దర్యాప్తు ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రే
భోపాల్: 'వ్యాపం కుంభకోణాన్ని మొదట గుర్తించిందే నేను. అడ్మిషన్లు, రిక్రూట్మెంట్లలో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించా' అంటూ నిన్నటివరకు చెప్పుకొచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాటలు పూర్తిగా అవాస్తవాలని తేలింది. కుంభకోణం సంగతి ఆయనకు ముందే తెలుసని, ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు ఆదేశించడంలో ఆలస్యం చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2007 నుంచి 2010 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు ఆధారాలని నాటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేటి ఆప్ నేత సక్లేచా ఆదివారం మీడియాకు చెప్పారుజ
'వ్యాపం ద్వారా నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయని 2009లో అసెంబ్లీ సాక్షిగా నేను ప్రశ్నించాను. వైద్య విద్యా శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సీఎం చౌహాన్ నా ప్రశ్నకు.. 'ఆ విషయంపై సమగ్ర సమాచారాన్ని తెప్పిస్తున్నాం' అని బదులిచ్చారు. రెండేళ్ల తర్వాత మరో సభ్యుడు కూడా సభలో ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాడు. అందుకు సీఎం చౌహానే మళ్లీ సమాధానమిస్తూ 'అక్రమాలకు పాల్పడిన విద్యార్థులు ఎవరనేది గుర్తించలేకపోయాం' అని సమాధానమిచ్చారు. మరో రెండేళ్లు గడిచిన తర్వాత, అంటే 2011 నవంబర్ 29 మాత్రం సీఎం సభలో ఒక ప్రకటన చేశారు. 'మొత్తం 114 మంది విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్లు పొందారు' అని. రకరకాల సందర్భాల్లో సీఎం మాటలను పరిశీలిస్తే ఆయన కావాలనే కుంభకోణం వివరాలను బయటికి రానీయకుండా అడ్డుకున్నారని అర్ధమవుతుంది. తద్వారా దర్యాప్తు ఆలస్యానికి కారణం కూడా ఆయనే' అని సక్లేచా వివరించారు.