బతుకమ్మ పాటమ్మ ఉయ్యాలో... | bathukamma festival songs lyrics | Sakshi
Sakshi News home page

బతుకమ్మ పాటమ్మ ఉయ్యాలో...

Published Mon, Sep 29 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

bathukamma festival songs lyrics

తెలంగాణా సంస్కృతి విశిష్ఠమైనదేకాదు విలక్షణమైనది కూడా. తెలంగాణీయులు జరుపుకునే పండుగలన్నీ సామాజిక కౌటుంబిక సంబంధాలకు అద్దం పడుతాయి. బతుకమ్మా అంతే!
 
బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీకయైన పండుగ. ఇందులో పేర్చే పూలల్లో తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్షలకే అగ్రతాంబూలం. ఇవి అల్కటల్కటి పూలు. నీళ్ళలో తేలిపోవడానికి అనుకూలమైన లక్షణం గలవి. ఇది పూలపండుగే కాదు, ఆటల పండుగ, పాటల పండుగ, కోలాటాల పండుగ. అన్నిటినీ మించి ఆడపిల్లల ఆటవిడుపు పండుగ. సంవత్సరం సాంతం అత్తవారింట్లో గడిపిన ఆడపిల్లలను తల్లిగారింటికి తప్పనిసరిగా తీసుకొచ్చే పండుగ. ఊరు ఊరంతా ఒకేచోట కలుసుకోగల్గిన పండుగ. ప్రపంచంలో మరెక్కడా లేని పండుగ.
వినాయక నిమజ్జనానంతరం అంటే అనంత చతుర్దశి తర్వాత వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పౌర్ణమి అంటారు. కొందరు పౌర్ణమితోనే బొడ్డెమ్మ ఆటను ప్రారంభిస్తే, మరికొందరు పంచమి నుండి ఆడతారు. పిల్లల పండుగ అంటే పెండ్లికాని పిల్లలది. కొందరు పుట్టమన్నుతో పీటపై చతురాస్రాకారపు తంతెలుగా బొడ్డెమ్మను తయారు చేస్తే మరికొందరు పెండతో తయారు చేస్తారు. ప్రాంతాల వారిగా ఐదురకాల బొడ్డెమ్మ వేడుకలుంటాయి. ఈ బొడ్డెమ్మను ప్రతిరోజు ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేసి పూలతో అలంకరిస్తారు. ప్రతిరోజు అక్కడికి వచ్చే పిల్లలు ఏ ధాన్యమో తెచ్చి బొడ్డెమ్మ మీది కలశంలో పోస్తారు. ఆట ముగిసిన తర్వాత-
 ‘‘నిద్రపో బొడ్డెమ్మా నిద్రపోవమ్మ - నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు / నినుగన్న తల్లికి నిండునూరేండ్లు - పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు’’ అంటూ నిద్రపుచ్చుతారు.
 ఇక పెతర అమావాస్యతో బతుకమ్మ ఆట షురూ! తొమ్మిది రోజుల పండుగ. బతుకమ్మ ధరచోళ దేశమున ధర్మాంగదుడి వరపుత్రిక. ‘‘ధర చోళ దేశంబున ఉయ్యాలో- ధర్మాంగదుడను రాజు’’ అంటూ పాడుతూ ధర్మాంగదుడికి నూరుగురు కొడుకులు మరణించిన అనంతరం వరంగా పుట్టిన బిడ్డ కాబట్టి, ఆమె చిరకాలం జీవించాలనే కోరికతో బతుకమ్మ అని పేరుపెట్టాడనీ, ఆ బిడ్డ పేరిట కొనసాగిన ఆట పాటే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. కన్యకాపరమేశ్వరి ఆత్మాహుతి అనంతరం ఆమెను తిరిగి బతుకమని చెప్పడంలో భాగంగా ఈ ఆట వచ్చిందనీ, రైతు బిడ్డపై మరదలు అఘాయిత్యం చేసి చంపి పూడ్చిన సమాధి నుండి ఆమె ఎలుగెత్తి కోరిన కోరికే ఈ పండుగనీ, రుద్రమదేవిని రక్షించే క్రమంలో ఆమె అనుచరురాలి ఆత్మార్పణమే ఈ పండుగనీ... ఇలా భిన్నాభిప్రాయాలున్నాయి.
 ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ -ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
 తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ- తంగేడు మొగ్గొప్పునే గౌరమ్మ
 ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
 కట్లాయి పువ్వొప్పునే గౌరమ్మ - కట్లాయి కాయొప్పునే గౌరమ్మ
మొదట్లో బతుకమ్మ పాటలన్నీ పండుగను ప్రతిబింబిస్తూ సాగాయి. ఇక, ఈ కింది పాటను గమనిస్తే-
 ‘‘యాదగిరి పట్నాన ఉయ్యాలో - నీలమాదేవి ఉయ్యాలో
 సంతానమే లేక ఉయ్యాలో - సతిచింతా చెందే ఉయ్యాలో
 కానరాని చెట్లకు ఉయ్యాలో - కానుకలు చెల్లించు ఉయ్యాలో’’
అంటూ పూజలు చేస్తూనే, మిక్కిలి దుఃఖిస్తుంది. కన్నీరు ఏరులై పారగా పార్వతీదేవి ‘మొగులు లేనివాన ఉయ్యాలో ఎక్కడిది శివడ ఉయ్యాలో’ అంటూ  ప్రశ్నించడం, శివుడు కారణం తెలుపుతూనే నీలిమాదేవికి ప్రత్యక్షమై సంతానవరాన్ని ఇవ్వడం జరిగిపోతాయి.
 జానపదుల రామాయణంలో రావణాసురుడు మాయా జంగమ వేషంలో వచ్చి భిక్ష వేడగా, సీతాదేవి భిక్ష దోసిట్లో తీసుకొని-
 ‘‘పటు జంగమయ్యా ఉయ్యాలో - చారెడు ముత్యాలు ఉయ్యాలో / పిలిచి భిక్షా పెడితే ఉయ్యాలో-  పుడుతాదయ్యా బిడ్డ ఉయ్యాలో’’ అంటూ ముందుకొస్తుంది.
 మరో పాటలో, అత్తవారింట్లో ఉన్న కొత్తగా పెళ్ళయిన చెల్లెలు అన్నరాగానే కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు పెట్టుకుంటుంది. దానికి అన్న-
 ‘‘ఏందమ్మా చెల్లెలా ఉయ్యాలో - ఏడిసేటి పనులు ఉయ్యాలో’’ అని అడుగుతాడు. అందుకు ఇంకా బిడ్డ కలగని చెల్లె ‘‘పాలివారి బాధ ఉయ్యాలో - పడరాదె అన్న ఉయ్యాలో’’ అంటుంది.
 ‘‘ఫలములందేదాక ఉయ్యాలో- పడవాలె చెల్లె ఉయ్యాలో
 తొట్టెల బాలుడు ఉయ్యాలో- తొలుకాడెదాక ఉయ్యాలో
 ఆకిట్ల బాలుడు ఉయ్యాలో -అంబాడేదాక ఉయ్యాలో’’
అంటూ చెల్లెను అనునయిస్తాడు అన్న.
 బతుకమ్మ పాటల్లో పురాణాలకు సంబంధించినవి ఎక్కువగా చేరాయి. తమ ఎదుట ఉన్న వ్యక్తులనే పౌరాణిక పాత్రలుగా ఊహించుకొని వాళ్ళపై పాటలు పాడుకోవడం కూడా పరిపాటి. రామాయణ రాముడు ఏకపత్నీవ్రతుడు కావచ్చు గానీ జానపదుల రాముడు కాదు.
 ‘‘చిట్ట చిట్ట ఇల్లలికి ఉయ్యాలో - సిరిముగ్గులేసె ఉయ్యాలో
 సీతమ్మరామూలూ ఉయ్యాలో - జూదమాడంగ ఉయ్యాలో
 ఆడుతాడుతా సీత ఉయ్యాలో - చిరునిద్రలేపోయె ఉయ్యాలో
 సీతను మరిపించి ఉయ్యాలో - రాముడే పాయెను ఉయ్యాలో
 కాల్లకాడ కూసున్న ఉయ్యాలో - కస్తూరి కుక్క ఉయ్యాలో’’

 అంటూ రాముని పోకడ గురించి కుక్కనూ, పిల్లినీ, ఆకాశాన పోయేటి పక్షినీ అడుగుతుంది సీత. అతని జాడ చెప్తే, ‘‘గుత్తు కాళ్ళకు ఉయ్యాలో - గజ్జెలూ చేయింతు ఉయ్యాలో’’ అంటుంది. భర్త పరస్త్రీ వ్యామోహంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతా స్త్రీదే కదా!
 ఇక, ఆడవాళ్ళపై అఘాయిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి. అది కూడా ఇలా పాటగా మారింది.
 ‘‘ఇదరక్క సెల్లెండ్లు ఉయ్యాలో - ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో
 ఒక్కడే మాయన్న ఉయ్యాలో - వచ్చన్న బోడాయె ఉయ్యాలో’’
అని బాధపడుతుంటే,
 ‘‘ఎట్లొస్తూ చెల్లెలా ఉయ్యాలో - ఏరడ్డమాయె ఉయ్యాలో’’ అని అన్న బదులిస్తాడు. అయితే, జానపదాల్లో ఒక్కోసారి సమన్వయం లేని కొనసాగింపులుంటాయి.
 ‘‘బాలెంత వడికింది ఉయ్యాలో- బంగారిపోగు ఉయ్యాలో
 వయసుదీ వడికింది ఉయ్యాలో - వజ్రాలపోగు ఉయ్యాలో
 ముసలిది వడికింది ఉయ్యాలో- ముత్యాల పోగు ఉయ్యాలో
 ఆపోగు ఈ పోగు ఉయ్యాలో - తక్కేడు పోగు ఉయ్యాలో’’
ఆ పోగులన్నీ తీసుకెళ్లి చింతకింది శాలాయనకు ఇచ్చారు. ఆయన నెలకొక్కపోగు నేసేసరికి చీర ఆలస్యంగా తయారైంది.
 ‘‘ఆ చీరకట్టుకుని ఉయ్యాలో - కొంగలాబాయికి ఉయ్యాలో
 కొంగలాబాయికి ఉయ్యాలో - నీళ్ళకంటూ బోతే ఉయ్యాలో
 కొంగలన్నీ గూడి ఉయ్యాలో - కొంగంతా చింపె ఉయ్యాలో’’
అదే విధంగా హంసల బాయికి పోతె హంసలు అంచంతా చింపినవి. చిలుకల బాయికి పోతె చిలుకలైతే చీరంతా చింపినవి. నిజానికి ఆడవాళ్ల మీద దుండగులు చేసే అఘాయిత్యాలను ఇలా పిట్టల పేరు మీద చెప్పడమే ఇక్కడ జరిగింది.
 ‘‘నీల నీలారి బాల నీళ్ళకెళ్ళిందో నీళ్ళకెళ్ళిందో
 ఎన్నడెల్లని బాల నీళ్ళకెళ్ళిందో నీళ్ళకెళ్ళిందో
 సక్కని సూర్యుడు సూడొచ్చినాడో సూడొచ్చినాడో
 సూశినంతసేపు చూసి జడవట్టి గుంజె జడవట్టి గుంజె
 ఇడువిడువు సూర్యుడా మా జడలిడువు మా జడలిడువు’’
అంటూ మా అమ్మ తిడుతుందనీ, కొడుతుందనీ కన్నెపిల్ల వేడుకోవడం, ఆమె చెప్పినా వినకుండా అతడు బలవంతం చేయడం, బలహీన క్షణాన ఆమె లొంగిపోవడం, గర్భం దాల్చడం జరిగింది.
 ‘‘గుట్టల్ల పొంగనే గుబులే పుట్టిందో గుబులే పుట్టిందో
 చెట్లల్ల పోంగనే చెమటాలొచ్చినవో చెమటాలొచ్చినవో
 ఉసుకుల్ల పోంగనే కూసులయ్య పుట్టె కూసులయ్య పుట్టె
  ఏటికీ కాల్వలు పారతున్నాయి పారుతున్నాయి
 పారేటి కాల్వల్ల బాలున్ని ఏసి బాలున్ని ఏసి’’
ఇలా హృదయవిదారకంగా పాట సాగుతుంది.
 బహు భార్యత్వం తగదని కూడా బతుకమ్మ పాటల్లోకి వచ్చింది.
 ‘‘రెండుగుట్టలా నడుమా కోల్ జడలా శంకరుడా
 స్నానం చేత్తురావయ్య కోల్ జడలా శంకరుడా
 దండెం మీద పట్టుదోతి  కోల్ ఆరే ఉన్నాది
 గౌరమ్మ గంగమ్మా కోల్ గవ్వలాడంగ
 గవ్వాచిట్లంగా కోల్ కయ్యామే పెరుగంగ’’
చివరికి ఆ కయ్యం వాళ్ళు కాసె పూసి, ఇద్దరూ మన్ను దెచ్చుకొని గోడ పెట్టుకునేవరకు వచ్చింది. ఇలాంటి కొట్లాటలు లోకంలో సాధారణమే కదా! అలాగే, వదినా మరదళ్ళకు సంబంధించి ఇలా సాగుతుంది.
 ‘‘అమ్మ ఏమన్నదే సిలకమ్మ సిలకా
 అమ్మ అన్నం తినమని చెప్పెనే సిలకా
 నాయిన ఏమన్నడే సిలకమ్మ సిలకా
 నాయన నాను చేయిస్తనన్నడే సిలకా
 అన్న ఏమన్నడే సిలకమ్మ సిలకా
 అన్న ఆరునెల్లు ఉండిపొమ్మన్నడే సిలకా
 వదిన ఏమన్నదే సిలకమ్మ సిలకా
 వదిన ఒద్దుపొమ్మన్నదే సిలకా’’

 సమిష్టి కుటుంబంలోని పొరపొచ్చాలు మామూలేకదా. స్త్రీల ఆలోచనలన్నీ భగవత్చింతన చుట్టూ ఉండాలని చెప్పేవీ లేకపోలేదు.
 ‘‘చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ
 బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ బావిలోన
 రాగి బిందె తీస్క రమణీ నీళ్ళకు పోతే
 రాములోరెదురాయె నమ్మా ఈ వాడలోన
 వెండి బిందె తీస్క వెలది నీళ్ళకు పోతే
 వెంకటేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన
 పగడాల బిందె తీస్క పడతీ నీళ్ళకు పోతె
 పరమాత్ముడెదురాయెనమ్మో ఈ వాడలోన
 బంగారు బిందె తీస్క భామ నీళ్ళకుపోతె
 భగవంతుడెదురాయె నమ్మో ఈ వాడలోన’’
ఈ పాటలో పైకి ఆ స్త్రీలకు భగవద్దర్శనమైనట్లు చెప్పుకుంటున్నా నిజానికి తమ మగస్నేహితులను కలుసుకున్నట్లు అంతరార్థంగా కనపడుతుంది.
 మరికొన్ని పాటల్లో స్త్రీలకు జరిగిన అన్యాయం కనబడుతుంది.
 ‘‘తూర్పుదిక్కునా ఉయ్యాలో- తులసీవానలు కురిసే ఉయ్యాలో
 పడమటి దిక్కునా ఉయ్యాలో- పాలవాన కురిసె ఉయ్యాలో
 దక్షిణపు దిక్కునా ఉయ్యాలో- దండి వానలు కురిసె ఉయ్యాలో
 ఉత్తరపు దిక్కునా ఉయ్యాలో- ఉరిమురిమి కురిసె ఉయ్యాలో
 ఆ వాన ఈ వాన ఉయ్యాలో- చెరువు నిండీపాయె ఉయ్యాలో
 కట్టమీది మైసమ్మ ఉయ్యాలో- వరము కోరిందమ్మ ఉయ్యాలో
 ఇస్తవా ఓ రాజ ఉయ్యాలో- పెద్దకోడలినైన ఉయ్యాలో’’

 అయితే రాజు తన మిగిలిన కొడుకులు, కోడండ్లను వదిలి, ఏ వివక్ష కారణంగానో చిన్నకోడలును నీళ్ళు తెచ్చే నెపంతో చెరువు గట్టుకు పంపుతాడు. వరద ఉధృతిలో బిందె మునగనందున ఆమెను మరింత లోతుగా పొమ్మని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడామె ఇంకా లోతట్టుకుపోయి చెరువులో మునిగిపోతూ-
 ‘‘నా శిరస్సు మునుగొచ్చె ఉయ్యాలో- నీ శిరస్సు కొట్టెయ్య ఉయ్యాలో’’ అని తిడుతూనే, ఆకాశాన బోయే పక్షులతో తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకూ-
 ‘‘మా తల్లిదండ్రులకు ఉయ్యాలో- బిడ్డలేదని చెప్పు ఉయ్యాలో
 తొట్టెల్ల బాలునికి ఉయ్యాలో- అమ్మ లేదని చెప్పు ఉయ్యాలో
 అంబాడె బాలునికి ఉయ్యాలో- అమ్మ లేదని చెప్పు ఉయ్యాలో’’
అంటూ సందేశం పంపుతుంది. మేఘ సందేశాన్ని తలపించే పాట ఇది. ఆ అవసరం అలాంటిది మరి. ఇక్కడ మరో విషయాన్ని గమనించవచ్చు. అంబాడే పిల్లవాడితోపాటు తొట్లె పిల్లవాడున్నాడు. అంటే వెంట వెంట కాన్పులను పట్టించుకోని కుటుంబ వాతావరణం. బలి త్యాగానికి ప్రతీక. ఒక గొప్పకార్యాన్ని నిర్వర్తించడంలో ప్రాణాలను తృణప్రాయంగా కైంకర్యం చేయడం. అంతేకాని ఒకరు చస్తే దేవతలు శాంతిస్తారనే మూఢనమ్మకం ప్రచారంలో ఉండడం, అర్భకులను బలి ఇవ్వడం విషాదకరం. ఇక్కడ అదే జరిగింది. ఇట్లా సామాజికంగా ఆయా కాలాలను బట్టి బాలనాగమ్మ కథ, ఎల్లమ్మ కథ, అక్కమహాదేవి కథలు పాటల్లో చోటు సంపాదించుకున్నవి.
 తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బతుకమ్మ పాట ఇలా రూపుదిద్దుకుంది.
 ‘‘నల్గొండ రాజ్యాన ఉయ్యాలో- నల్గొండ రాజ్యాన ఉయ్యాలో
 జనగామ తాలూక ఉయ్యాలో- ఇసునూరు గ్రామంలో ఉ॥
 ఎంత ఘోరము చూడు ఉయ్యాలో- ఆ దొరోడు పాడుగాను ఉ॥
 ఏమి చేస్తుండమ్మ ఉయ్యాలో- ఎంత అన్యాయమమ్మ ఉ॥
 ఎత్తై మనిషమ్మ ఉయ్యాలో- పాలకుర్తి ఐలమ్మ ఉయ్యాలో
 పెద్దపైసంతైన ఉయ్యాలో- పెట్టింది బొట్టు ఉయ్యాలో
 పాలకుర్తీలోన ఉయ్యాలో- వెట్టి చాకల్దమ్మ ఉయ్యాలో
 గట్టిదే ఐలమ్మ ఉయ్యాలో- సంగంబు పెట్టింది ఉయ్యాలో
 తానె సంగమాయె ఉయ్యాలో- సంగంలో ప్రజలకు ఉయ్యాలో’’

 పాలకుర్తి ఐలమ్మ విసునూరి రామచంద్రారెడ్డికి ఎదురొడ్డి తన కౌలు పొలంలో పండించుకున్న పంటకై  చేసిన పోరాటం ఈ పాటలో వ్యక్తమైంది. మరో పాటలో చంద్రమ్మ అనే స్త్రీ ఊళ్ళో జనాన్ని దొర వద్దకు జీతానికి తీసుకునిపోతుంది. దొర ఇవ్వాల్సిన కూలీ ఇవ్వకపోగా వాళ్లను చాకిరీతో పీల్చి పిప్పిచేస్తాడు. చంద్రమ్మ కూడా దొరకు వంత పాడుతుంది. అప్పుడు కూలీలంతా-
 ‘‘ఏమి పనియని ఉయ్యాలో- చేస్తివీ చంద్రమ్మ ఉయ్యాలో
 ‘‘పంచాద్రి బోర్డులో ఉయ్యాలో- చెట్టు ఉన్నాదమ్మ ఉయ్యాలో
 చెట్టుకూ కట్టేసి ఉయ్యాలో- యేపవి బరిగెలు ఉయ్యాలో
 శింతయూ బరిగెలు ఉయ్యాలో- రెండుమోపులు దెచ్చి  ఉ॥
 అర్ధశేరైనను ఉయ్యాలో- కారం తెచ్చిరి ఉయ్యాలో
 కండ్లల్ల గుప్పిరి ఉయ్యాలో- కట్టెలతో కొట్టిరి ఉయ్యాలో’’

 ఆపై చంద్రమ్మలో మార్పు వచ్చి ఆమె నాయకత్వంలోనే దొరపై తిరుగుబాటు చేస్తారు.
 సూర్యాపేట తాలూకా నల్గొండ జిల్లాలో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లక్షా యాభైవేల ఎకరాల భూమికి యజమాని. తన పొలంలో పనిచేసిన వాళ్లందరికీ నామమాత్రపు కూలీలిచ్చి పని చేయించుకునేవాడు. అందువల్ల పోరాటం సాగుతున్న కాలంలో-
 ‘‘పల్లెల్లో స్త్రీలంత ఉయ్యాలో- పరువు కాపాడుకొన ఉయ్యాలో
 బయలుదేరినారు ఉయ్యాలో- శీలరక్షణ కొరకు ఉయ్యాలో
 స్త్రీలంత కూడారు ఉయ్యాలో- లారీల చుట్టేసి ఉయ్యాలో
 లడాయి చేసిరి ఉయ్యాలో’’
అంటూ పాడుకున్నారు.
 1948 సెప్టెంబర్ 17న నిజాం సర్దార్ వల్లభాయిపటేలుకు లొంగిపోయాడు. సంఘం పోరాటం సాగిస్తూనే ఉంది. యూనియన్ సైన్యం భూస్వామ్య వర్గంతో చేతులు కలిపి ప్రజలను క్రూరంగా హింసించింది. ఆ సమయంలో పోరాట దిశగా పనిచేస్తున్న స్త్రీలను చైతన్య పరచడానికి-
 ‘‘అమ్మ భారతదేశమున ఉయ్యాలో- కాంగ్రెసు వచ్చిందమ్మ ఉ॥
 కాని కాంగ్రెసు రాజ్యాన ఉయ్యాలో- కలుపు ఉన్నాదమ్మ ఉ॥
 అమ్మ కలుపు దీస్తె ఉయ్యాలో- కష్టాలు తీరునమ్మ ఉయ్యాలో
 అమ్మ కమ్యూనిస్టు పద్ధతిన ఉయ్యాలో-ఎర్రజెండ ఎగరవేద్దాము ఉయ్యాల’’
అంటూ శ్రామిక రాజ్యాన్ని స్థాపించాలని పాడుకున్నారు.
 ఇది మరో ఘోర కథ. బోనగిరి గ్రామంలో నక్క ఆండాళమ్మ పెండ తెద్దామని ఊరిబయటకు వెళ్ళింది. ఒక దుర్మార్గుడు దర్గా లోపల పెండ చాలా ఉన్నదని నమ్మించి ఆమెను దారి తప్పించాడు. అక్కడ దర్గాలోపల ఉన్న ఆరుగురు గుండాలు ఆమెపై అత్యాచారం చేశారు. అదే జనం నాలుకలపై కన్నీటిపాటగా మారింది.
 ‘‘అమ్మ నీకు పేడ అందులో ఉన్నదని/ దరుగ లోపల త్రోవ దారిచూపినాడు / అదివిని ఆండాళు ఆనందముప్పొంగి/ పరుగు పరుగునా లోనికి పరుగెత్తె / పేడకొరకు చెయ్యి పెట్టే నేలపైన/ గది నుండి వచ్చినా గా గుండాగాడు / ఎర్రదస్తిని తీసి కండ్లెకు బిగియించి/ అర్రలోపల వేసి భరియింపరానట్టి / బాధలెన్నో పెట్ట  ప్రాణాలు విడిచింది/ శవము నెత్తుకపోయి పైటకొంగున చాల / పలుగురాళ్ళను గట్టి పాడుపడ్డా పాత నూతిని జూచి/ పైనుంచి వారలు పడవేసిరందులో’’
 1954లో వసంత వాగు వద్ద పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కూడా ఉయ్యాల పాటగా దర్శనమిచ్చింది.
 ‘‘శ్రీరామ జయరామ ఉయ్యాలో- శ్రీ సీతారామ ఉయ్యాలో
 హే రామ రఘురామ ఉయ్యాలో - అయోధ్యరామ ఉయ్యాలో
 ...అయ్యలారా వినుడి ఉయ్యాలో- అమ్మలారా వినుడి ఉ॥
  రెండురోజులనుండి ఉయ్యాలో -  మెండుగా వర్షాలు ఉయ్యాలో
 కుండతో నీళ్ళను ఉయ్యాలో - కుమ్మరించినట్లు ఉయ్యాలో’’

 మొదట ఒక లోకల్ బండి జనగామ నుండి బయలుదేరింది. ఆ తర్వాత వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ను కూడా గార్డు వదిలిండు. యశ్వంతపురం బ్రిడ్జిపైకి రాగానే కొంత దూరం పోయిందో లేదో-
 ‘‘ఉయ్యాల రీతిగా వూగెనే పట్టాలు
 పెళ్లుమని పట్టాలు బెడిసి విరిగినావి
 తల్లక్రిందుల గాడి డొల్లుచున్నాదమ్మ
 దేవునీ కృపచేత యీవలొక్క డబ్బ ఆవలొక్క డబ్బ
 మద్య డబ్బాలైదు మాయమగూచుండెనే
 గొర్ల మందారీతి తర్లు చున్నారమ్మ
 చెట్టుకొక్కా శవము గట్టుకొక్కా శవము
 పట్టాలలోనిరికి పడియుండె వ్రేలాడె
 చెట్టుకే వెంట్రుకలు తట్టుకొని వ్రేలాడి’’

 ఘోరంగా జనం చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కాంగ్రెసువాళ్లే కాకుండా యువత కూడా తరలి వెళ్లి సేవ చేసింది. జడ్చర్ల ప్రమాదం, లాథూర్ భూకంపం లాంటి దుర్ఘటనల్ని కూడా పాటలుగా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడం పరిపాటయ్యింది. అదే క్రమంలో వీరుల దేశనాయకుల పాటలు వచ్చాయి.
 ‘‘ఒక్కేసి పువ్వేసి సందమామ - ఒక్క జాము ఆయె సందమామ
 తెలంగాణా చరితమ్ము సందమామ - తెలియజెప్పుతాను సందమామ’’
అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు పాటలుగా వెల్లువెత్తాయి. ప్రజల కాంక్షలు అందులో వెల్లడైనాయి. ఇలా బతుకమ్మ పాట కాలంతో పాటు తన వరుసలను మార్చుకుంటూ పోయింది. సమాజానికి దర్పణం పట్టడంలో ముందు వరుసలో నిలిచింది.
 
- తిరునగరి దేవకీదేవి
 
 ‘‘కలవారికోడలూ ఉయ్యాలో - కలికి కామాక్షి ఉయ్యాలో
 కడుగుచున్నది పప్పు ఉయ్యాలో - కడవలో బోసి ఉయ్యాలో
 అప్పుడే వచ్చెను ఉయ్యాలో - ఆమె పెద్దన్న ఉయ్యాలో
 కాళ్ళకూ నీలిచ్చి ఉయ్యాలో - కన్నీళ్ళు నింపె ఉయ్యాలో’’
 అన్న చెల్లెలిని అత్తింటి వాళ్ళ అనుమతి తీసుకొని రమ్మనగా, అత్త దగ్గరికి వెళ్లి,
 ‘‘వంట చేసేటి తలి ్లఉయ్యాలో - ఓ అత్తగారు ఉయ్యాలో
 మాయన్నలొచ్చారు ఉయ్యాలో - మమ్మంపుతార ఉయ్యాలో’’ అని అడుగుతుంది.
 ‘‘నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో - నీమామ నడుగు ఉయ్యాలో’’ అని అత్త బదులిస్తుంది. ఆ క్రమంలో ఆమె మామను, బావను, అక్కను అడిగి చివరగా భర్త అనుమతి పొందడమేకాదు ఇరుగుపొరుగువారికి చెప్పి బయలుదేరుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement