vyapam case
-
వ్యాపం స్కాంలో సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి ముడుపులు చెల్లించి పెద్దమొత్తంలో వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు వైద్య విద్యార్థులను అరెస్టు చేసి జైలులో వేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్లు దుమారం రేపింది కూడా. ఈ కేసును సీబీఐ విచారణ చేయాలని ఆ సమయంలో సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశించింది. అదేసమయంలో మధ్యప్రదేశ్ లోని వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 72 కేసులను తమ అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగానే విచారణ చేసిన సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థల వివరాలను పరిశీలించిన ధర్మాసనం అక్రమాలకు కారణమైన 2008-2015 ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సు ఆ కాలానికి చెల్లదంటూ తీర్పునిచ్చింది. -
దర్యాప్తు ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రే
భోపాల్: 'వ్యాపం కుంభకోణాన్ని మొదట గుర్తించిందే నేను. అడ్మిషన్లు, రిక్రూట్మెంట్లలో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించా' అంటూ నిన్నటివరకు చెప్పుకొచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాటలు పూర్తిగా అవాస్తవాలని తేలింది. కుంభకోణం సంగతి ఆయనకు ముందే తెలుసని, ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు ఆదేశించడంలో ఆలస్యం చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2007 నుంచి 2010 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు ఆధారాలని నాటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేటి ఆప్ నేత సక్లేచా ఆదివారం మీడియాకు చెప్పారుజ 'వ్యాపం ద్వారా నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయని 2009లో అసెంబ్లీ సాక్షిగా నేను ప్రశ్నించాను. వైద్య విద్యా శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సీఎం చౌహాన్ నా ప్రశ్నకు.. 'ఆ విషయంపై సమగ్ర సమాచారాన్ని తెప్పిస్తున్నాం' అని బదులిచ్చారు. రెండేళ్ల తర్వాత మరో సభ్యుడు కూడా సభలో ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాడు. అందుకు సీఎం చౌహానే మళ్లీ సమాధానమిస్తూ 'అక్రమాలకు పాల్పడిన విద్యార్థులు ఎవరనేది గుర్తించలేకపోయాం' అని సమాధానమిచ్చారు. మరో రెండేళ్లు గడిచిన తర్వాత, అంటే 2011 నవంబర్ 29 మాత్రం సీఎం సభలో ఒక ప్రకటన చేశారు. 'మొత్తం 114 మంది విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్లు పొందారు' అని. రకరకాల సందర్భాల్లో సీఎం మాటలను పరిశీలిస్తే ఆయన కావాలనే కుంభకోణం వివరాలను బయటికి రానీయకుండా అడ్డుకున్నారని అర్ధమవుతుంది. తద్వారా దర్యాప్తు ఆలస్యానికి కారణం కూడా ఆయనే' అని సక్లేచా వివరించారు. -
సాయం కాదు.. విచారణ కావాలి
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల కుంభకోణం వ్యాపమ్ కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి జర్నలిస్టు కుటుంబం షాక్ ఇచ్చింది. జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటామన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సాయాన్ని తిరస్కరించింది. ప్రభుత్వం తమకు సహాయం అందించాల్సిన అవసరం లేదని, ఈ మిస్టీరియస్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా రిపోర్టింగ్‌కు వెళ్లి అనుమానాస్పదంగా మరణించిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్షయ్ మృతి వల్ల ఆ కుటుంబం సర్వం కోల్పోయిందని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో నిందితురాలైన నమ్రతా దామర్ అనుమానాస్పద మరణం (అది హత్యేనని తర్వాత తేలింది)పై ఆరా తీయడానికి వెళ్లి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ చనిపోయారు. ఈ మృత్యుహేల ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గురువారం సుప్రీం ఆదేశాలు జారీచేసింది. -
వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాం పేరుగాంచిన ఈ కుంభకోణం కేసును ఉన్నత న్యాయస్థానం సీబీఐ అప్పగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటూ సీబీఐ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సుప్రీం తెలిపింది. గవర్నర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనేది తేల్చకుండా తాత్సారం చేసిందని మండిపడింది. ఈ విషయం హైకోర్టు చేతిలో ఉందంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా ఈ కుంభకోణంపై దాదాపు తొమ్మిది పిటిషన్లు దాఖలుకాగా పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
'వ్యాపం' కేసులో కొత్త ట్విస్ట్
భోపాల్: వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) కుంభకోణం దర్యాప్తు అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణను సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్ధనతో ఆ రాష్ట్ర హైకోర్టు విభేదించింది. ఈ మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 20 వరకు విచారించబోనని బుధవారం స్పష్టం చేసింది. దీంతో సీబీఐ విచారణ అంశం ఇప్పటికి తెరముగైనట్లే కనిపిస్తోంది. మరోవైపు సీఎం చౌహాన్ రాజీనామాచేసి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. అయితే రాజీనామా చేసే ప్రసక్తేలేదని సీఎం చౌహాన్ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పదుల సంఖ్యలో నిందితులు, సాక్షులు అనుమానాస్పదంగా మృతిచెందుతున్న సంగతి తెలిసిందే.