ఇది తాజాఫలాలన్నింట్లోనూ అత్యుత్తమమైంది. కించిత్ వగరుతో మధురంగా ఉండే ఫలమిది. శీతలం కలిగిస్తుంది. కళ్లకు మంచిది. మలమూత్రాలను సాఫీగా వచ్చేలా చేస్తుంది. నోటి చెడును తగ్గిస్తుంది. రక్తస్రావాలను అరికడుతుంది. సురాపానపు మత్తు (మదాత్యయము)ను/హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. జ్వరం, దప్పిక, దగ్గు, ఆయాసం, గొంతునొప్పి, ఛాతీనొప్పి, నీరసాలను తగ్గిస్తుంది.
దానిమ్మ (దాడిమ): ఇది తియ్యని రుచితో ఉన్నప్పుడు త్రిదోషశ్యామకమై, చలువ చేస్తుంది. పుల్లటి రుచితో ఉంటే వాతకఫాలను హరిస్తుంది. ఈ రెండూ కూడా రక్తవర్ధకాలే. రుచిని కలిగిస్తాయి. ఆకలి పుట్టిస్తాయి.
కదళీ (అరటి / మోచ ): ఇది బరువైన ఆహారం. చలువ చేసి పోషకవిలువలందించి బలాన్ని, పుష్టిని కలిగిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. శుక్రవృద్ధిని కలగజేస్తుంది. ఉదరవాయువును, కొంచెం మలబంధాన్ని కలగజేస్తుంది. దప్పికను పోగొడుతుంది.
మామిడి (ఆమ్ర): పచ్చి మామిడి: పచ్చిగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచులు కలిగి ఉంటుంది. వాతపిత్తశ్యామకం. ముదిరిన కాయ మిక్కిలి పుల్లగా ఉండి రక్తదోషాలను హరిస్తుంది. త్రిదోషాలనూ నివారిస్తుంది.
పండు మామిడి: ఇది మధుర రసాన్ని కలిగి ఉంటుంది. చెట్టుకు పండినది కాస్త పులుపుతో ఉంటుంది. ముగ్గవేసింది చాలా తియ్యగా ఉండి చలవ చేసి, త్వరగా జీర్ణమవుతుంది. శుక్రవృద్ధికి తోడ్పడుతుంది. అగ్నిదీప్తికరం (ఆకలి పుడుతుంది).
గమనిక: పుల్ల మామిళ్లు ఎక్కువగా తింటే అగ్నిమాంద్యం, విషమజ్వరాలు, రక్తవికారాలు, మలబంధం కలగజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
నిమ్మరసం (జంబీర): పులుపు రుచితో ఉండి వాతకఫాలను దూరం చేస్తుంది. మలబంధాన్ని పోగొడుతుంది. అరుచి, అజీర్తి, దప్పిక, వాంతి, ఉదరశూలలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
తయారు చేసే పద్ధతి: గ్లాసెడు నీళ్లలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం, నాలుగు చెంచాల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.
తియ్య నిమ్మ, బత్తాయి (మిష్టనింబు): మధురంగా ఉంటుంది. విషహరం. సహజ, కృత్రిమ విషాలకు విరుగుడు. నీరసాన్ని తగ్గిస్తుంది. అరుచి, దప్పిక, వాంతులను దూరం చేస్తుంది. బలకరం.
పుచ్చకాయ (కాలింద): దప్పిక తీరుస్తుంది. కఫవాతహరం.
ఖర్బూజ (ఖర్జూజ దోస): మధురం. మల, మూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. చలువ చేస్తుంది. బలకరం. జీర్ణకోశ వ్యవస్థను
మెరుగుపరుస్తుంది.
నేరేడు (జంబు): ఈ పండు చలవ చేస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. కఫ, పిత్త హరం. వాతకరం. కంఠానికి మంచిది కాదు.
మాదీఫలం: దీని తొక్క చేదు, కారంగా ఉంటుంది. స్నిగ్ధం, వాతహరం. పండులోని గుజ్జు మధురంగా పోషకవిలువలతో ఉంటుంది. వాతకఫశ్యామకం. వీటి కేసరాలు నోరు పొడిబారడం, అరుచి, తేన్పులు, వాంతులు, దగ్గు, ఆయాసం, ఉదర రోగాలు, కడుపు నొప్పి, ఆకలిలేకుండటం, అజీర్తిని తగ్గిస్తాయి.
రేగు (బదరీ): పెద్ద సైజు కాయను ‘సౌవీరం’ అంటారు. ఇది చలువ చేస్తుంది. విరేచనకారి, శుక్రకరం, శక్తివర్ధకం. చిన్నరేగు పండును ‘కోలము’ అంటారు. ఈ పండ్లు ఆకలిని కలిగించి, దప్పికను తగ్గించి, నీరసాన్ని పోగొడతాయి.
లవలీ (రాచ ఉసిరిక): పండు మూత్రాశయంలోని రాళ్లను పోగొడుతుంది. అర్శమొలలు తగ్గిస్తుంది. రుచికరం.
సహజ పానీయాలు
నీళ్లు (అంబు / తోయ / ఉదకం / జలం) శరీరానికి తృప్తిని ఇచ్చే ప్రాణాధారం నీరు. దప్పికను తగ్గించి, అంతర్గత మాలిన్యాలన తొలగిస్తుంది. నీళ్లు తెలివితేటలను పెంచుతాయి, దేహాన్ని చల్లబరుస్తాయి. ‘‘జీవనం తర్పణం హృద్యం హ్లాది బుద్ధిప్రబోధనం, తను అవ్యక్తరసం మృష్టం శీతం లఘు అమృతోపమ్, గంగాంబు నాభసో... ’’ నీళ్లను రాత్రిపూట రాగి పాత్రలో పోసి మరుసటి దినం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా రాత్రి వెన్నెట్లో పెట్టిన నీరు కూడా తాగితే మంచిది. చల్లటి నీళ్ల ఉపయోగం: ఇవి తాగితే గ్లాని, శ్రమ, మూర్ఛ, వమనం, భ్రమ, శరీరంలో మంట తగ్గుతాయి. విషాలను హరిస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. ఉష్ణోదకం: వేణ్ణీళ్లు ఆకలిపుట్టించి, జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. కడుపులో వాయువులు తగ్గి ఉదరం తేలిక అవుతుంది.
తేనె (మధు)
శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దప్పిక, తేన్పులను పోగొడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కఫహరం. రక్తస్రావం, ప్రేమేహం, అతిసారం, శ్వాస-కాస (దగ్గు)-చర్మరోగాలను పోగొడుతుంది. వ్రణరోపణాలు (గాయాలు) త్వరగా మానిపోయేలా చేస్తుంది.
కొబ్బరి నీళ్లు (నారికేళోదకం)
కొంచెం జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరాన్ని తేలిక పరచి చలువచేస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. దప్పికను పోగొడతాయి. మగవారిలో శుక్రకణాలను వృద్ధిచేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తాయి. ‘‘నారికేళోదకం స్నిగ్ధం స్వాదు వృష్యం హిమం లఘు,తృష్ణా పిత్తానిలహరం దీపనం వస్తిశోధకం’’కొబ్బరినీళ్లలో పొటాషియం లవణాలు ఎక్కువ. కొబ్బరి నీరు హై బీపీని నియంత్రిస్తుంది. అందువల్ల ఇది గుండె జబ్బుల వారికి మేలు చేస్తుంది.
పాలు
జిడ్డుగా తియ్యగా ఉండి సప్తధాతు వర్థకమైన ద్రవాహారం పాలు. శీతలకరం. ఆవుపాలు శ్రేష్ఠమైనవి. ‘‘ప్రాయః పయో అత్ర గవ్యంతు జీవనీయం రసాయనం, క్షతక్షీణహితం మేధ్యం బల్యం స్తన్యకరం సరం. శ్రమ భ్రమ మద అలక్ష్మీ శ్వాసకాస అతితృట్ క్షుధః జీర్ణ జ్వరం మూత్ర కృచ్ఛ్రం రక్తపిత్తంచ నాశయేత్’’ ప్రాణప్రదం, బలవర్ధకం ఓజోవర్ధకం, మేధావర్ధకం, దౌర్బల్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు పాలుపడతాయి. అలసట, తలతిరుగుడు, ఆయాసం, దగ్గు, దప్పిక, ఆకలి, చిరకాల జ్వరాలను పోగొడుతాయి పాలు. రక్తస్రావాన్ని అరికడతాయి. మూత్రవిసర్జనలో ఇబ్బందులు, అవరోధాలను పోగొట్టి సాఫీగా అయ్యేలా చేస్తాయి.
మజ్జిగ (తక్రం)
‘‘తక్రం లఘు కషాయామ్లం దీపనం కఫవాతజిత్, శోఫ, ఉదర, అర్మ, గ్రహణీ దోష, మూత్రగ్రహ, అరుచీఃగుల్మ ప్లీహ ఘృతవ్యాపత్ గరపాండు - ఆమయాన్‌జయేత్ తత్ వమనస్తు సరం, స్రోతః శోధి విష్టంభజిత్ లఘు’’ మజ్జిగ కొంచెం వగరుగా, తియ్యగా ఉండి... రుచినీ, ఆకలినీ కలిగిస్తుంది. పొట్ట ఉబ్బరం, శరీరంలోని వాపులు, మూలశంకలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం వంటపట్టనప్పుడు, మూత్రం సాఫీగా రానప్పుడు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. వాంతులు, రక్తహీనత, ప్లీహరోగాల్ని పోగొడుతుంది. రసాల: పెరుగును చిలికి మజ్జిగ చేసే సమయంలో అందులో చక్కెర, మిరియాల పొడి వంటివి కలిపితే దాన్ని ‘రసాల’ అంటారు. ఇది బలకరం, వీర్యవృద్ధి కలిగిస్తుంది.
చేసుకునే పద్ధతి : పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి, కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగట్టి రోజూ రెండు మూడు సార్లు తాగాలి.
చెరకు రసం (ఇక్షురసం): ఇది కొంచెం జిడ్డుగానూ, తియ్యగానూ ఉంటుంది. శరీరానికి చలవు చేస్తుంది. దేహశక్తిని పెంచి నీరసాన్ని తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. వృష్యం, కామోద్దీపనం. చెరుకుగడను బాగా నమలడం వల్ల వచ్చే రసాన్ని సేవించడం ఉత్తమం. అప్పుడు చెరకురసం సహజగుణాలు మారవు. యంత్రాలతో తీసిన రసం అంత శ్రేష్ఠం కాదు. ఇది కొన్ని మలినాలతో ఉంటుంది. యంత్రాలతో తీసిన చెరకురసంతో అరుగుదల కష్టమై, కడుపులో మంట కూడా కలగవచ్చు. మలబంధం కూడా కలిగే అవకాశం ఉంది. ‘‘మూలాగ్రజ జంతుజఘ్నాది పీడతాత్ మలసంకరాత్, కించిత్ కాలవిఘృత్యా చ వికృతిం యాతి యాంత్రికః...’’
ధాన్య పానీయాలు
బార్లీ (యవలు): నీటితో వీటిని కలిపి, మరిగించి జావ కాసుకొని తాగవచ్చు. ఇవి బలకరం. చలువచేస్తాయి. ఉదరంలో వాయువును పోగొట్టి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. వృష్యమై కామోద్దీపన కలిగిస్తాయి. మూత్ర వికారాల్ని, ధాతు పరిణామ వికారాలల్లీ తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, ఆయాసం, కంఠ, చర్మరోగాల్ని తగ్గిస్తాయి. త్రిదోషశ్యామకం. మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తాయి. ఒంట్లో వాపులు తగ్గిస్తాయి. వరి అన్నంతో చేసిన గంజి, ఇతర జావలు: బియ్యాన్ని శుభ్రం చేసి బాగా మెత్తగా ఉడికించి, పిసికి, జావలాగా తయారు చేయాలి. ఇది అతిచిక్కగా ఉంటే, దాన్ని కాంజికము (గంజి) అంటారు. దీన్ని చిక్కదనం తగ్గిస్తూ పల్చగా తయారుచేసుకుంటే దాన్ని ‘మండ, పేయ, వివేపి, యవాగు’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఇది ఆకలి పుట్టిస్తుంది. బలం కలిగిస్తుంది. పొట్టలోని వాయువును, దప్పికను తగ్గిస్తుంది. గోధుమ జావ: గోధుమరవ్వను (దలియా) జావగా కాసుకొని తాగవచ్చు. ఇది జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరానికి చలవ చేస్తుంది. ధాతువర్ధకమై, బలస్థైర్యాలను పెంచుతుంది. జీవనీయం. వృష్యం (వీర్యవృద్ధిని కలిగిస్తుంది). లాజ (పేలాల పానీయం): ‘భృష్టానాం తండులాః లాజాః’ పేలాలను నీటిలో నానబెట్టి మెత్తగా పలుచగా చేసి తాగాలి. ఇది తేలికగా జీర్ణమై శరీరానికి చలువచేస్తుంది. దగ్గు, కఫం, దప్పిక, అతిసారం, మధుమేహాలను తగ్గిస్తుంది. ధాన్యాది హిమ ( ధనియాలతో చేసే పానీయం): ధనియాల పొడిని వేడినీళ్లలో కలిపి, రాత్రిపూట చంద్రకిరణాలు సోకేట్లుగా ఉంచి, మరుసటి దినం బాగా కలిపి వడగట్టాలి. ఈ పానీయం దప్పికనూ, మంటను తగ్గిస్తుంది.
ఇతర పానీయాలు
బాదం (వాతామ): స్నిగ్ధకరం, ఉష్ణకరం, వాతహరం. మృదురేచకం (మలవిసర్జన మృదువుగా అయ్యేలా చేస్తుంది). వీర్యవృద్ధికరం, కామోద్దీపకరం. దప్పికనూ, వికారాన్ని, దగ్గును తగ్గిస్తుంది. పుష్టికరం.
బిల్వ (మారేడు) : ఇది బాగా పండినదైతే పొట్టలో వాయువుకు కారణమవుతుంది. కానీ కాయ ఆకలిని పుట్టిస్తుంది. అరుగుదలకు మంచిది. ఈ రెండూ కూడా విరేచనాలను తగ్గించి, మలబంధాన్ని కలగజేస్తాయి.
ముళ్లదోస (త్రపుస): లేత కాయ అయితే దప్పిక, మంట, నీరసాలను పోగొడుతుంది. మధురరసం. చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఇక గింజలు చలువ చేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చూడటమేగాక, మూత్రసమయంలో వచ్చే మంటను తగ్గిస్తాయి. రక్తస్రావాన్ని అరికడతాయి.
షడంగ పానీయం: చందనం (మంచి గంధం), ముస్తా (తుంగముస్తలు), ఉశీరం (వట్టివేళ్లు), ఉదీచ్య (కురువేరు), నాగర (శొంఠి), పర్పాటక... వీటన్నింటినీ దంచి కషాయంలా కాచుకోవాలి. ఈ కషాయాన్ని 30 మి.లీ. తీసుకొని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రీ) కలిపి రోజూ తాగాలి.
సాధారణ జాగ్రత్తలు
పిల్లలు వేసవి తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆరు బయట ఆడుకుంటుంటారు. అందుకే వాళ్ల ఒంట్లోంచి లవణాలు బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్లకు వేసవిలో కూల్‌డ్రింక్స్‌కు బదులు సహజ పానీయాలు ఇస్తుండాలి. బయట అమ్మే చెరకు రసం, సోడాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికిపోవద్దు పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహార మందుల ఉన్నాయేమో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్షపండ్ల మీద మనకు తెల్లగా పొరలా కనిపిస్తుంటే అది సహజత్వానికి భిన్నం. అలాంటి పండ్లను ఉప్పు కలిపిన నీళ్లలో రెండుమూడుసార్లు నానబెట్టి శుభ్రపరచుకోవాలి. పండ్లరసాలు తాగగానే వెంటనే వాటి దోషాలను నివారణగా (ముఖ్యంగా గొంతులో గరగర వంటివి) కొన్ని వేడినీళ్లు తాగాలి. అందులో చిటికెడు మిరియాల పొడి, శొంఠి పొడి కలిపితే ఇంకా మంచిది.
పానీయ పరిమళాలు
పానీయాలకు, ద్రవాహారాలకు రుచినీ, సువాసనలనూ (ఫ్లేవర్స్) సమకూర్చడానికి ఉపకరించడంతో పాటు... ఔషధగుణాలు సైతం కలిగి ఉన్న పదార్థాలివి... తులసీ (సురసా / గౌరీ) ‘‘తులసీ కటుకా తిక్త హృద్య ఉష్ణా దాహ పిత్త కృత్ దీపనీ కుష్ట కృచ్ఛ్రాస్ర పార్శ్వరుక్ కఫవాత జిత్ శుక్లా కృష్ణాచ తులసీ గుణైః తుల్యా ప్రకీర్తితా’’ తులసిలో ‘తెల్ల తులసి, నల్ల తులసి’ అని ప్రధానంగా రెండు రకాలుంటాయి. తులసి ఆకులు కలిపాక పానీయాలకు కాస్త చేదు, కారం రుచి వస్తుంది. ఆకలి పుట్టించే గుణం తులసికి ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది తులసి. మూత్రవిసర్జన సాఫీగా అయ్యేలా చూడటంతో పాటు చర్మరోగాలు, విషరోగాలను హరిస్తుంది. ఇది మధుమేహహరం (డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది). కరివేప (సురభినింబ): ఆకలిని పుట్టించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తేన్పులు, కడుపు ఉబ్బరం,కడుపునొప్పి (ఉదరశూల), నీళ్లవిరేచనాలను తగ్గిస్తుంది. పచ్చకామెర్లు, రేచీకటి, శరీరం వాపులను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నివారిస్తుంది.
పుదీన (పూతిహా): అజీర్తినీ, కడుపు ఉబ్బరాన్నీ తగ్గిస్తుంది. గొంతునొప్పి, జలుబు, ఎక్కిళ్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. రుతుశూలను తగ్గిస్తుంది. అల్లం: ఇది ఘాటుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి, అజీర్తిని తగ్గిస్తుంది. రక్తప్రసరణాన్ని పెంచుతుంది. గొంతునొప్పిని తగ్గిస్తుంది.శుంఠి (శొంఠి): అజీర్ణాన్ని తొలగించి, కడుపునొప్పి, ఉదరవాయువులను పోగొడుతుంది. దగ్గు ఆయాసం, వాంతి వికారాలు, కీళ్లనొప్పులు, అర్శమొలలను పోగొడుతుంది. సోంఫ్ / సోంపు ( మిసిః / సదాప): ఆకలిని పుట్టించి, జీర్ణక్రియను పెంచి, విరేచనాలన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. కంటిచూపును పెంచుతుంది. మిరియాలు (మరిచ): కఫవాత హరం. శరీరంలోని కొవ్వులను తగ్గిస్తాయి. దగ్గు, ఆయాసం, కడుపునొప్పులను తగ్గించి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.జీలకర్ర (జీరక): అరుచిని పోగొట్టి, ఆకలి పుట్టించి, జీర్ణప్రక్రియను పెంచుతుంది. ఉదరవాయువులను తొలగిస్తుంది. అతిసారహరం. జీలకర్రతో పొట్టలోని క్రిములు తొలగిపోతాయి.దనియాలు (ధాన్యకః): అరుచిని పోగొట్టి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను వృద్ధి చేస్తాయి. దప్పిక, మంట, వాంతులను తగ్గిస్తాయి. దగ్గు ఆయాసాలను తొలగిస్తాయి. కడుపునొప్పి, నీళ్లవిరేచనాలను తగ్గిస్తాయి. బాగా నిద్రపట్టేలా చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్,
హైదరాబాద్