రిపోర్టింగ్‌కి సిద్ధమౌతూ.. సీమ
ఈ ఫీలింగ్ ప్రతి చోటా ఉంటోంది. కానీ ఉండొచ్చా! అందరం ఈ భూమ్మీది వాళ్లమేగా?! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. కిరీటంపై ముళ్లలా జాతి విద్వేషం! బ్రిటన్‌లో గాంధీ విగ్రహం ఉంటుంది. వెనకే.. దాగి ఉండే జాత్యహంకారం. సీమా కొటేచా సీనియర్ జర్నలిస్ట్. సంక్షోభం ఎక్కడుంటే అదే తన జన్మభూమి. ‘ఎక్కడి నుంచో వచ్చి...’ అనే మాట ఈ విశ్వ పౌరురాలికీ తప్పలేదు!
బిబిసి సీనియర్ రిపోర్టర్ సీమా కొటేచా లండన్‌లోని తన ప్రధాన కార్యాలయానికి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. ‘‘ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్‌ని సడలించాలని భావిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి?’’.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈస్ట్ మిడ్‌ల్యాండ్ ప్రాంతంలోని లెహ్‌స్టర్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు సీమ, ఆమె కెమెరా బృందం. ఇంగ్లండ్‌లో స్థానికులు కాని వాళ్లు యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న తొలి పట్టణం లెహ్‌స్టర్. గుజరాతీలు ఎక్కువగా ఉంటారు. గాంధీ మహాత్ముడి విగ్రహం కూడా ఉంది. అయితే అక్కడ జాతివిద్వేషం కూడా ఉన్నట్లు ఆదివారం నాడు సీమ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తొలిసారిగా బయటపడింది!
తల్లిదండ్రులతో సీమ , సీమా కొటేచా: ప్రోగ్రామ్‌కి అంతరాయం
లెహ్‌స్టర్ సిటీ సెంటర్‌లో సీమ ఒక్కొక్కరినీ అభిప్రాయం అడుగుతున్నారు. వారిలో కొందరు కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ఉన్నారు. సీమ టీమ్ ముందే వారిని ఎంపిక చేసి పెట్టుకుంది. అయితే అభిప్రాయం తెలుసుకునే లోపే సీమ వెనుక నుంచి కెమెరాలో కనిపించేలా ఒక వ్యక్తి సీమను కామెంట్ చేయడం మెదలు పెట్టాడు. ‘యూ.. పాకీ ఉమన్, గో అవే’ అన్నాడు. పాకిస్తానీలను, ఇతర ఆసియా దేశాల వారిని కరడుగట్టిన బ్రిటన్, అమెరికా జాతీయవాదులు అవమానకరంగా అనే మాట అది. ఒంటి రంగును బట్టి కించపరచడం. సీమ భారతీయ సంతతి యువతి. తను పుట్టింది ఇంగ్లండ్‌లోనే. బేసింగ్‌స్టోక్‌లో.
తనను తిడుతున్న వ్యకిని సీమ మొదట పట్టించుకోలేదు. ఇలాంటివి ఆమెకు కొత్త కూడా కాదు. ఆమె స్వస్థలం బేసింగ్‌స్టోక్‌లోనే 2016లో బ్రెగ్జిట్‌పై వోక్స్ పాప్ (జనాభిప్రాయ సేకరణ)లో ఉన్నప్పుడు తొలిసారి ఈ మాట విన్నారు సీమ. తను పుట్టాక తొలిసారి! జాతివిద్వేష దూషణలు ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. మళ్లీ ఇప్పుడు లెహ్‌స్టర్‌లో! అతడు ఆ ఒక్కమాటలో ఆగలేదు. బతకడానికి వస్తారని, ఉద్యోగాలన్నీ దోచుకుంటారనీ, తక్కువ జాతివారనీ.. ఇలా సాగుతూనే ఉంది. అవన్నీ లైవ్‌లో వెళ్లిపోతున్నాయని గమనించిన తక్షణం తన ప్రోగ్రామ్‌ని ఆపేశారు సీమ. అభిప్రాయాల కోసం తను పిలిపించిన వారికి క్షమాపణ కూడా చెప్పారు. రిపోర్టింగ్‌ని అడ్డుకోవడమే కాకుండా, తన ఉద్యోగులపై జాతి విద్వేష దూషణలు చేసిన వ్యక్తిని బిబిసి తీవ్రంగా పరిగణించింది. కొద్ది గంటల్లోనే గ్రెన్‌ఫీల్డ్ రోడ్ అనే యాభై ఏళ్ల ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. జూన్ పదిహేనున అతడు లెహ్‌స్టర్ క్రౌన్ కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని ఆదేశించి బెయిల్‌పై విడుదల చేశారు. దీనర్థం గ్రెన్‌ఫీల్డ్ తగిన శిక్షను అనుభవించబోతున్నాడని. వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు. కెమెరాలో ఉన్నవి చాలు.
ఈ విషయంలో బ్రిటన్ మీడియా మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది. 2003లో బిబిసి రేడియోలో తన కెరియన్‌ని ప్రారంభించారు సీమ. ‘పనోరమా’ రేడియో 4లోని ‘టుడే ప్రోగ్రామ్’, ‘బిబిసి న్యూస్’ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆప్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో హెల్మండ్ ప్రావిన్స్ నుంచి, సిరియా శరణార్థుల సంక్షోభంలో లెబనాన్ నుంచి, 2010 హైతీ భూకంప బాధిత ప్రాంతాల నుంచి సీమ చేసిన రిపోర్టింగ్ ఆమెను అత్యుత్తమస్థాయి జర్నలిస్టుగా నిలబెట్టింది. సీమ బేసింగ్‌స్టోక్‌లోని క్వీన్స్ మేరీ కాలేజ్‌లో చదివారు. లండన్ గోల్డ్‌స్మిత్స్ యూనివర్శిటీలో జర్నలిజం చేశారు. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. సీమ, శ్యామ్ (సీమ అన్న).
Comments
Please login to add a commentAdd a comment