'వ్యాపం' కేసులో కొత్త ట్విస్ట్
భోపాల్: వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) కుంభకోణం దర్యాప్తు అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణను సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్ధనతో ఆ రాష్ట్ర హైకోర్టు విభేదించింది. ఈ మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 20 వరకు విచారించబోనని బుధవారం స్పష్టం చేసింది. దీంతో సీబీఐ విచారణ అంశం ఇప్పటికి తెరముగైనట్లే కనిపిస్తోంది.
మరోవైపు సీఎం చౌహాన్ రాజీనామాచేసి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. అయితే రాజీనామా చేసే ప్రసక్తేలేదని సీఎం చౌహాన్ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పదుల సంఖ్యలో నిందితులు, సాక్షులు అనుమానాస్పదంగా మృతిచెందుతున్న సంగతి తెలిసిందే.