మేనుకు మేలు.. వెన్నుకు శక్తి.. | Back to the power of good | Sakshi
Sakshi News home page

మేనుకు మేలు.. వెన్నుకు శక్తి..

Published Wed, Mar 9 2016 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

మేనుకు మేలు.. వెన్నుకు శక్తి..

మేనుకు మేలు.. వెన్నుకు శక్తి..

సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలుని వెనుకకు బాగా స్ట్రెచ్ చేయాలి, నడుమును ట్విస్ట్ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్‌పిట్ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి.

నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. అలా కూడా చేయడం సాధ్యం కానప్పుడు చేతులు లేని కుర్చీలో కుడి తొడ వెనుక భాగం సపోర్టుగా ఉంచి కూర్చుని, ఎడమకాలుని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుర్చి బ్యాక్ రెస్ట్‌ని రెండు చేతులతో పట్టుకుని నడమును కుడివైపుకి బాగా తిప్పుతూ కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి.

ఉపయోగాలు:  వెన్నెముక సంబంధిత సమస్యలను నివారించి వెన్నెముకను బలంగా చేస్తుంది. సీటు భాగం తగ్గుతుంది. నడుము బలంగా అవుతుంది. పొట్ట దగ్గ అవయవాలకు, కండరాలకు మంచి టోనింగ్ జరిగి జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధక సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది.
 
1  పార్శ్వోత్థానాసన

సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి, ఎడమకాలు వెనకకు (రెండు కాళ్ళ మధ్య 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడిపాదం ముందుకు ఎడమపాదం పక్కకు చేతులు రెండూ వెనుక నమస్కార ముద్రలో ఉంచి శ్వాస తీసుకుంటూ తల పైకి ఎత్తి శ్వాస వదులుతూ ఉండాలి. తల, ఛాతీ భాగాలను ముందుకు వంచుతూ నుదురు లేదా గడ్డం మోకాలు దగ్గరికి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి, అదే విధంగా తిరిగి రెండో వైపు చేయాలి. చేతులు రెండు వెనుక నమస్కార ముద్రలో ఉంచలేని వాళ్ళు, చేతులు వెనుక కట్టుకొని చేయవచ్చు. లేదా చేతులు రెండు ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడిపాదానికి రెండువైపులా భూమికి దగ్గరగా తీసుకురావచ్చు. ఉపయోగాలు: పొట్టలోని జీర్ణావయవాలకు, షోల్డర్ బ్లేడ్స్, ట్రెపిజీయస్, డెల్టాయిడ్ కండరాలకి మంచి టోనింగ్ జరుగుతుంది.
 
 2 పరివృత్త  పార్శ్వ కోణాసన
 యోగావగాహన: మన ఆరోగ్యం మన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. జీవనశైలికి సంబంధించిన అంశాలను 6 విధాలుగా చెప్పవచ్చు.
 1. ఆహారం: ఊబకాయం, మధుమేహ వ్యాధులకు దారితీసే పిండి పదార్థాలను ఎక్కువ శాతం తీసుకోకుండా విటమిన్లు, ఖనిజ పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం.
 2. విహారం: ఎంచుకునే వ్యాయామం, చేసే యోగా సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ పద్ధతులలో సరైన దానిని మన శరీర గుణాన్ని బట్టి వయస్సును బట్టి ఎంచుకుని సాధన చేయడం.
 3. వ్యవహారం: అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహములతో కూడిన యమ, శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ తదితర నియమాలను పాటించుట.
 4. విచారం: సెల్యూలార్ మెమొరీలో పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ నిరంతరం ప్రవహిస్తూ మెదడును ప్రభావితం చేస్తాయి కనుక పాజిటివ్ ఆలోచలను పెంచుకోవడానికి కావలసిన ధ్యాన పద్ధతిని అనుసరించడం. శ్వాస మీద చేసే ధ్యానము సమాధి స్థితికి దారి తీస్తుంది. సమాధి స్థితి వల్ల జన్మరాహిత్యం లేదు.
 
 3 హనుమానాసన

 సముద్రాన్ని లంఘించినప్పటి హనుమంతుడి భంగిమలో ఈ ఆసనంలో రెండు కాళ్లను బాగా స్ట్రెచ్ చేస్తాం కాబట్టి దీనికి హనుమానాసనమని పేరు. కాళ్ళు రెండూ పూర్తిగా స్ట్రెచ్ చేసి ముందుగా మోకాలు మీద నిలబడి శ్వాస వదులుతూ చేతులు రెండూ నేల మీదకు తీసుకువచ్చి, ఎడమ కాలు కొంచెం కొంచెం ముందుకు, కుడి కాలు కొంచెం కొంచెం వెనుకకు జారుస్తూ రెండు కాళ్ళు ఒకదానికి ఒకటి సమాంతర రేఖలో వచ్చేటట్లుగా ఎడమపాదం వెనుకకు, కుడిపాదం ముందుకు స్ట్రెచ్ చేస్తూ చేతులను నమస్కార ముద్రలోకి తీసుకురావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత నెమ్మదిగా చేతులు రెండు క్రిందకి నేల మీదకు సపోర్టుగా పెట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి శరీరాన్ని ప్రక్క నుండి వెనుకవైపుకు వ్యతిరేక దిశలోకి తిరిగి రెండోవైపు కూడా చేయాలి. ఫొటోలో చూపిన విధంగా చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కాబట్టి, కాళ్ళ వెనుకభాగం పూర్తిగా భూమి మీద ఆనించకుండా మోకాళ్లు రెండు పైకి లేచి ఉన్నప్పటికీ పర్వాలేదు.

జాగ్రత్తలు: ఈ ఆసనం పూర్తి స్థాయిలో చేయడం ముఖ్యం కాదు. చేసేటప్పుడు కాలి కండరాలను బలవంతంగా సాగదీయకుండా నెమ్మదిగా పూర్తిగా సడలింపచేస్తూ రిలాక్స్‌డ్ మనస్సుతోటి వీలైనంతవరకు చేయడం ముఖ్యం. రెండు కాళ్ళ క్రింద మోకాలుకు అడుగు భాగంలో బాలిస్టర్లను ఉపయోగించి సాధన చేయడం మంచిది. మోకాలు నొప్పులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా చేయాలి.
 ఉపయోగాలు:  తొడలలో, నడుము క్రింది భాగాల్లో పేరుకుని ఉన్న కొవ్వు కరగడానికి చక్కటి అవకాశం ఉంది. తొడ కీలు భాగాలు తెరుచుకుని పెల్విక్ ప్రాంతం చాలా బలంగా తయారవుతుంది.
 మోడల్: నేహా చౌదరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement