మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్‌లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి. హాయిగా ప్రపంచాన్ని చుట్టేసి రిలాక్స్ అవ్వండి. ఇంతకీ ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అనుకుంటున్నారా.. అబ్బే ఏం లేదండీ మీలాంటి వారి కోసమే ఎయిర్ ఏషియా 'బీట్‌దబడ్జెట్' పేరిట కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకుని కాస్త రీచార్జ్ అవుతారనే మా చిన్ని సలహా. తప్పక పాటించి టికెట్లు బుక్ చేసేస్తారు కదూ.
కౌలాలంపూర్
నవీనతకు, సంస్కృతికి, సహజమైన ప్రకృతి అందాలకు నెలవైన కౌలాలంపూర్‌ను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. అక్కడి మడ అడవుల్లోని వృక్ష, జంతుజాలాలను, వన్య ప్రాణులను చూస్తే చాలు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పొద్దంతా బీచ్‌లలో సేదతీరి, రాత్రి విశ్రాంతి పొందే వీక్షకులతో నగరం ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. కెడాయ్ ద్వీప సమూహానికి చెందిన లాంగ్ కావి ద్వీపం భూతల స్వర్గంలా మనసును రంజింపజేస్తుంది. బీచ్‌లలో స్కూబా డైవింగ్ చేయొచ్చు. మరో అద్భుతమైన ప్రదేశం జోహార్‌లోని లెగోలాండ్. ఇక్కడ సరసమైన ధరలకే షాపింగ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ భోజన ప్రియులను అలరించేందుకు రెస్టారెంట్లు, ఉల్లాసంగా గడిపేందుకు థీమ్ పార్కులు ఉన్నాయి. సో మీ ట్రిప్‌లో కౌలాలంపూర్ ఉండేలా చూసుకోండి మరి.
సింగపూర్....
గార్డెన్ సిటీగా ప్రసిద్ధి పొందిన సింగపూర్‌లో విభిన్న జాతుల వ్యక్తులు మీకు తారసపడతారు. ఠీవీ ఉట్టిపడేలా రాజమార్గాలతో నిండిన నగరం తన అందాలతో కనువిందు చేస్తుంది. ఆకాశహార్మ్యాలు, వలస కాలనీలు, వీధి మార్కెట్లు, పురాతన హిందూ, బౌద్ధ మతాలకు చెందిన ఆలయాలతో అలరారే సింగపూర్‌ను చూసి తీరాల్సిందే. సుమారు 1000 విభిన్న జీవ జాతులతో నిండిన నేషనల్ ఆర్కిడ్ గార్డెన్, అద్భుతమైన మెరీనా బే సాండ్స్ రిసార్ట్, అత్యాధునిక హంగులతో నిర్మితమైన చంగీ అంతర్జాతీయ విమానాశ్రయం, అందులో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
బాలీ....
ప్రకృతి రమణీయ దృశ్యాలకు చిరునామా బాలీ ద్వీపం. కొండలు, ఇసుక బీచ్‌లు, పంటపొలాలు, అగ్ని పర్వతాలతో భూతల స్వర్గాన్ని తలపించే బాలీతో మీరు లవ్‌లో పడటం గ్యారెంటీ. సాయంత్రం వేళ 'కుటా' బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడా సందర్శించాల్సిన ప్రదేశం బాలీ సాంస్కృతిక రాజధాని ఉబుద్. ఇక్కడి ఆలయాలను దర్శిస్తూ, బాలీసంస్కృతిని ఎంజాయ్ చేస్తూ గడిపేయొచ్చు. మనోల్లాసం, ప్రశాంతత కోరుకునే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది.
మనీలా....
'ప్యారిస్ ఆఫ్ ఏషియా' గా పిలుచుకునే మనీలా ప్రపంచంలోని టూరిస్ట్ ఫ్రెండ్లీ ప్రదేశాల్లో ఒకటి. దక్షిణాసియా, యూరోపియన్ సంస్కృతుల సంగమంతో ఆశ్చర్యానికి గురిచేసే మనీలా ప్రకృతి అందాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవు. ఉల్లాసంగా గడపడానికి, షాపింగ్ చేయాలనుకునే వారు అత్యంత విలాసవంతమైన మాల్ ఆఫ్ ఏషియాకు వెళ్లి తీరాల్సిందే. కుటుంబంతో కలిసి ఓషన్ పార్క్, మౌంటేన్ పినాటుబో సందర్శించి మీ డైరీలో ఈ అందమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోండి.
హో చి మిన్ సిటీ.....
వియత్నాంలోని అత్యంత సుందర ప్రదేశం. పురాతన, నవీన సంస్కృతులతో విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రదేశాలు, మ్యూజియాలు, మార్కెట్లు, రెస్టారెంట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. సిటీ చరిత్రను ప్రతిబింబించే హో చి మిన్ మ్యూజియం చూడదగ్గ ప్రదేశం. అలసిపోతే రిలాక్స్ అవటానికి, మీలో చైతన్యం నింపటానికి స్పాలు అందుబాటులో ఉంటాయి. సైకిల్, టాక్సీలను ఆశ్రయించి సిటీ అంతా చుట్టేస్తూ పనిలో పనిగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు.
ఫుకెట్.....
థాయ్‌లాండ్‌లోని అతి పొడవైన సుందర ద్వీపం. సముద్ర తీరాన తాటి చెట్లతో నిండిన బీచ్‌లతో ఆహ్లాదాన్ని పంచుతుంది. సెయిలింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. రాత్రివేళ వెన్నెల్లో తెల్లని ఇసుక తిన్నెల్లో సేదతీరుతూ, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేందుకు అత్యంత అనువైన ప్రదేశం. మానసిక ప్రశాంతత పొందాలంటే మీ లిస్ట్‌లో ఫుకెట్ పేరు ఉండి తీరాల్సిందే.
బ్యాంకాక్.....
థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ఆకాశహార్మ్యాలు, చారిత్రక కట్టడాలు, విలాసవంతమైన డైనింగ్ హాల్స్, తెల్లని ఇసుకతో కూడిన బీచ్ అందాలకు చిరునామా ఈ నగరం. సియామ్ వాటర్ పార్కు, ద గ్రాండ్ ప్యాలెస్, త్రీ డైమెన్షనల్ సాంకేతికతో కూడిన ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ వంటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు బ్యాంకాక్ సొంతం. ఒకే చోట 1500 స్టాల్స్‌తో షాపింగ్ ప్రియులను అలరించేందుకు చాటుచక్ మార్కెట్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం టికెట్ బుక్ చేసేయండి.
న్యూజిలాండ్.....
పర్వతాలు, వర్షారణ్యాలు, హిమనీనదాలు, నదులతో ఓలలాడే ప్రకృతి అందాలు వీక్షకులను కట్టిపడేస్తుంది న్యూజిలాండ్. స్కైడైవింగ్, జెట్ బోటింగ్, మౌంటేన్ బైకింగ్, బంగీ జంప్ చేయాలనుకునే వారికి సరైన గమ్యస్థానం న్యూజిలాండ్. ప్రపంచంలోని భూఉష్ణ మండలంలో ఒకటైన 'రొటోరా'కు వెళితే వేడి నీటి బుగ్గలు, మట్టి కుంటలు చూడవచ్చు. రుచికరమైర భోజనం కోసం 'నేపియర్' కు వెళ్లాలి. న్యూజిలాండ్‌లోని అతి పెద్దదైన ఆక్లాండ్ సిటీ బీచ్‌లు, ద్వీపాలు, అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. తమ ట్రిప్‌ను సాహసయాత్రగా మార్చుకోవాలనుకునేవారు ఆక్లాండ్‌ను ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే.
ఆస్ట్రేలియా.....
ఒకప్పుడు బ్రిటీష్ వలస కాలనీగా విరాజిల్లి రాణిగారి దర్పానికి ప్రతిబింబంగా నిలిచింది. అద్భుతమైన బీచ్‌లకు, దట్టమైన వర్షారణ్యాలకు ప్రసిద్ధి. సముద్ర తీరాన ఎంజాయ్ చేయాలనుకునేవారు గ్రేటర్ బారియర్ రీఫ్ వెళ్లి, అక్కడి వన్యప్రాణులను వీక్షించాల్సిందే. సహజమైన సున్నపు రాళ్ల గనులను చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. ఆడవారికి ఎంతో ప్రియమైన రత్నాలు అక్కడి జెమ్ మార్కెట్లలో విరివిగా లభిస్తాయి. అడిలైడ్‌ను కూడా సందర్శిస్తేనే మీ ట్రిప్ పూర్తైన తృప్తి కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment