సాయం కాదు.. విచారణ కావాలి
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల కుంభకోణం వ్యాపమ్ కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి జర్నలిస్టు కుటుంబం షాక్ ఇచ్చింది. జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటామన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సాయాన్ని తిరస్కరించింది. ప్రభుత్వం తమకు సహాయం అందించాల్సిన అవసరం లేదని, ఈ మిస్టీరియస్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
కాగా రిపోర్టింగ్కు వెళ్లి అనుమానాస్పదంగా మరణించిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్షయ్ మృతి వల్ల ఆ కుటుంబం సర్వం కోల్పోయిందని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ కేసులో నిందితురాలైన నమ్రతా దామర్ అనుమానాస్పద మరణం (అది హత్యేనని తర్వాత తేలింది)పై ఆరా తీయడానికి వెళ్లి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ చనిపోయారు. ఈ మృత్యుహేల ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గురువారం సుప్రీం ఆదేశాలు జారీచేసింది.